ఆలయాలకు శ్రావణ శోభ
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:28 AM
శ్రావణ మాసం శుక్రవారం ప్రారంభం కావడంతో అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
భీమవరం టౌన్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): శ్రావణ మాసం శుక్రవారం ప్రారంభం కావడంతో అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని మావుళ్లమ్మ ఆలయం, సోమేశ్వర, జనార్దనస్వామి ఆలయం, ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ అమ్మవార్లు, శ్రీరాంపురం కనకదుర్గ, పలు వార్డులలో అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.
ప్రత్యేక అలంకరణలో వాసవీ మాత
పెనుగొండ, జూలై 25(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం మొదటి శుక్రవారం పెనుగొండ వాసవి శాంతి ధామ్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారికి గాజుల అలంకరణ
పెనుమంట్ర, జూలై 25(ఆంధ్రజ్యోతి): అమ్మవారి ఆలయాలు శుక్రవా రం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడాయి. మార్టేరు శివారు శివరావు పేటలోని కనకదుర్గను మట్టి గాజులతో అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని సహస్ర నామ కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ చైర్మన్ తేతలి రాజారెడ్డి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో గాజులతో అలంకారం చేశారు. పెనుమంట్ర కనకదుర్గమ్మ అమ్మవారికి పంచామృతా లతో అభిషేకాల నిర్వహించి కుంకుమార్చన నిర్వహించారు. మార్టేరు మావుళ్లమ్మ, కామాక్షి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.