చిన్నారులకు అర్థమయ్యేలా ..
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:45 PM
ఒకటి, రెండు, మూడు తరగతుల విద్యార్థులకు పుస్తక బరువు తగ్గించి సులువుగా పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకువస్తున్నది.
ఒకటి, రెండు తరగతికి 62 వస్తువులతో విద్యాబోధన
జిల్లాలో 1099 పాఠశాలల్లో 10,831 మందికి బోధన
భీమవరం రూరల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఒకటి, రెండు, మూడు తరగతుల విద్యార్థులకు పుస్తక బరువు తగ్గించి సులువుగా పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకువస్తున్నది. ఇప్పుడు ఒకటి, రెండు తరగతుల చిన్నారులకు ‘జూదూయి పిఠారా’ పేరుతో 62 వస్తువుల కిట్‌లను పాఠశాలలకు అందించారు. ఆ వస్తువులతో రోజుకు గంటసేపు విద్యాబోధన అందిస్తున్నారు. జిల్లాలో 1,099 ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలకు కిట్లను పంపిణీ చేశారు. వీటి ద్వారా ఒకటవ తరగతి 5,222 చిన్నారులకు, రెండవ తరగతి 5,609 మందికి బోధన చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, లెక్కలకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉంటాయి. పూసల చక్రం, బిల్డింగ్ బ్లాక్, జూనియర్ అబాకస్, కిచెన్ సెట్, ఆల్ఫాబేటికల్ ట్రాపింగ్ బోర్డు వంటి వస్తువులను చూపిస్తూ ఉపాధ్యాయులు బోధిస్తారు. పుస్తకాలు, బోర్డులపై కంటే వస్తువలను చూపిస్తూ వివరిస్తే విద్యార్థులకు గుర్తుంటుంది. ఈ వస్తువులతో బోధన పట్ల చిన్నారులు ఆసక్తి చూపుతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పలురకాల బొమ్మలు కలిగిన చార్టులను పాఠశాలలకు విద్యాశాఖ అందిం చింది. ప్రతిజ్ఞ, ఋషిలు ఉన్న సమయంలో జీవన చిత్రపటం, ఆరోగ్య సూత్రాలు తెలిపే చిత్రపటాలు ఉన్నాయి. వీటిని పాఠశాల తరగతుల్లో గోడలకు పెట్టి వీటి గురించి తెలుపనున్నారు.