Share News

పోరుబాట

ABN , Publish Date - May 13 , 2025 | 12:12 AM

సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు, సీహెచ్‌వోలు, రైతులు పోరు బాట పట్టారు.

పోరుబాట
కలెక్టరేట్‌ వద్ద వంట వార్పుతో సీహెచ్‌వోల నిరసన

సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు, సీహెచ్‌వోలు, రైతులు పోరు బాట పట్టారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల బదిలీ విధానాలపై యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సీహెచ్‌వోలు 15 రోజులుగా చేపట్టిన ఆందోళనలో భాగంగా వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటూ మాస్టిన్‌లు ఆందోళన చేపట్టారు. కాళ్ళలో భూ రికార్డుల ఆన్‌లైన్‌ చేయడంలో అవకతవకలపై తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.

ఉపాధ్యాయుల ధర్నా

ఏలూరు అర్బన్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల బదిలీ విధానాలపై అసంబద్ధతకు నిరసనగా యూటీఎఫ్‌ పిలుపు మేరకు డీఈవో కార్యాలయం వద్ద సోమవారం టీచర్లు, సంఘ నాయకులు ఽఽధర్నా నిర్వహించారు. ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సంఘం (జేఏసీ) ఉమ్మడి జిల్లా చైర్మన్‌ సీహెచ్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ పాఠశాల విద్యలో ఒక ముఖ్యఅధికారి వైఖరిని ముఖ్య మంత్రి, విద్యాశాఖ మంత్రి గమనించాలన్నారు. ఇంత వరకు ఉద్యోగులకు పీఆర్సీ ఆర్థిక బకాయిలు, డీఏలు ఇవ్వలేదని, 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించ లేదని విమర్శించారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించ నున్నట్టు వెల్లడించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ జీవో 117 రద్దుచేయడం లేదా ప్రత్యామ్నాయ జీవోను విడుదల చేయలేదన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 1:20, ఉన్నత పాఠశాలల్లో 1:45 నిష్పత్తిలో ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలను యథా తథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ టీచర్ల ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న అమరావతిలో విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఈవో వెంకటలక్ష్మమ్మకు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, జేఏసీ ఉమ్మడి జిల్లా సెక్రటరీ జనరల్‌ రామారావు, యూటీఎఫ్‌ నాయ కులు సుభాషిణి, షేక్‌ ముస్తఫాఅలీ, వెంకటేశ్వరరావు, రంగమోహన్‌, ఉపాధ్యాయులు, సీఐటీయూ నాయకులు లింగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి లెనిన్‌ పాల్గొన్నారు.

వంటావార్పుతో సీహెచ్‌వోల నిరసన

ఏలూరు రూరల్‌: కమ్యూనిటీ హెల్త్‌ అధికారులు (సీహెచ్‌వోలు) న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న ఆందోళన సోమవారం 15వ రోజుకు చేరింది. సమ్మె శిబిరం వద్ద వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ సీహెచ్‌వోలుగా 6 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్‌ చేయాలని కోరారు. జాతీయ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన పెంపుదలను అమలు చేయాలని, ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నిర్ధిష్టమైన జాబ్‌ఛార్టులు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి

కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి మహాప్రభో అంటూ మండవల్లిలోని హిందూ మాస్టిన్‌ కులానికి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ 80 ఏళ్లుగా మండవల్లిలో మాస్టిన్‌ కులానికి చెందిన 100 కుటుంబాల వారు ఉన్నారన్నారు. జిల్లాల పునర్వీభజన తరువాత కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన నాటి నుంచి వారికి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బుద్దుల చంటి, బుద్దుల అస్మిత, ఎన్‌.రషిత, బి.వెంకటరమణ, ఎన్‌.తేజస్విని పాల్గొన్నారు.

భూ రికార్డుల్లో అవకతవకలు

కాళ్ళ, మే 12 (ఆంధ్రజ్యోతి): కాళ్ళ గ్రామంలో భూ రికార్డుల ఆన్‌లైన్‌ చేయడంలో అవకతవకలు జరిగాయని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ బ్రిటిష్‌ కాలంలో జరిగిన సర్వే ప్రకారం కాళ్ళ వ్యవసాయ భూముల విస్తీర్ణం సుమారు 3,862 ఎకరాలు అన్నారు. భూములను ఆన్‌లైన్‌ చేసిన సందర్భంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్‌ సుందర్‌ సింగ్‌కు వివరించారు. అనర్హులను 1బీ లో నమోదు చేయడం వల్ల అర్హులంతా రోడ్డున పడ్డామన్నా రు. ఇటీవల భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం పకడ్బందీగా రీ సర్వే చేయిస్తున్నప్పటికీ భూ సమస్యలపై ఫిర్యాదులు మరింత పెరిగాయన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాళ్ళ గ్రామంలో రీసర్వే జరిగి చాలా కాలమైనప్పటికీ గోప్యతను ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఒక్కొక్క రైతుకు ఎకరాకు 2 సెంట్ల నుంచి 40 సెంట్లు భూమి వ్యత్యాసం చూపిస్తున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక బృందంతో రెవెన్యూ రికార్డులను ఆడిట్‌ చేయిం చి గ్రామంలోని భూ సమస్యలు పరిష్కరించాలన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:12 AM