Share News

ఎస్జీటీ బదిలీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ఓకే !

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:45 AM

వెబ్‌ కౌన్సెలింగ్‌పై సెకండరీగ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) అపోహలు, సందేహాలు, ఆందోళనలకు తెరవేస్తూ వారికి మాన్యువల్‌ పద్ధతిలోనే బదిలీల కౌన్సెలింగ్‌ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌ తన అధికారిక ట్విటర్‌ద్వారా సోమవారం రాత్రి సమాచారం ఇచ్చారు.

ఎస్జీటీ బదిలీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ఓకే !

కంపల్సరీ, స్పౌజ్‌ కేటగిరీ ఎస్జీటీల ఆందోళనకు తెర

ఇప్పటికే వెబ్‌ఆప్షన్లతో కోరుకున్న స్థానాల్లో చేరిన 2,257మంది స్కూల్‌ అసిస్టెంట్లు

ఏలూరు అర్బన్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):వెబ్‌ కౌన్సెలింగ్‌పై సెకండరీగ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ) అపోహలు, సందేహాలు, ఆందోళనలకు తెరవేస్తూ వారికి మాన్యువల్‌ పద్ధతిలోనే బదిలీల కౌన్సెలింగ్‌ను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌ తన అధికారిక ట్విటర్‌ద్వారా సోమవారం రాత్రి సమాచారం ఇచ్చారు. ఆ ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 48 మండలాల పరిధిలో సాధారణ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న 2,862 మంది ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ విధానంలోనే అందుబాటులో వున్న వెకెన్సీలకు బదిలీ కోరుకునేందుకు వారి సమక్షంలోనే ప్రత్యక్షంగా అభీష్టాలను స్వీకరించి అక్కడికక్కడే నూతన స్థానాలను కేటాయిస్తారు. కాగా మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేయాల్సిఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏలూరు జడ్పీ మీటింగ్‌ హాలును కౌన్సెలింగ్‌ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. ఇక్కడి మీటింగ్‌ హాలులో 300 మంది కూర్చునేలా సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్స్‌ ఉండడంతో దీనినే ఖరారుచేస్తారని భావిస్తున్నారు. ఇది కుదరకపోతే సీఆర్‌ఆర్‌ కళాశాల ఆడిటోరియంను పరిశీలించే అవకాశముంది. తమకు వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ వద్దని, మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ఒక్కటే తమకు న్యాయంచేస్తుందని కొద్దిరోజులుగా ఎస్జీటీలు, వారికి మద్దతుగా ఉపాధ్యాయసంఘాల ఐక్యవేదిక ఆందోళన చేస్తోన్న విషయం విదితమే. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన హామీమేరకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సిందేనని పట్టుబడుతూ ఉమ్మడి జిల్లా కేంద్రంలో డీఈవో కార్యాలయంవద్ద ఆది, సోమవారాల్లో రోడ్డుపై బైఠాయింపు, నిరాహార దీక్షలు నిర్వహించారు. అదే సమయంలో సోమవారం నుంచే ఎస్జీటీలకు స్లాట్‌ పద్ధతిన వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. ఈక్రమంలో తొలుత గవర్నమెంటు యాజమాన్యం, ఉర్దూ పాఠశాలలనుంచి బదిలీకి దరఖాస్తు చేసుకుని, వెబ్‌ఆప్షన్లు ఇచ్చిన ఎస్జీటీలకు సోమవారం మధ్యాహ్నంనుంచి ట్రాన్సఫర్‌ ఆర్డర్ల జారీ మొదలైంది.

మరోవైపు జడ్పీ, ఎంపీపీ, మునిసిపల్‌ యాజమాన్యాల ఎస్జీటీల నుంచి కూడా వెబ్‌ఆప్షన్లు ప్రారంభంకాగా, ఆప్షన్లు నమోదు చేసిన ఉపాధ్యాయుల సంఖ్య ఆశావహంగానే ఉండడంతో మిగతా ఉపాధ్యాయులు పునరాలోచనలో వున్న సమయంలో సోమవారం రాత్రి హఠాత్తుగా మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్ణయాన్ని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం తొలి స్లాట్‌లో ఉమ్మడి జిల్లా నుంచి వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసిన స్థానిక సంస్థల ఎస్జీటీల్లో ఎవరికీ నూతన బదిలీ స్థానాలకు ఆర్డర్లు జారీకాకపోవడం, తాజాగా మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం మొగ్గుచూపడంతో వెబ్‌ ఆప్షన్లన్నీ ఆటోమేటిక్‌గా రద్దయినట్టేనని సమాచారం. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సిఉంది. ఆ మేరకు వెబ్‌ ఆప్షన్ల పద్ధతిన తొలి స్లాట్‌లో ఆయా వెకెన్సీలకు తమ అభీష్టాలను నమోదుచేసిన ఎస్జీటీల సంఖ్యలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి కంపల్సరీ కేటగిరీలో 36.41శాతం, రిక్వెస్టు కేటగిరీలో 44.12శాతం పూర్తికావడం సంతృప్తికర సానుకూలతకు సంకేతంగా భావిస్తున్నారు. హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలకు నిర్వహించిన వెబ్‌ఆధారిత కౌన్సెలింగ్‌ ఇప్పటికే విజయవంతంగా ముగిసిన విషయం విదితమే.

2,862 మందికి 1,179 మంది తప్పనిసరి

ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,862 మంది ఎస్జీటీలు బదిలీకి దరఖాస్తు చేసుకోగా, వీరిలో జడ్పీ/ఎంపీపీ/మున్సిపల్‌ యాజమాన్యాలకు చెందిన ఎస్జీటీలు 2,226 మంది ఉన్నారు. వీరిలో 1,179మందికి బదిలీ తప్పనిసరి. మిగతావారివి రిక్వెస్టు బదిలీకోసం సమర్పించిన దరఖాస్తులు. కాగా ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంఘాల యాజమాన్య పాఠశాలలనుంచి 183మంది ఎస్జీటీలు బదిలీకి దరఖాస్తుచేసుకోగా, వీరిలో సోమవారం సాయంత్రానికి 163మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చారని తెలిపాయి. ఇక ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ యాజమాన్య పాఠశాలల్లో మాత్రం 144మంది ఎస్జీటీలు బదిలీకి దరఖాస్తు చేసుకోగా, వీరిలో సోమవారం సాయంత్రానికి ఆరుగురు మాత్రమే వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. తాజా పరిణామాలతో ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ను పూర్తిచేయాలంటే రోజుకు సగటున గరిష్టంగా 400మందికి మాత్రమే కౌన్సెలింగ్‌ నిర్వహించడం సాధ్యమవుతుందని విద్యాశాఖవర్గాలు వెల్లడించాయి.

వెబ్‌ ఆప్షన్లు సక్సెస్‌.. విధులు స్కూల్‌ అసిస్టెంట్లు !

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీచర్ల సాధారణ బదిలీల ప్రక్రియలో ఇప్పటివరకు జరిగిన గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు నూతన బదిలీస్థానాలకు అభీష్టాలను ఇచ్చేందుకు వెబ్‌ ఆప్షన్ల పద్ధతినే అనుసరించగా అందరికీ సానుకూలమైన స్థానాలే ఖరారయ్యాయని సంతృప్తివ్యక్తమవడం గమనార్హం. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో 125మంది గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు, 2,257మంది స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ టీచర్లు వెబ్‌ ఆప్షన్ల పద్ధతిలోనే బదిలీస్థానాలను ఎంచుకోగా, వారందరికీ కొత్త పాఠశాలలకు నియామక ఆర్డర్లు జారీకావడం, కోరుకున్న స్థానాల్లో సోమవారం విధుల్లో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇక మిగిలింది ఎస్జీటీలు మాత్రమే. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో మొత్తం 2,862మంది ఎస్జీటీలు బదిలీకి దరఖాస్తుచేసుకున్నారు. వీరిలో 1,475మంది తప్పనిసరి బదిలీ జాబితాలో ఉండగా, మిగతా వారంతా రిక్వెస్టు బదిలీకి దరఖాస్తుచేసుకున్నవారే. ఇపుడు ఎస్జీటీలందరికీ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించడానికి జిల్లాలో కనీసం ఐదు లేదా ఆరురోజుల వ్యవధి పడుతుందని చెబుతున్నారు. మరోవైపు వేసవి సెలవుల అనంతరం పాఠశాలలన్నీ ఈనెల 12న పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్‌ ఎప్పటికి పూర్తవుతుందో విద్యాశాఖవైపునుంచి స్పష్టత రావాల్సిఉంది.

నేడు ముట్టడి ఉపసంహరణ

నేడు విద్యాభవన్‌ ముట్టడి ఆందోళన కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నామని ఐక్యవేదిక జిల్లా నాయకుడు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.ఆంజనేయులు తెలిపారు.

ఎస్జీటీలకు మాన్యువల్‌ బదిలీ కౌన్సెలింగ్‌ను చేపట్టాల్సిందేనంటూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించే మంగళగిరిలోని విద్యాభవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని ప్రభుత్వ నిర్ణయంతో ఉపసంహరించుకున్నామన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:45 AM