Share News

1600 మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ!

ABN , Publish Date - May 22 , 2025 | 12:25 AM

ఉపాధ్యా యుల సాధారణ బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారం భమైంది.

1600 మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ!

పునర్వ్యవస్థీకరణ మేరకే ఉమ్మడి జిల్లాలో 11,409 టీచరు పోస్టుల హేతుబద్ధీకరణ

గేడ్‌–2 హెచ్‌ఎంల దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభమైన బదిలీలు

ఏలూరు అర్బన్‌, మే 21 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యా యుల సాధారణ బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారం భమైంది. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ మేరకు వచ్చే జూన్‌ నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తం గా ప్రారంభం కానున్న 8 రకాల (శాటిలైట్‌ స్కూల్స్‌ కలిపితే మొత్తం 9 రకాలు) ప్రభుత్వ బడులకు సం బంధించి ఏర్పాటైన 2,921 పాఠశాలలకు ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి ప్రాతిపదికన కేటాయించిన పోస్టు లకు నిర్ణీత అర్హతలు గల టీచర్లు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. తొలుత గ్రేడ్‌–2 హెచ్‌ఎంల బదిలీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. దీంతోపాటే స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ కేడర్ల ఉపాధ్యా యుల బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావా ల్సి ఉండగా, టీచర్ల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌)లో సవరణలకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ఆ మేరకు పాఠశాలల వారీగా మళ్లీ టీచరు పోస్టులను నిర్ధారించిన అనంతరమే దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ ప్రక్రియను గురువారమే పూర్తిచేసి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకర ణను వెబ్‌సైట్‌లో ఎనేబుల్‌చేసే అవకాశం ఉంది.

ఉమ్మడి జిల్లాలో 11,409 మంది టీచర్లు

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఉపాధ్యాయుల బదిలీ లు జరుగనున్నాయి. ఈ నెల 31 నాటికి రెండేళ్లు కనీస సర్వీసు పూర్తిచేసినవారు బదిలీకి దరఖాస్తు చేసుకు నేందుకు అర్హులు. ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల ప్రభు త్వ యాజమాన్యాల పాఠశాలల్లో మొత్తం 11,409 మం ది స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ కేడర్ల టీచర్లు పని చేస్తున్నారు. మరో 2వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ దఫా మున్సిపల్‌ టీచర్ల బదిలీ లను కలిపి నిర్వహిస్తుండడం విశేషం. బదిలీల ప్రక్రి యను ఈ నెలాఖరులోగా పూర్తిచేసి జూన్‌ 4నాటికి నూతన స్థానాలకు బదిలీ నియామక పత్రాలను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, తాజాగా హేతు బద్ధీకరణ నిబంధనలను సవరించే పనిని చేపట్టిన తర్వాతే ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉండడంతో బదిలీలు పూర్తి కావడానికి మరికొని రోజుల వ్యవధి అవసరమని తెలుస్తోంది. బదిలీలు పూర్తయిన వెంటనే పదోన్నతులను చేపట్టి పూర్తిచేస్తా రు. ప్రభుత్వ/మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీలకు కలెక్టర్‌, జడ్పీ బదిలీలకు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చివరిసారిగా 2023లో జరి గిన బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో 3వేల మంది ఉపాధ్యా యులు కంపల్సరీ/రిక్వెస్టు విధానంలో నూతన స్థానాల కు బదిలీ అయ్యారు.

స్థానచలనం తప్పనిసరి!

ఉమ్మడి జిల్లాలో కంపల్సరీ ట్రాన్స్‌ఫర్‌ మొత్తం 1,600 మందికి ఖాయమని నిర్ధారణైంది. ఒకేస్కూలు (స్టేషన్‌)లో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు 19 మంది, ఎనిమిదేళ్ల స్టేషన్‌ సర్వీసు పూర్తిచేసిన ప్రైమరీ స్కూలు హెచ్‌ఎంలు ముగ్గురు, స్కూల్‌ అసిస్టెంట్లు అన్ని సబ్జెక్టుల నుంచి 865 మంది, ఎస్జీటీలు 713 మంది ‘తప్పనిసరి’ బదిలీల జాబితాలో ఉన్నారు. వీరందరూ ఇప్పుడున్న పాఠశాలల నుంచి తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. ఆ మేరకు వీరి వెకెన్సీలన్నీ జాబితాల్లో ప్రదర్శిస్తారు. ఇక బదిలీలకోసం దరఖాస్తు చేసుకున్న గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు నూతన స్థానాలకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 125 వెకెన్సీలను జిల్లా విద్యాశాఖ వెబ్‌ సైట్‌లో బుధవారం ప్రదర్శనకు పెట్టింది. హేతుబద్ధీకరణలో సవరణల వల్ల స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీల వెకెన్సీలను గురు లేదా శుక్రవారాల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌చేసే అవకాశం ఉంది.

Updated Date - May 22 , 2025 | 12:25 AM