Share News

బాండ్‌.. భేరం !

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:59 PM

జిల్లాలో వాణిజ్యానికి ఆ పట్టణం కేంద్రంగా పేరు పొందింది. నిర్మాణ రంగంలోనూ ఇటీవల ప్రాముఖ్యతను చాటుకుంటోంది. అక్కడ ప్లాన్‌లు, టీడీఆర్‌ బాండ్‌ల జారీలో మున్సిపాలిటీ వ్యవహరిస్తున్న తీరు వివాదస్పద మవుతోంది.

బాండ్‌.. భేరం !

టీడీఆర్‌ బాండ్‌ల జారీకి సన్నాహాలు

తీరు మారని మున్సిపాలిటీ

సర్వే నెంబర్‌ స్థలం పోరంబోకులో..

వైసీపీ హయాంలో అదే స్థలంలో

షాపింగ్‌ కాంప్లెక్స్‌

ఇప్పుడు బాండ్ల జారీకి కసరత్తు

గతంలో జారీ అయిన వాటికే

తలలు పట్టుకుంటున్న ప్రభుత్వం

జిల్లాలో వాణిజ్యానికి ఆ పట్టణం కేంద్రంగా పేరు పొందింది. నిర్మాణ రంగంలోనూ ఇటీవల ప్రాముఖ్యతను చాటుకుంటోంది. అక్కడ ప్లాన్‌లు, టీడీఆర్‌ బాండ్‌ల జారీలో మున్సిపాలిటీ వ్యవహరిస్తున్న తీరు వివాదస్పద మవుతోంది. టీడీఆర్‌ బాండ్ల జారీకి మున్సిపాలిటీలో కసరత్తు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రోడ్డు విస్తరణ, ఇతర ప్రభుత్వ నిర్మాణాల సమయంలో స్థలం కోల్పోతున్న బాధితులకు పరిహారంగా మునిసి పాలిటీ టీడీఆర్‌ బాండ్లు (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) అందిస్తుంది. పట్టణంలోని ప్రధాన రహదారిలో 100 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో తమ స్థలం ఉందంటూ టీడీఆర్‌ బాండ్‌ల జారీకి స్థల యజమాని దరఖాస్తు చేసుకున్నారు. అదే రహదారికి ఆనుకుని సదరు యజమానికి దాదాపు 10 ఎకరాల భూమి ఉంది. గత ప్రభుత్వంలో అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించారు. నిజానికి ఆ భూమి సర్వే నంబర్‌ ప్రభుత్వ పోర్టల్‌లో పోరంబోకు అని ఉంది. సదరు భూమిలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదు. స్థల యజమాని తమ పేరుతో ఉన్న పట్టా ఆధారంగా మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకుంటే గత ప్రభుత్వంలో ప్లాన్‌ ఇచ్చేశారు. అప్పట్లోనే షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తయ్యింది. అప్పటి వైసీపీ నేత అది ప్రభుత్వ స్థలమంటూ తొలుత హడావుడి చేశారు. మున్సిపాలిటీ వాహనాలతో దున్నే ప్రయత్నం చేశారు. స్థల యజమానులు దాదాపు రూ.1.50 కోట్లు ముట్టచెప్పి వైసీపీ నేతను ప్రసన్నం చేసుకున్నారు. ఆ తర్వాత షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తయ్యింది. దానికి ఒకవైపు మాస్టర్‌ ప్లాన్‌లో 40 అడుగుల ర హదారి ఉంది. కానీ అభివృద్ధి జరగలేదు. మరోవైపు విస్తరించి ఉన్న వంద అండుగుల రహదారిపై ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.ఆ రహదారికి ఆనుకుని ఉన్న 10 ఎకరాల భూమిలో కొంత భాగం 100 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రహదారిలోకి వచ్చింది. వాస్తవానికి అక్కడ రహదారి మళ్లీ విస్తరించే అవకాశం లేదు. అయినా సరే మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా మున్సిపాలిటీకి భూమి అప్పగిస్తామంటూ స్థల యజమాని ముందుకొచ్చారు. దానికి తగ్గట్టుగా నాలుగు రెట్లు విలువైన టీడీఆర్‌ బాండ్లు జారీ చేయాలని కోరారు. వాస్తవానికి వైసీపీ హయాంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో జారీచేసిన టీడీఆర్‌ బాండ్‌ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద వివాదస్పదమైంది. అప్పటి నుంచి పట్టణాల్లో బాండ్ల జారీకి ఏ అధికారి సాహసం చేయడం లేదు. కానీ వాణిజ్య కేంద్రమైన మున్సిపాలిటీలో మాత్రం బాండ్లు ఇవ్వడానికి అధికారులు తహతహలాడిపోతు న్నారు. మున్సిపాలిటీ ముఖ్య అధికారితో పట్టణ ప్రణాళిక విభాగ అధికారి చేతులు కలిపారు. పట్టణంలో ఏ వ్యవహారమైనాసరే వారి కనుసన్నల్లోనే జరుగుతోంది.

ఓ అధికారి విముఖత

వాణిజ్య కేంద్రంలో టీడీఆర్‌ బాండ్‌ల జారీకి శరవేగంగా సన్నాహాలు జరుగుతుండడంతో పట్టణ ప్రణాళిక విభాగం లోని ఓ కీలక అధికారి మాత్రం విముఖత చూపుతున్నారు. సంతకాలు చేయనంటూ తెగేసి చెప్పేస్తున్నారు. అవసర మైతే సెలవులో వెళ్లిపోతానంటూ స్పష్టం చేసినట్టు తెలు స్తోంది. అదే విభాగంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారి మాత్రం అన్ని విధాలా స్థల యజమానికి సహకరించారు. విజయవాడలో కూర్చొని బాండ్లకు అవసరమైన రికార్డులన్నీ సిద్ధం చేసినట్టు సమాచారం. వంద అడుగుల రహదారికే బాండ్‌లను పరిమితం చేయకుండా అదే సర్వే నంబర్‌లో 10 ఎకరాల భూమికి మరోవైపు అభివృద్ధి జరగని 40 అడుగుల మాస్టర్‌ప్లాన్‌ రహదారికి కూడా బాండ్‌లు ఇచ్చేలా ప్రణాళిక చేసుకుంటున్నట్టు పట్టణంలో అంతా కోడై కూస్తున్నారు. తీరా బాండ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న సర్వే నెంబర్‌ మాత్రం పోరంబోకులో ఉన్నట్టు తేలడంతో అధికారులు కిందా మీదా పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ హయాంలో జారీచేసిన టీడీఆర్‌ బాండ్‌లు కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. వాటిపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వానికి నివేదికలు చేరుకున్నాయి. ఇటువంటి తరుణంలో బాండ్‌ల జారీకి కసరత్తు జరుగుతుండడంపై అంతా చర్చ సాగుతోంది. అధికారులు ఆశీస్సులు లేకుండా ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకునే సాహసం చేయరు. ముందస్తు సంప్రదింపుల తర్వాతే బాండ్‌ల కోసం స్థల యజమాని దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

మరో స్థలంపై వైసీపీ నేత కన్ను

మున్సిపాలిటీలో టీడీఆర్‌ బాండ్‌లు జారీ కానున్నా యన్న సమాచారం తెలుసుకున్న అదే నియోజకవర్గ వైసీపీ నేత కన్ను వాటిపై పడింది. బాండ్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న స్థలానికి సమీపంలోనే ఉన్న స్థల యజమానులతో సంప్ర దింపులు జరిపారు. వారి భూమికి బాండ్‌లు జారీ చేసే బాధ్యత తమది అంటూ చెప్పుకొ చ్చారు. స్థలంపై పవర్‌ ఆప్‌ అటార్నీ ఇవ్వాలని కోరారు. అదే జరిగితే వైసీపీ నేత కూడా బాండ్‌లకు దరఖాస్తు చేసుకునేలా చర్చలు జరిపారు.ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న స్థల యజమానికి బాండ్‌ జారీచేస్తే తమకూ జారీ చేయాల్సి ఉంటుందని సదరు నేత ఎత్తుగడతో ఉన్నారు. టీడీఆర్‌ బాండ్‌ల విషయంలో సదరు వైసీపీ నేత కూడా ఆరితేరారు.మొత్తానికి టీడీఆర్‌ బాండ్‌ల తేనెపట్టును కదిపి అధికారులు వివాదాల్లో కూరుకు పోతున్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:59 PM