తమ్ముళ్ల నైరాశ్యం
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:18 AM
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతల్లో నైరాశ్యం నెలకొంది. నెలలు గడిచినా పదవులు పొందలేకపోతున్నామన్న అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది.
నామినేటెడ్ పదవులపై పెదవి విరుపు
రాష్ట్ర, జిల్లా పదవుల కోసం ఎదురుచూపు
సహకార త్రిసభ్య కమిటీలపైనా ఆశలు
ప్రభుత్వ నిర్ణయం ఏమిటి?
నెలలు గడిచినా పదవులు లేవు
భరోసా ఇచ్చినా పంపకం ఎప్పుడు?
కాలయాపనతో కేడర్‌లో అసంతృప్తి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతల్లో నైరాశ్యం నెలకొంది. నెలలు గడిచినా పదవులు పొందలేకపోతున్నామన్న అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది, రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులను ఆశించిన వారు ఇప్పుడు లోలోన మదనపడుతున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు డీలా పడుతు న్నారు. అధిష్ఠానం వద్ద తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. తాము చూసుకుంటా మని అధిష్ఠానం భరోసా ఇస్తున్నప్పటికీ ఆచరణలో చూపడం లేదు. జిల్లా స్థాయి పదవులు ఆశించే నాయకులు సైతం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటనే విషయంపై తేల్చుకోలేకపోతున్నారు. అధిష్ఠానం నుంచి ఎటువంటి సంకేతాలు రావడం లేదు. నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నాయి. ఇతర నియోజకవర్గాలకు పరిశీలకులుగా పనిచేసి అధిష్ఠానం మన్ననలు పొందిన నాయకులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయినా ఇప్పుటి వరకు ఎటువంటి వర్తమానం రాలేదు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను ఇస్తామంటూ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు అధిష్ఠానం భరోసా ఇచ్చింది. తొలుత కార్పొరేషన్ పదవులు, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ అధిష్ఠానం నుంచి భరోసా పొందిన ఇన్‌చార్జిలు జిల్లాలో ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఒప్పించి తమ ప్రతిపాదనలు అధిష్ఠానం ముందుంచారు.
త్రిశంకు స్వర్గంలో త్రిసభ్య కమిటీలు
రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులను ఆశిస్తున్న వారిలో అసంతృప్తి ఒక ఎత్తయితే సహకార సంఘాలు, ఆలయ ట్రస్టీల్లో పదవులపై తహతహలాడుతున్న కేడర్ కూడా డీలా పడుతోంది. రోజులు గడచిపోతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 122 సహకార సంఘా లున్నాయి. వాటికి త్రిసభ్య కమిటీలు వేయాలని ప్రభుత్వం భావించించింది. ఆరు నెలల కాలానికి కమిటీలు వేసేలా నిర్ణయం తీసుకుంది. జిల్లాలో కూటమి నేతలకు సంకేతాలు పంపింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సయోధ్య కుదిరింది. సొసైటీలను సర్దుబాటు దిశగా అధిష్ఠానానికి జాబి తాలు పంపించారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లోనే కొద్దిపాటి సొసైటీలపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. తెలుగుదేశం, జనసేన నుంచి పేర్లు వెళ్లాయి. దానిపై అధిష్ఠానం క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరాతీసింది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోనే ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఒకటి రెండు సొసైటీలపై తెలుగుదేశం, జనసేన కన్నేశాయి. మిగిలిన చోట్ల ఎటువంటి ఇబ్బంది లేకున్నా అధిష్ఠానం త్రిసభ్య కమిటీలు నియమించడంలేదు. కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న త్రిసభ్య కమిటీలను రద్దు చేశారు. సొసైటీలకు పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఆరు నెలలు గడువు ముగిసిన తర్వాత మళ్లీ పొడిగించారు. మరోవైపు త్రిసభ్యకమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం వివరాలు సేకరించి జాబితాలను రప్పించుకుంది. అయినా సరే నియామకాలు చేపట్టలేదు. దీనిపై కేడర్‌లో రోజు రోజుకూ అసంతృప్తి పెరుగుతోంది.
గడువు దాటితే మరొకరికి అవకాశం
నామినేటెడ్ పదవులను సకాలంలో నియమిస్తే కేడర్‌కు సంతృప్తి. గడువు తీరిన తర్వాత ఆ పదవులను కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్ కమిటీలను ఏడాది కాలానికి నియమిస్తారు. గడువు ముగిస్తే రిజర్వేషన్ ఆధారంగా మరో కమిటీకి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 11 నెలల గడచి పోయింది. జిల్లాల్లో ఇంకా కమిటీలు నియమించాల్సిన ఏఎంసీ పాలకవర్గాలు త్వరితగతిన నియమించాల్సి ఉంది. గ్రంథాలయ సంస్థ, పశుగణాభివృద్ధిసంస్థ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు గట్టిపోటీ ఉంది. నియామకాలు చేపడితే తర్వాత మళ్లీ కొత్తవారికి అవకాశం దక్కుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగు వేయాలంటూ కేడర్‌లో చర్చ నడుస్తోంది. అధిష్ఠానం మాత్రం నామినేటెడ్ పదవుల ఎంపిక జాప్యం చేయడం కేడర్‌లో అసంతృప్తి బీజాలను నాటుతోంది.