తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కుదుపులు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:25 AM
ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు మరమ్మతులతో మూలనపడ్డాయి. మరమ్మతులకు గురైతే ఈ వాహనాన్ని పట్టించుకునే వారే లేరు. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు అందడం లేదు.
14 వాహనాలకు పనిచేసేవి తొమ్మిదే
మరమ్మతులు లేక మూలనపడ్డ ఐదు
నాలుగు నెలలుగా జీతాల పెండింగ్
తణుకు, ఆగస్టు 5(ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు మరమ్మతులతో మూలనపడ్డాయి. మరమ్మతులకు గురైతే ఈ వాహనాన్ని పట్టించుకునే వారే లేరు. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు అందడం లేదు. ప్రభుత్వాసుపత్రిలో గర్భవతి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చాలనే బృహత్తర లక్ష్యంతో దీనిని ప్రవేశపెట్టారు. రాను రాను ఈ పథకం నిర్వహణలో చాలా ఇబ్బందులు ఎదురవుతు న్నప్పటికి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. వాహనాలకు టైర్లు అరిగిపో వడం, ఇంజన్ మరమ్మతులకు రావడం వంటి సమస్యలకు పరిష్కా రం చూపించడం లేదు. దీంతో ఆయా వాహనాలు మూలనపడ్డా యి. ఈ కారణంగా అవి భవిష్యత్‌లో మరింత పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 14 వాహనాలు వున్నాయి. తణుకులో ఆరింటికి మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన మూడింటికి టైర్లు అరిగిపోయి పక్కన పెట్టేశారు. తాడేపల్లిగూడెంలో రెండింటికి ఒకటి మాత్రమే పనిచేస్తోంది. మరొ కటి మరమ్మతులకు గురైంది. పెనుగొండలో ఒకటి, ఆచంటలో మరొకటి ఉన్నాయి. ఆచంట వాహనానికి డ్రైవర్ రెండేళ్ల క్రితం చనిపో యినప్పటికి
ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. పాలకొల్లు ఒకటి, భీమవరం ఒకటి, నరసాపురంలో రెండు ఉన్నాయి. మొత్తం 14 వాహనాలకుగాను, ఐదు పనిచేయడం లేదు. మరోవైపు తిరుగుతున్న వాహనాలకు కూడా చిన్నపాటి మరమ్మతులు ఉన్నాయని, వాటిని బాగు చేయించాలని కోరుతున్నారు. పనిచేయని చోట తల్లీబిడ్డలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఈ వాహన డ్రైవర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఆగస్టు కలిస్తే మొత్తం ఐదు నెలలు అవుతుంది. ఒక్కో డ్రైవర్‌కు నెలకు అన్ని కటింగ్‌లు పోనూ 7 వేల 800 మాత్రమే వస్తుంది. ఇది కూడా సరిగా ఇవ్వకపోతే తామెలా బతకాలని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే అరకొర జీతాలతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా జీతాలు పెంచి, వాటిని సకాలంలో అందించాలని వారు కోరుతున్నారు.