Share News

చితికిన బత్తాయి

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:36 AM

బత్తాయి రైతు కుదేలయ్యాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చేసరికి ధర లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి.

చితికిన బత్తాయి
గూడెం మార్కెట్లో రంగు మారిపోతున్న బత్తాయిలు

అమ్ముదామంటే కొనేవారు లేరు

ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి

రంగుమారి కుళ్లుతున్న కాయలు

దిక్కుతోచని స్థితిలో రైతులు

తాడేపల్లిగూడెం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : బత్తాయి రైతు కుదేలయ్యాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చేసరికి ధర లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా అసలు అమ్ముదామంటే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మార్కెట్‌కు తెచ్చి రాసిగా పోసి రోజు వచ్చి చూసి, కుళ్లిన కాయలను బయట పారపోసుకోవడం వంతుగా మారింది. ఇలాంటి దయనీయ పరిస్థితి బత్తాయి రైతు ఎన్నడూ చూడలేదు. ఈ సంవత్సరం వాతావరణం సరిగా అనుకూలించలేదనే చెప్పాలి. వర్షాలు కురిసే సమయంలో వర్షాలు పడకపోవడం, అవసరం లేని సమయంలో వర్షాలు కురిశాయని రైతులు వాపోతున్నారు. దీంతో బత్తాకాయలు సైజు పెరగకపోవడంతో పాటు, నాణ్యత లోపించింది. నిలువ ఆగే సామర్ద్యం ఈ సంవత్సరం బత్తాయిలో కనిపించడం లేదు. గతంలో బత్తాయి మార్కెట్‌కు వస్తే వారం రోజులపాటు రాసిగా పోసిన కాయలు చెక్కుచెదరకుండా ఉండేవని వ్యాపారులు చెబుతు న్నారు. కాని ఇప్పుడు వచ్చే బత్తాయి మార్కెట్‌కు వస్తే రెండు మూడు రోజుల్లోనే కుళ్లిపోతున్నాయని పేర్కొంటున్నారు. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితికి బత్తాయికి డిమాండ్‌ ఉండాల్సింది లేదు. దీనికి అధిక వర్షాలు కారణంగా వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతులు బెంబేలెత్తుతున్నారు.

ఉమ్మడి పశ్చిమలో 500 ఎకరాల్లో సాగు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 500 ఎకరాల్లో బత్తాయి తోటలను సాగుచేశారు. వీరందరికి ఈ సంవత్సరం నష్టాలే మిగిల్చింది. ఎకరం పొలంలో 70 మొక్కలను నాటుతారు. ఇవి ఒక్కొ మొక్క నుంచి సరాసరి 1000 కాయలు దిగుతాయి. ఈ లెక్కన ఎకరాకు 70 వేల కాయలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో ఽకొనుగోళ్లు లేకపోవడంతో ఇన్ని పెట్టుబడులు పెట్టిన రైతుకు నిరాశే మిగిలింది. గతంలో సాగు చేసిన రైతుకు ఎకరాకు ఖర్చులు పోను రూ.50 వేలు మిగిలేవి. ఇప్పుడు ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి

ఎకరాకు రైతులు రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. లీజు ఎకరాకు రూ.60 వేలు మొత్తంగా సంవత్సరానికి రూ.లక్ష కౌలు రైతుకు అయింది. అదే స్వంతంగా బత్తాయి తోట ఉన్న రైతుకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. ఒక్కొ కాయకు బుట్ట కట్టడానికి రూ.1.5 అవుతోంది. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులకు ఎకరాకు రూ.25 వేలు అవుతోంది. దీనికి తోడు కోయడం, మార్కెట్‌ ట్రాన్స్‌పోర్టు, బస్తాల్లో ప్యాకింగ్‌ వంటి లెక్కగా తీసుకుంటే మొత్తంగా రూ.40 వేలు ఖర్చు చేశామని రైతులు వాపోతు న్నారు. ఇప్పుడు 100 కాయలు అమ్ముదామన్నా రూ.200 కూడా కొనుగోల చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రైతులు తెచ్చిన కాయలను మార్కెట్లో చూసుకుని తిరిగి వెళ్లడం తప్ప మార్గం లేకుండా పోయింది. ఈలోగా కాయలు పూర్తిగా రంగుమారి కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఇలాంటి దయనీయ పరిస్థితులు ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బత్తాయి రైతులను ఆదుకోకపోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచే ..

తాడేపల్లిగూడెం మార్కెట్‌కు రాష్ట్ర నలుమూలల నుంచి బత్తాయి దిగుమతి అవుతోంది. మాచెర్ల, రాజమండ్రి, దోసకాయనపాడు, నంది వాడ, చిన్నాయి గూడెం, కన్నాపురం, కొమ్ముగూడెం, నీలాద్రిపురం, తడికలపూడి ప్రాంతాల నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌లోని హోల్‌సేల్‌ వ్యాపారుల వద్దకు వస్తాయి. వీటిని చిరు వ్యాపారులు కొనుగోలు చేసి గ్రామాలకు వెళ్లి విక్రయిస్తుంటారు. ఇలా వ్యాపారం జోరుగా సాగేది. కానీ ఇప్పుడు చిరు వ్యాపారులు సైతం కొనడానికి ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి కొనుగోలు చేయాలన్నా 100 కాయల్లో 40 కాయల వరకు కుళ్లిపోవడంతో కొనుగోలు చేయడం మానేశారు. దీంతో మార్కెట్లోనే కాయలు కుళ్లిపోతున్నాయి.

చేసిన అప్పులు ఎలా తీర్చాలి

చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. తోటను రూ.60వేలుకు లీజుకు తీసుకున్నా. పెట్టుబడి రూ.40 వేలు అయింది. మొత్తంగా ఎకరాకు రూ.లక్ష అవుతోంది. పండించిన బత్తాయిని మార్కెట్‌కు తరలిస్తే కొనేవారు లేరు. రోజు మార్కెట్‌కు వచ్చి కాయలు చూసుకుని కుళ్లిన కాయలను బయట పోసుకుని వెళుతు న్నాను. ఏం చేయాలో తెలియని పరిస్థితి ప్రభుత్వం ఆదుకోవాలి.

– రాజమహేంద్రపు శ్రీను, కౌలు రైతు, నీలాద్రిపురం

బత్తాయిలో నాణ్యత లోపించింది

బత్తాయిలో నాణ్యత లోపించింది. దీంతో నిలువకు ఆగడం లేదు. త్వరగా కుళ్లిపోతున్నాయి. వాతా వరణంలో వచ్చిన మార్పుతో ఇలాంటి పరిస్థితి ఈ సంవ త్సరం వచ్చింది. రిటైల్‌ వ్యాపారులు ఎవ్వరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ధర ఎన్నడూ లేనివిధంగా పడిపోయింది. రైతులకు పెట్టుబడులు పెట్టాం. తీరా అవి తీసుకోవాలన్నా అమ్మకాలు జరగడం లేదు.

– ఉదయ్‌, పండ్ల వ్యాపారి, తాడేపల్లిగూడెం

Updated Date - Sep 01 , 2025 | 12:36 AM