Share News

ఆక్వాకు అండగా..

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:55 AM

ఆక్వా రంగానికి ఊతమిచ్చే దిశలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది.

ఆక్వాకు అండగా..

పారదర్శక జోన్‌ వ్యవస్థ కోసం గ్రామసభలు

ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ప్రణాళిక

భీమవరం రూరల్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి):ఆక్వా రంగానికి ఊతమిచ్చే దిశలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. ఆక్వా జోన్‌ పరిధిని విస్తరించాలా ? తగ్గించాలా ? ఆక్వా సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు అనుమతి ఇవ్వాలా ? వద్దా ? వంటి అంశాలపై వారితో చర్చించి, పారదర్శక జోన్‌ల వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్‌ 25వ తేదీ నుంచి ఈ నెల మూడో తేదీ వరకు జిల్లా వ్యా ప్తంగా సచివాలయాల్లో గ్రామసభలు నిర్వహిస్తోంది. గత ప్రభు త్వం తీసుకొచ్చిన ఆక్వా జోన్‌ విధానంతో రైతులు నష్టపోయారు. దీనిని సరిచేసేందుకు గ్రామసభల ద్వారా రైతుల అభిప్రాయాలను తీసుకుంటుంది. జిల్లాలో గ్రామాల వారీగా మత్స్యశాఖ ఆధ్వర్యం లో సభలు జరుగుతున్నాయి. మూడో తేదీతో పూర్తికావాలి. గ్రామాలు మిగిలి ఉంటే మరికొన్ని రోజులు కేటాయిస్తారు. రైతుల నుంచి పూర్తి వివరాలు సేకరించే లక్ష్యంతో ప్రభుత్వం వుంది.

కమిటీల ద్వారా రాష్ట్రానికి నివేదిక

ప్రస్తుతం జోన్‌ వ్యవస్థపై గ్రామసభలు పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలి. ముందుగా గ్రామాల వివరాలను మండల కమిటీకి, మండలాల వివరాలను జిల్లా కమిటీకి, జిల్లా వివరాలను రాష్ట్ర కమిటీకి పంపిస్తారు. ఈ జాబితాను అనుసరించి రాష్ట్ర కమిటీ పారదర్శక జోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఆక్వా సాగులో ప్రధానంగా రైతులు కోరుకునేది విద్యుత్‌ సబ్సిడీని. ఇదే వారికి పెద్ద భరోసా. ప్రతి రైతు ఈ జోన్‌ పరిధిలో తమ చెరువులు ఉండాలని కోరుకుంటారు. ఈ జోన్‌లో వుంటే సబ్సిడీ ద్వారా యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50పై అందుతుంది. అలాంటి దాన్ని గత ప్రభుత్వం జోన్‌ వ్యవస్థ కొత్తగా తీసుకువస్తున్నామని, అర్హులైన రైతులను విద్యుత్‌ సబ్సిడీకి రాని వారి జాబితాలోకి తీసుకువెళ్లింది. ఆ సమయంలో కొన్నేళ్ళుగా సబ్సిడీ వస్తుంటే ఇప్పుడు అనర్హులు చేస్తారా అని రోడ్డెక్కారు. భీమవరం మండలంలోని ఒక సచివాలయంలో అధికారులు ఉండగా ఆక్వా రైతులు తలుపులు తాళం వేసి నిరసన తెలిపారు. జిల్లాలో 50 శాతం రైతులు అనర్హులు జాబితాలోకి వచ్చారు. ప్రస్తుతం జిల్లా ఆక్వాసాగులో 16,456 రైతులు విద్యుత్‌ పొందుతున్నారు. పారదర్శక జోన్‌ల వ్యవస్థ వస్తే వేలాది మంది రైతులు విద్యుత్‌ సబ్సిడీ పొందే జాబితాలోకి వస్తారు.

Updated Date - Jul 01 , 2025 | 12:55 AM