డేంజర్.. డేంజర్..
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:17 AM
ఎస్‌వీకేపీ డాక్టర్ కేఎస్.రాజు ఆర్ట్స్ అండ్ కళాశాల కూడలిలో విద్యార్థులు బస్సుకోసం ప్రమాదకర పరిస్థితిలో రోడ్డు పక్కన నిరీక్షిస్తున్నారు.
రోడ్డుపై విద్యార్థుల నిరీక్షణ
ఆగని బస్సులతో తప్పని తిప్పలు
పెనుగొండ కళాశాల వద్ద పాట్లు
వాహనాల రద్దీతో ప్రమాదం
పెనుగొండ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఎస్‌వీకేపీ డాక్టర్ కేఎస్.రాజు ఆర్ట్స్ అండ్ కళాశాల కూడలిలో విద్యార్థులు బస్సుకోసం ప్రమాదకర పరిస్థితిలో రోడ్డు పక్కన నిరీక్షిస్తున్నారు. వాహనాల రద్దీతో పాటు ఎండ, వాన, దుమ్ముతో ఇబ్బందులు పడాల్సిందే. కళాశాలతో పాటు ఎదురుగా వాసవీ ధామ్, పక్కనే నగరేశ్వర మహిషాసురమర్ధని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంతో నిత్యం యాత్రికుల రద్దీ ఉంటుంది. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు సుమారు 3 వేల ఉంటారు. సుమారు 1500 మంది దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఉదయం, సాయంత్రం రోడ్డు కిక్కిరిసిపోతుంది. వాహనాల రద్దీతో ప్రమాదం ముంచుకొస్తుందని అటువైపు వెళ్లేవారు సైతం ఆందోళన చెందుతు న్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య భక్తులు, విద్యార్థులతో రద్దీగా ఉంటుంది. రద్దీ చూసి కొన్ని బస్సులు సైతం ఆపరు. రోడ్డు విస్తరణతో బస్ షెల్టర్ తొలగించారు. తర్వాత నిర్మాణం చేపట్ట లేదు. విద్యార్థులు, యాత్రికులకు రోడ్డుపై పడిగాపులు తప్పడం లేదు.
రోడ్డుపై పడిగాపులు
బస్సు కోసం రోడ్డుపై పడిగాపులు కాయాలి. సమయానికి బస్సు రాదు.. ఎండ, వానలో వేచి ఉండాల్సిందే. సిద్ధాంతం నుంచి ప్రతీ రోజూ కళాశాలకు వస్తుంటాను. నేను డిగ్రీ చదువుతున్నాను. ఇక్కడ వేచి ఉండేందుకు బస్సుషెల్డర్ నిర్మించాలి.
– జి.సాహితి, సిద్ధాంతం
నిలబడాల్సిందే..
ప్రతీ రోజూ రావులపాలెంనుంచి వస్తాను. కళాశాల అయ్యాక ఇంటికి వెళ్లాలంటే నరకయాతన. రోడ్డుపై నిలబడాల్సిందే. బస్సు వచ్చినా రద్దీ చూసి ఆపరు. ఒక వేళ బస్సు ఆపినా జనంతో కిక్కిరిసిపోయి బస్సుకూడా ఎక్కలేని పరిస్థితి.
– జి.స్వాతి, రావులపాలెం
వాహనాల రద్దీతో భయం
రోజూ తణుకు నుంచి వస్తాను. కళాశాల అయ్యాక ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తాం. కానీ ఈ ప్రాంతం నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకలతో రోడ్డు పక్కన వేచిఉండడం ప్రమాదే. షెల్టర్ నిర్మించాలి.
– ఎం.మార్తమ్మ, తణుకు