Share News

వీధి వ్యాపారుల సర్వే

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:07 AM

వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసి వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడేందుకు పట్టణాల్లో మరోసారి సర్వే కొనసాగుతోంది.

వీధి వ్యాపారుల సర్వే
భీమవరంలో వీధి వ్యాపారుల వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి సర్వే

వెండర్‌ కనెక్ట్‌ యాప్‌లో వివరాల నమోదు

క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగి, మెప్మా సిబ్బంది

మునిసిపాలిటీ గుర్తింపు కార్డు, సర్టిఫికెట్‌

భీమవరం టౌన్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసి వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడేందుకు పట్టణాల్లో మరోసారి సర్వే కొనసాగుతోంది. 2017లో సర్వే పూర్తిచేసి వ్యాపారులకు పీఎం స్వనిధి కింద జిల్లా వ్యాప్తంగా 13వేల మందికి మెప్మా అధికారులు రుణాలు మంజూరు చేయించారు. ఇటీవల హైకోర్టు మరోసారి వీధి వ్యాపారుల సర్వే చెయ్యాలని ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతోంది. పట్టణాల్లో వీధి వ్యాపారులను నమోదు చేయాల్సి ఉంటుంది.

వెండర్‌ కనెక్ట్‌ యాప్‌ ద్వారా

ప్రస్తుతం సర్వే వెండర్‌ కనెక్ట్‌ యాప్‌ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో మెప్మా సిబ్బంది మాత్రమే పట్టణాల్లో వీధి వ్యాపారులను గుర్తించి నమోదు చేశారు. ఈ సారి వీరితోపాటుగా వార్డు సచివాలయ అడ్మిన్‌లను కూడా సర్వేలో భాగస్వాములను చేశారు. ఆయా పట్టణాల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వే చేస్తున్నారు. గతంలో చేపట్టిన సర్వేలో నమోదైన వీధి వ్యాపారులతో పాటు, పీఎం స్వనిధి రుణాలు తీసుకుని సర్వేలో నమోదు కాని వారిని గుర్తిస్తున్నారు. కొత్తగా ఎవరైనా వీధి వ్యాపారులు ఉన్నారా అనేది పరిశీలిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఆకివీడు మునిసిపాల్టీకి మాత్రం లక్ష్యాలను నిర్దేశించలేదు. సర్వే మాత్రం నిర్వహించి వీధి వ్యాపారులను గుర్తిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

సర్వేలో నమోదైన వీధి వ్యాపారులకు మునిసిపాల్టీల ద్వారా గుర్తింపు కార్డు, సర్టిఫికెట్‌ అందిస్తారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూస్తారు. తద్వారా ఆర్థికంగా బలోపేతానికి అవకాశఽం ఏర్పడుతుంది.

Updated Date - Jun 09 , 2025 | 12:07 AM