నూజివీడు గోడు
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:43 AM
తమను ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కలపాలని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ముందు నూజివీడు, కైకలూరు నియో జకవర్గాల ప్రజలు తమ డిమాండ్‌ను ముందుంచారు. అమరావతిలో ఈ రోజు జరిగే సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది.
అధికారుల సమీక్షల్లో ప్రజల సెంటిమెంట్‌ను వివరించే గొంతు కరువు
అశాస్ర్తీయ జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో చిక్కిపోయిన డివిజన్
ఇప్పటికే జిల్లా కేంద్రానికి పలు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు
న్యాయస్థానాలు తరలిపోయే ప్రమాదం
తమను ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కలపాలని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ముందు నూజివీడు, కైకలూరు నియో జకవర్గాల ప్రజలు తమ డిమాండ్‌ను ముందుంచారు. అమరావతిలో ఈ రోజు జరిగే సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది.
(నూజివీడు–ఆంధ్రజ్యోతి)
ఒకప్పటి రాజుల సంస్థానాల్లో నూజివీడు ఒకటి. 14 మండలాలతో ఈ జమిందారీ సం స్థాన కేంద్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రధాన కేంద్రంగా బాసిల్లింది. రాష్ట్ర విభజన అనంత రం నవ్యాంధ్రలో అతి పెద్ద డివిజన్‌లలో ఇది ఒకటి. 2021లో ఒక్కసారిగా సీన్ మారింది. వైసీపీ సర్కార్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను విభజించింది. దీని ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు ను ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగించాలని ప్రజ లు కోరినా ఫలితం లేకపోయింది. దీనిని ఏలూరు జిల్లాలో కలిపారు. నాటి ప్రజా ప్రతి నిధులు కనీసం నోరు మెదపలేదు.
ఈ క్రమంలో తమ సెంటిమెంట్‌ను గౌర వించి నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలని 2024లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమం త్రి చంద్రబాబుకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయన రెండు సందర్భాల్లో సాను కూలంగా స్పందించారు. ఇటీవల పీ–4 కార్య క్రమానికి హాజరయ్యేందుకు ఆగిరిపల్లి వచ్చి న చంద్రబాబు ఆ హామీని పునరుద్ఘాటించా రు. ఇంతవరకు బాగానే వుంది. కాని, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు ఏర్పాటు చేసిన కమిటీ ముందు నూజివీడు సెంటిమెంట్‌ను బలంగా ఉంచే నాథుడే కరువయ్యాడని నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. తమ సెంటి మెంట్‌ను బహిర్గతం చేస్తూ న్యాయవాదులు, వ్యాపార వర్గాలు రోడ్డుపైకి వచ్చాయి. గత వారం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సమీక్ష జరగ్గా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అన్ని నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తూ అధికా రుల వద్ద తమ వాదనను వినిపించారు. నూ జివీడు నియోజకవర్గం నుంచి తమ వాగ్ధాటి ని వినిపించే గొంతుక కరువైంది. ఈ క్రమం లో నూజివీడు నియోజకవర్గం ఏ జిల్లాలో కలుస్తుందనే దానిపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అతిపెద్ద డివిజన్
నూజివీడు డివిజన్‌ను ఏలూరు జిల్లా పరిధిలోకి తీసుకోవడంతో డివిజన్‌లోని 14 మండలాల్లో 10 కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విలీనమయ్యాయి. తిరువూరు కేంద్రంగా డివిజన్ ఏర్పాటు కాగా నూజివీడు కేం ద్రంగా కేవలం నాలుగు మండలాలు మాత్రమే మిగల డంతో ఇక్కడ వున్న ప్రధాన శాఖల కార్యాల యాలు ఏలూరు జిల్లా కేంద్రానికి తరలిపోయాయి. చివరికి నూజివీడు డీఎస్పీ కార్యాలయం తరలిపోయే పరిస్థితిని నాటి డీఎస్పీ అప్పటి ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పా రావుకు వివరించగా ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏలూరు డివిజన్ పరిధిలోని పెద వేగి, పెద పాడు పోలీస్ స్టేషన్‌లను నూజివీడు డీఎస్పీ కార్యాల య పరిధిలోకి తీసుకొచ్చారు. రెవెన్యూ డివిజన్ పరిధి లోకి చింతలపూడి, లింగపాలెం మండలాలను తీసుకొ చ్చారు. నూజివీడు డివిజన్ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రానికి తరలిపోయాయి.
మూడు డివిజన్‌లుగా మారుస్తున్నారా ?
ప్రస్తుత జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో ఇప్పటికే ఎన్.టి.ఆర్ జిల్లాలో ఉన్న తిరువూరు డివిజన్‌తోపాటు తాజాగా గన్నవరం డివిజన్‌గా మార్చి ఈ 14 మండ లాలను మూడు డివిజన్‌లుగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా నూజివీడు డివిజన్‌ను గత ప్రభుత్వం అశాస్ర్తీయంగా విభజించగా దాన్ని సరిచేసి నూజివీడు డివిజన్‌కు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి
నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న నూజివీడు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పరిశ్రమల స్ధాపన, వివిధ ప్రభు త్వ, ప్రైవేటు సంస్ధల ఏర్పాటు చేయటానికి రాజధాని ప్రాంతంపై ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా జాతీయ రహదారులు, రైల్వే, విమానయాన సౌకర్యాలకు నూజివీడు నియోజకవర్గం దగ్గరలో ఉంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా నూజివీడు నియోజకవర్గం విస్తరించి ఉండటం కూడా రాజధానికి కలిసి వస్తుంది.
–మల్లిపూడి రాజశేఖర్, బీజేపీ నాయకుడు
హామీని అమలుచేయాలి
నూజివీడు ప్రజల సెంటిమెంట్ గుర్తించి ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. హామీ మేరకు విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాలో నూజివీడు కలిపి స్థానిక ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి.
–ఇందుపల్లి సత్యప్రకాష్, బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు, నూజివీడు.
మా సెంటిమెంట్‌ను గౌరవించండి
మంత్రివర్గ ఉప సంఘానికి సిటిజన్ ఫోరం వినతి
నూజివీడు టౌన్, నవంబరు 4(ఆంధ్ర జ్యోతి):నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీ ఆర్ జిల్లాలో కలపాలని నూజివీడు సిటి జన్ ఫోరమ్ ప్రతినిధులు జిల్లాల పునర్వి భజన కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి విజ్ఞాపన పత్రాలను అందజేశారు. మంగళ వారం అమరావతి సచివాలయంలో రెవె న్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల ను కలిసి ఫోరమ్ ప్రతినిధులు పత్రాలను అందజేశారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ప్రజల ఆకాం క్షను వినతిపత్రం ద్వారా వారికి తెలియ చేయగా వారు అందుకు సానుకూలంగా స్పందించి ఈ అభ్యర్ధనను మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో చర్చించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చినట్లు సిటిజన్ ఫోరం సభ్యులు తెలిపారు. ఫోరమ్ ప్రతినిధులు సయ్యద్ ఫరూక్, మల్లెపూడి రాజశేఖర్, సబ్బినేని శ్రీనివాస్, పీవీ కుమార్, గొల్లపూడి రవి బాబు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాలోకి కైకలూరు..!
కలపాలని నియోజకవర్గ ప్రజల డిమాండ్
పలు సమస్యలకు ఇదే పరిష్కారమని భావన
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కామినేని
కైకలూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలోనే తమను కొనసాగించాల న్న కైకలూరు నియోజకవర్గ ప్రజల సెంటి మెంట్‌ను నాటి వైసీపీ సర్కార్ పట్టించుకో లేదు. ఫలితంగా ఏలూరు జిల్లాలో కొనసా గుతోంది. తాజాగా కూటమి సర్కార్ జిల్లా ల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటుచేసిన మం త్రుల కమిటీ అభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యంలో తమను కృష్ణాలో కలపాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రజాభిప్రాయా నికి అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరును కృష్ణా జిల్లాలో కలపాలని మంత్రుల కమిటీకి లేఖ రాశారు. అలాగే జిల్లా అధికారులు తమ నివేదికలో సానుకూల వైఖరినే ప్రదర్శించి నట్టు సమాచారం. మంత్రి వర్గ కమిటీ కూడా సానుకూలంగా స్పందిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గానికి వచ్చే పంట కాలువలన్నీ కృష్ణా నది నుండే అను సంధానమై ఉంటాయి. కైకలూరు ఎగువన గుడివాడ, గుడ్లవల్లేరు ప్రాంతాల నుంచి కాలువలు నియోజకవర్గంలోకి వస్తాయి. నీటి సమస్య ఏర్పడితే ఇరు జిల్లాల అధికా రులు సమన్వయంతో పనిచేస్తేనే పరిష్కా రమవుతుంది. అదే ఒకే జిల్లాలో ఉంటే ఇబ్బందులు ఉండవని ప్రజల అభిప్రాయం.
ముదినేపల్లి మండలం ఆది నుంచి గుడివాడకు దగ్గరగా ఉండడం పాలనా పరమైన ఇబ్బందులు లేకుండా ఉంట య ని ఆ ప్రాంత ప్రజలంతా కృష్ణా జిల్లాలోనే ఉంచాలనేది ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుపైనే స్థాని కులు ఆశలు పెట్టుకున్నారు.