గూడెం.. ఘోష!
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:27 AM
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొన్ని రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రధాన రహదారులు గోతులమయంగా మారడంతో వాహనదారులు ప్రయాణాలు చేయలేక ముప్పుతిప్పులు పడుతున్నారు.
అధ్వాన్నంగా మారిన దారులపై నడుంలు విరిగిపోతున్నాయి
వాహనాలు షెడ్డుకు వెళుతున్నాయి
ప్రైవేటు బస్సులు పట్టణంలోకి రానంటున్నాయి..
రోడ్ల దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బొలిశెట్టి ఆవేదన
(తాడేపల్లిగూడెం అర్బన్–ఆంధ్రజ్యోతి):
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొన్ని రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రధాన రహదారులు గోతులమయంగా మారడంతో వాహనదారులు ప్రయాణాలు చేయలేక ముప్పుతిప్పులు పడుతున్నారు. ప్రత్తిపాడు వై.జంక్షన్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుంచి ముత్యాలంబపురం ముత్యా లమ్మ ఆలయం వరకు రోడ్డుపై ప్రయాణమంటే ఓ సాహసమేనని చెప్పాలి. అసలు రోడ్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి. పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి కాబట్టి రోజు వేల సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తారు. ఈ రోడ్డు దాటేసరికి ఒళ్లు హూనం అవుతుండడంతో పాటు వాహ నాలు తరచూ పాడవుతున్నాయని ప్రయా ణికులు గగ్గోలు పెడుతున్నారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్లాల్సిన చాలా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తాడేపల్లిగూడెం పట్టణంలోకి రావడం లేదు. ప్రత్తిపాడు బైపాస్ మీదకు వెళ్లి ఎక్కాల్సి వస్తోంది. అదే సమయంలో అక్కడే దింపేయడంతో అర్ధరాత్రి వేళల్లో ఈ ప్రాంతం ప్రమాదకరంగా ఉండ డంతో బిక్కుబిక్కుమంటూ రోడ్డు దాటాల్సి వస్తోందని పలువురు వాపో తున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూ రైనప్పటికి గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన పాత బకాయిలు విడుదల చేస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్ తెగేసి చెప్పడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి.
ప్రజల ముందుకు వెళ్లలేం : ఎమ్మెల్యే బొలిశెట్టి
అసెంబ్లీ సమావేశాలలో నియోజకవర్గంలో రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కాస్త గట్టిగానే మాట్లాడారు. గూడెం ప్రధాన రహదారి కూడా గోతుల మయంగా మారిపోయింది. టూరిస్టు బస్సులు కూడా సిటీలోకి రావడం లేదు.పాత బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడం లేదు. అడిగితే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రహదారులు వేయలేకపోతే ప్రజలవద్దకు వెళ్లలేమని రహదారులను అభివృద్ధి చేయించా లని అసెంబ్లీలో కోరారు.
అధ్వానంగా పెంటపాడు–బోడపాడు, చింతపల్లి – కొండేపాడు
వైసీపీ ప్రభుత్వం పెంటపాడు–బోడపాడు రహదారి వైపు కన్నెత్తి చూడకపోవడంతో గోతులతో అధ్వానంగా మారింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ రహదారి నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయించినా నిధులు విడుదల కాలేదు. మరమ్మతుల కోసం వచ్చిన రూ.25 లక్షలతో కిలోమీటర్ మేర రహదారి వేయించారు. ఇంకా మూడు కిలోమీటర్లు వేయించాలి. చింతపల్లి–కోరుమిల్లి మీదుగా బి.కొండేపాడు వెళ్లే రహదారి పరిస్థితి ఇదే మాదిరి వుంది. 2014లో జెడ్పీ చైర్మన్‌గా వున్న ముళ్లపూడి బాపిరాజు ఈ రహదారిని వేయిం చారు. అప్పటి నుంచి ఈ రహదారి వైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం రాళ్లు మొత్తం పైకి లేచి అధ్వానంగా తయారైంది. మూడు గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు.
గోతులమయంగా
అలంపురం–రాచర్ల రహదారి
ఇటీవల కురిసిన వర్షాలకు అలంపురం నుంచి రాచర్ల వెళ్లే రహదారిలో పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. ఆ దారిలో ప్రయాణాలు సాగించే వాహనదారులు ఇబ్బం దులు పడుతున్నారు. పెంటపాడు నుంచి అలంపురం మీదుగా తణుకు వైపు వెళ్లాలంటే దూరం తక్కువని ద్విచక్ర వాహనదారులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ రహదారి పాడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏళ్ల తరబడి ఇదే సమస్య
పెంటపాడు నుంచి బోడపాడు వెళ్లే రహదారి గోతులతో ప్రమాదకరంగా తయారైంది. ఏళ్ల తరబడి ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. రాత్రి వేళల్లో ప్రయాణాలు మరింత ప్రమాదకరంగా మారాయి. వ్యాపారం నిమిత్తం రోజుకు మూడు, నాలుగుసార్లు తాడేపల్లిగూడెం వెళ్లి వస్తాను. ఈ దారి తప్ప మరో మార్గం లేదు.
బాదంపూడి వీర రాఘవరావు, కిరాణా వ్యాపారి, బోడపాడు
ఊర్లోకి రావాలంటే భయపడుతున్నారు
పెంటపాడు నుంచి మా ఊరిలోకి రావా లంటే జనం కూడా భయపడి పోతు న్నారు. ఇప్పటికే ఎంతో మంది ద్విచక్ర వాహనాలపై నుంచి పడి క్షతగాత్రు లయ్యారు. మహిళలు, గర్భిణులు ఈ దారిపై ప్రయాణం చేయాలంటే ఓ సాహసమేనని చెప్పాలి. ఏళ్ల తరబడి రోడ్డు కోసం ఎదురు చూస్తున్నాం. కనీసం కూటమి ప్రభుత్వంలో నైనా మా రోడ్డుకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాం
– గూడూరి వెంకట సత్యనారాయణ, రైతు, బోడపాడు