Share News

తరగని గుట్టలు.. తప్పిన అంచనాలు!

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:24 AM

వర్షాకాలం అవసరాల కోసం ప్రభుత్వం ఇసుక నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంది.. వాటిని అమ్ముకునేందుకు కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది..

తరగని గుట్టలు.. తప్పిన అంచనాలు!
తాడేపల్లిగూడెం స్టాక్‌ పాయింట్‌ వద్ద ఇసుక గుట్టలు

ఒత్తిడి తెచ్చి మరీ కాంట్రాక్టులు ..

గుట్టలుగా ఇసుక నిల్వలు

రీచ్‌ల నుంచి రూ. 10 వేలకే ఆరు టన్నులు

పాయింట్ల వైపు చూడని నిర్మాణదారులు

కాంట్రాక్టర్లు లబోదిబో..

అధికారులపై కస్సుబుస్సు

వర్షాకాలం అవసరాల కోసం ప్రభుత్వం ఇసుక నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంది.. వాటిని అమ్ముకునేందుకు కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది.. ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకుని కొంతమంది తమకే కాంట్రాక్టులు వచ్చేలా చూసుకున్నారు.. కానీ వారు అనుకున్నది ఒకటి.. అయిందొకటి.. ఇప్పుడు ఇసుక పాయింట్ల నుంచి కొనుగోలు చేసేవారే కరువయ్యారు.. తక్కువ ధరకే వస్తుండడంతో రీచ్‌ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు..

(భీమవరం–ఆంఽధ్రజ్యోతి)

‘‘వర్షాకాలంలో నిర్మాణాలు ఆగకూడదు. అందరికీ ఇసుక అందుబాటులో ఉండాలి. స్టాక్‌ పాయింట్‌ల నుంచి భర్తీ చేయండి ’’అంటూ అధికారులు పదే పదే సమీక్షలు చేశారు. స్టాక్‌ పాయింట్‌ల వద్ద ఇసుక అమ్మకాలకు కాంట్రాక్టర్‌లను ఖరారు చేశారు. దీనికోసం తొలుత కూటమి శ్రేణులు పోటీ పడ్డాయి. స్టాక్‌ పాయింట్‌ల వద్ద ఇసుక అమ్మకం జరిపేలా తమకే కాంట్రాక్టర్‌ దక్కాలని అంతా ఎగబడ్డారు. కూటమి ఎమ్మెల్యేలకు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు తమకే కాంట్రాక్ట్‌ దక్కేలా ఒత్తిడి చేశారు. ఏజన్సీ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న కూటమి శ్రేణులకు నచ్చచెప్పి కోరుకున్న వారికే కాంట్రాక్ట్‌లు ఇప్పించారు. కాంట్రాక్ట్‌లు దక్కించుకున్న వారు ఎంతో ఊహించుకున్నారు. స్టాక్‌ పాయింట్‌ల వద్ద గుట్టలుగా ఇసుక నిల్వలు ఉంచారు. వర్షాకాలంలో డిమాండ్‌ మేరకు అమ్ముకోవచ్చంటూ తహతహలాడారు. తీరా చూసేసరికి ఇసుక పాయింట్‌ల నుంచి కొనుగోలు చేసేవారు కరువయ్యారు. నిర్మాణదారులు కూడా ముందుగానే జాగ్రత్తపడ్డారు. వానా కాలంలో ఇసుకకు డిమాండ్‌ ఉంటుందన్న ఉద్దేశంతో వేసవిలోనే ఇసుక రప్పించుకుని నిల్వలు చేసుకున్నారు.

నిల్వ చేసుకున్న లారీ యజమానులు

ఇసుక సరఫరా చేసే లారీ యజమానులు కూడా వేసవిలోనే కొంత మొత్తంలో నిల్వలు చేసుకున్నారు. వాహనాలు అధికంగా ఉండే గ్రామాల్లో ఇసుక గుట్టలున్నాయి. వాటిని అమ్మకాలు సాగిస్తూ వస్తున్నారు. తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ఔరంగాబాద్‌ రీచ్‌ నుంచి ఇసుక సరఫరా అవుతోంది. దాంతో స్టాక్‌ పాయింట్‌ల నుంచి ఏ ఒక్కరూ ఇసుక కొనుగోలు చేయడం లేదు. అధిక రోజులు గుట్టలుగా ఇసుక నిల్వ చేస్తే నాణ్యత పోతుందున్న ఉద్దేశంతో నిర్మాణదారులు తాజా ఇసుకపైనే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, ఆచంట ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా స్టాక్‌ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ఇసుక నిల్వలు చేసుకున్నారు. తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 37,500 టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఇతర స్టాక్‌ పాయింట్‌లలోనూ 10 వేల టన్నులకు పైగా నిల్వ చేశారు. ఒక్క లారీ కూడా అక్కడ నుంచి అమ్మకాలు సాగడం లేదు. స్టాక్‌ పాయింట్‌ల నిల్వలపై జిల్లా అఽధికారులు సైతం ప్రచారం చేశారు. ధరలను నిర్ణయించారు. అమ్ముకుందామంటే ఇప్పుడు కొనుగోలు చేసేవారు కరువయ్యారు.

అధికారులపై కస్సుబుస్సు

గ్రామాల్లో అక్రమ నిల్వల నుంచి ఇసుక అమ్మకాలు సాగిస్తుండడం వల్లే స్టాక్‌ పాయింట్‌ల వద్ద ఇసుక కొనుగోలు చేయడం లేదంటూ కాంట్రాక్టర్‌లు లబోదిబోమంటున్నారు. ఇసుక సరఫరా చేసే టిప్పర్‌ వాహనాలకు కొన్ని గ్రామాలు పేరుమోశాయి. అక్కడ నుంచి ఇసుక సరఫరా అవుతుందంటూ కాంట్రాక్టర్‌లు అనుమానిస్తున్నారు.వారి వెనుక ఉండి స్టాక్‌ పాయింట్‌లు ఏర్పాటు చేసుకున్న నాయకులు ఇప్పుడు అధికారులపై కస్సుబుస్సు లాడుతున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుట్టలనుంచి అమ్మకాలు సాగిస్తుంటే ఏమి చేస్తున్నారంటూ అధికారులపై దురుసుగా మాట్లాడు తున్నారు. ఇసుక గుట్టలున్న గ్రామాల్లో పోలీసు గస్తీ కూడా పెట్టారు. అయినా సరే స్టాక్‌ పాయింట్‌ వద్ద అమ్మకాలు మాత్రం సాగడం లేదు. రీచ్‌ల నుంచి వచ్చే ఇసుక రూ. 10వేలకే లభ్యమవుతోంది. అదే స్టాక్‌ పాయింట్‌ల వద్ద అయితే రూ. 12,500 వరకు ఉంటోంది. దాంతో నిర్మాణదారులు రీచ్‌ల నుంచి వచ్చే ఇసుక కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కాంట్రాక్టర్‌లు అంచనాలు తారు మారయ్యాయి. స్టాక్‌ పాయింట్‌లపై నమ్మకం పెట్టుకుని నష్టపోయారు.

రీచ్‌ల నుంచి సరఫరా

జిల్లాకు వానాకాలంలోనూ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా అవుతోంది. కాలువల ద్వారా బోటుల్లో ఇసుక తెచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. కేవలం రూ.10 వేలకే ఆరు యూనిట్‌లు ఇసుక మార్కెట్‌లో లభ్యమవుతోంది. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఇదే ధర పలుకుతోంది, అదే భీమవరం అయితే రవాణా చార్జీలు అధికంగా ఉండడంతో రూ. 14 వేల నుంచి రూ. 15 వేలకు అమ్మకాలు సాగిస్తున్నారు. అయినా అంతంత మాత్రంగానే కొనుగోలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఇదే ఇసుక తాడేపల్లిగూడెంలో రూ. 14 వేలు, భీమవరంలో రూ. 22 వేలకు అమ్మకాలు సాగించేవారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇసుక ఎంత కావాలన్నా లభ్యమవుతోంది. స్టాక్‌ పాయింట్‌ల వద్ద అమ్మకాలు పడిపోయాయి.

Updated Date - Sep 08 , 2025 | 12:24 AM