Share News

ముంచేస్తున్నారు

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:50 AM

ప్రతి ఒక్కరి కల.. సొంతింటి నిర్మాణం. ఉద్యో గమో, వ్యాపారమో చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకునేది జీవిత చరమాంకంలో సొంతింటిలో సేద తీరుదామని..

 ముంచేస్తున్నారు

రియల్టర్ల మోసాలకు సామాన్యులు బలి !

ప్రతి ఒక్కరి కల.. సొంతింటి నిర్మాణం. ఉద్యో గమో, వ్యాపారమో చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకునేది జీవిత చరమాంకంలో సొంతింటిలో సేద తీరుదామని..

కాని, రియల్టర్ల మాటలు నమ్మి సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల డీటీసీపీ అప్రూవల్‌ వుందని చెప్పి స్థలాలు విక్రయించి తర్వాత కనీస సదుపా యాలు కల్పించకుండా చేతులెత్తేస్తున్నారు. మరికొందరు నాన్‌ లే అవుట్లలో వెంచర్లు వేసి జనాన్ని నిండా ముంచేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ సమస్య జఠిలంగా మారుతోంది.

(ఏలూరు/భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనధికార లే అవుట్‌లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. అనుమతి పొందిన లే అవుట్‌లలోనూ అభివృద్ధి కనిపించడం లేదు. కొద్దిమంది రియల్టర్లను మినహాయిస్తే ఈ జిల్లా ల్లో కొనుగోలుదారులకు కుచ్చుటోపీ పెట్టే రియల్టర్లే అధికంగా ఉన్నారు. ఏలూరు జిల్లా గ్రామ శివారు, పట్టణాల నడుమ కొన్నేళ్లుగా ఏర్పాటు చేసిన లే–అవు ట్లు కనీస సౌకర్యాలకు దూరంగా ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో వందలాది లే–అవుట్లు వెలిశాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసా పురం, కొయ్యలగూడెం, పోలవరం, నూజివీడు, చింతలపూడి, ద్వా రకాతిరుమల ప్రాంతాల్లోను ఇటీవల విస్తరించాయి. ఇక్కడ కొందరు రాజకీయ నాయకుల అండదండలతోనే స్థలాలు కొని లే–అవుట్లు వేస్తున్నారు. రహదారులు అభివృద్ధి చేస్తామని, డ్రైయిన్లు నిర్మిస్తామని స్థలాలు విక్రయిస్తున్నారు. రియల్టర్‌లే ఇళ్లను నిర్మించి అమ్మకాలు సాగిస్తున్నారు. తీరా కొనుగోలు చేసిన

తర్వాత నిర్మాణదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. డ్రెయిన్లు, రహదారులను పూర్తి స్థాయిలో నిర్మించకుండా వదిలేస్తు న్నారు. వాస్తవంగా ప్లాట్ల విక్రయాలు పూర్తయిన తర్వా త మూడేళ్లలోపు రోడ్లు, డ్రెయిన్లు, పార్కు, వాటర్‌ ట్యాంకు నిర్మాణాలు చేయాలి. కాని, తూతూమంత్రంగా రోడ్లు, లైట్లు వేసి వదిలేస్తున్నారు. ప్లాట్ల పరిస్థితిపై ఇప్పటి వరకు టౌన్‌ అండ్‌

కంట్రీ ప్లానింగ్‌ అధికారులు కన్నెత్తి చూడలేదు. కనీస వసతులున్నాయా? అని ఆరా తీయలేదు.

ఇడా పరిధిలోకి జిల్లాలు

ఈ రెండు జిల్లాల్లో అధికభాగం ఏలూరు అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ (ఇడా) పరిధిలోకి వస్తాయి. కొన్ని వెంచర్లు డీటీసీపీ అనుమతితో వేసినప్పటికీ ఆ పరిధి ఇడా పరిధిలోకే చేరిపోవడంతో.. బాధితులు ఎవరిని సంప్రదించాలో తెలియని దుస్థితి. వెంచర్‌ వేసిన స్థలంలో 10 శాతం స్థలాన్ని మార్టిగేజ్‌ కింద లే–అవుట్‌ అనుమతి పొందినప్పుడు తనఖా పెట్టాలి. ఈ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ప్లాట్లు అమ్మేసుకుని బిల్డర్లు చేతులెత్తేస్తున్నారు.

మురుగునీటికి ఆవాసాలుగా..

లే అవుట్‌లను రియల్టర్లు అభివృద్ధి చేయకపోవడంతో ఈ స్థలాల న్నీ గోతులుగా మారి వర్షపు నీరు, మురుగు నీటితో నిండిపోతున్నాయి. వర్షాకాలంలో దోమలు చేరి పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది. మున్సిపాలిటీలు నోటీసులు జారీ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. లే అవుట్‌ దారులు రహదారులు వేయకుండానే విక్రయించే యడంతో కొనుగోలుదారులు స్థలాలు అమ్ముకుందా మన్నా విక్రయానికి నోచుకోవడం లేదు. అలాగని నివాసాలు ఏర్పాటు చేసుకుందామన్నా సరే మంచినీటి కుళాయిలు, డ్రెయిన్‌ల సౌకర్యం లేకపోవడంతో ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి స్థల యజ మానులు ముందుకు రావడం లేదు. కొన్ని ప్రభుత్వ పుంతలను రహదారులుగా ఏర్పాటుచేసి దారి చూపుతు న్నారు. మున్సిపల్‌ అధికారులు ఇటువంటి లే అవుట్‌లపై చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ పుంతలను పూడ్చి గ్రావెల్‌ రోడ్లు వేసిన లే అవుట్లు అనేకం ఉంటున్నాయి. వీటిపై అధికారులు కన్నెత్తి చూడడం లేదు. స్థలాలు కొనుగోళ్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ఫిర్యాదు చేస్తే చర్యలు

అనుమతి పొందిన లే–అవుట్లు వేసిన తర్వాత మూడేళ్లలోపు అక్కడ ఏర్పాటు చేస్తామన్న సౌకర్యాలు అన్ని బిల్డర్లు కల్పించాలి. కొనుగోలుదారులకు ఏదైనా అసౌకర్యం కలిగితే మాకు ఫిర్యాదు చేస్తే ఆ బిల్డర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తాం. వారు వచ్చి చేస్తే సరి. లేకపోతే మేమే మార్టిగేజ్‌ చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆక్షన్‌ పెట్టి.. ఆ మొత్తంతో సౌకర్యాలు కల్పిస్తాం.

–సుధాకర్‌, ఇడా ప్లానింగ్‌ ఆఫీసర్‌

ఏలూరు సమీపంలో హైవే పక్కన పదేళ్ల క్రితం ఓ రియ ల్టర్‌ ఏడెకరాలకు పైగా విస్తీర్ణం లో వెంచర్‌ వేశాడు. నిబంధ నల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పిస్తానని నమ్మబలికి వంద కు పైగా ప్లాట్లు అమ్మేశాడు. కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుని జేబులు నింపుకు న్నాడు. ఏళ్లు గడుస్తున్నా కనీస సదుపాయాలైన రోడ్లు, విద్యుత్‌, డ్రెయిన్లు, పార్కులు, తాగునీటి సదుపాయం ఏమీ కల్పించలేదు. ఈ ప్రాంతం ఇప్పుడు అడవిని తలపిస్తోంది. కనీస సౌకర్యాలు లేక స్థలాలు అమ్మలేరు.. నిర్మాణాలు చేపట్టలేరు.

తాడేపల్లిగూడెంలో ఓ రియల్టర్‌ డెలప్‌మెంట్‌కు కొంత భూమి తీసుకున్నారు. అపార్ట్‌మెంట్‌, షాపింగ్‌ కాం ప్లెక్స్‌ నిర్మిస్తామంటూ స్థల యజమానులకు నమ్మబలికి ఒప్పందం చేసుకున్నాక చేతు లెత్తేసి వారిని నిండా ముంచేశాడు.

మరో నిర్మాణదారుడు కొనుగోలుదారుల నుంచి సొమ్ములు తీసుకుని ఎనిమి దేళ్ల నుంచి అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పూర్తి చేయకుండా చేతులెత్తేశాడు. అతని చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకపోయింది.

భీమవరంలో నిర్మాణదారుడి మోసంతో నాన్‌ లే అవుట్‌లలో స్థలాలను కొనుగోలు చేసినా వారంతా ఇప్పుడు ఇళ్లు నిర్మిం చుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. బ్యాంకులు రుణాలు, మున్సిపాలిటీలు ప్లాన్‌లు ఇవ్వకపోవడంతో లబోదిబోమంటున్నారు.

తాడేపల్లిగూడెంలో స్థలాలను విభజించి కొనుగోలుదారుల పేరుతో రుణాలు తీసుకున్న వారూ ఉన్నారు. రుణం చెల్లించకపోవడంతో కొను గోలుదారులకు నోటీసులు వెళ్లడంతో వీరు లబోదిబోమంటున్నారు.

రియల్టర్‌ ఏం చేయాలి ?

రియల్టర్‌ అనుమతి పొందిన ప్రతి లే అవుట్‌కు ప్రవేశ మార్గం, 60 అడుగుల వెడల్పున ప్రధాన రహదారి ఉండాలి.

అంతర్గత రోడ్లతోపాటు ప్లాట్ల మధ్యన రోడ్లు తప్పనిసరి.

డ్రెయినేజీ వ్యవస్థ పక్కాగా ఉండాలి. వర్షపు నీటిని బయటకు పంపించే స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయినేజీతోపాటు మురుగునీటి కోసం యూజీడీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.

భారీ లే అవుట్లు అయితే సీవేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్‌టీపీ) నెలకొల్పాలి.

మంచినీటి సదుపాయాలకు సంబంధించి ఓవర్‌హెచ్‌ ట్యాంక్‌తోపాటు డిస్ర్టిబ్యూషన్‌ పైపు నెట్‌వర్క్‌, ప్రతి ప్లాటుకు నీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి.

విద్యుత్‌ సరఫరా–లైటింగ్‌ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ పోల్స్‌, పోల్స్‌కు కండక్టర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలి.

ఆహ్లాదం కోసం గ్రీన్‌లాన్స్‌, పార్కులు ఉండాలి. కామన్‌ అవసరాల కోసం కామన్‌ సైట్‌ను నిర్దేశించాలి.

ఎవరికి ఫిర్యాదు చేయాలి ?

పైన తెలిపిన విధంగా వెంచర్ల నిర్వాహకులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే ఏలూరు అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీకి (ఇడా)కు ఫిర్యాదు చేయవచ్చు. స్పందించకపోతే వెంచర్‌ నిర్వాహకుడు, ఇడాపై రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. రెరా కూడా పట్టించుకోకపోతే డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) వద్దకు వెళ్లొచ్చు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే లోకాయుక్తలో ఫిర్యాదు చేయవచ్చు.

వీఎల్‌టీ బాదుడు

లే అవుట్లలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం వల్ల కొనుగోలుదారులు నిర్మాణ పనులు చేపట్టలేకపోతున్నారు. ఫలితంగా వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌(వీఎల్‌టీ) బాదుడును ఎదుర్కోవాల్సి వస్తోంది. పలుచోట్ల ప్లాట్లు నిర్మించుకోకపోవటం వల్ల ఖాళీగా ఉండటంతో వెంచర్ల నిర్వాహకులు ఇతర ప్రయోజనాలకు వాడేస్తున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:50 AM