Share News

గుడ్లు తేలేశారు.!

ABN , Publish Date - Oct 19 , 2025 | 01:21 AM

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంలో వారానికి ఐదు సార్లు కోడిగుడ్లు, రెండు రోజులు మాంసా హారాన్ని అందించాలి.

గుడ్లు తేలేశారు.!

కోడి గుడ్లు బంద్‌.. వారానికి ఒకసారే మాంసాహారం

మెస్‌ల నిర్వహణ హరేకృష్ణ ఫౌండేషన్‌కు అప్పగింత

విద్యార్థులకు వీరు పెట్టేది వెజిటేరియన్‌ భోజనం మాత్రమే

మాంసాహారం కాంట్రాక్టు వేరొకరికి అప్పగింతపై నిర్ణయం తీసుకోని ఆర్జీయూకేటీ

పెరిగిన ఖర్చు.. నిర్వహణ భారం

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంలో వారానికి ఐదు సార్లు కోడిగుడ్లు, రెండు రోజులు మాంసా హారాన్ని అందించాలి. కాని, మెస్‌ నిర్వా హకుల మార్పుతో కొన్ని రోజులుగా గుడ్లు అందించడం లేదు. మాంసాహారాన్ని ఒక రోజుకే కుదించారు. దీనిపై విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

(నూజివీడు టౌన్‌–ఆంధ్రజ్యోతి)

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో మెస్‌లను అక్షయ పాత్ర అను బంధ హరేకృష్ణ ఫౌండేషన్‌కు ఇటీవల అప్పగిం చారు. దసరా సెలవుల తరగతులు పునః ప్రారంభం కాగానే మెస్‌ల బాధ్యతను ఈ ఫౌండేషన్‌ స్వీకరించింది. వీరు కేవలం శాఖాహారాన్ని మాత్ర మే అందిస్తారు. మెనూ ప్రకారం ఇవ్వాల్సిన కోడిగుడ్లు, మాంసాహారం అందిం చే బాధ్యతను వేరొక సంస్థకు అప్పగించాలి. అయితే ఇది ఎవరికి, ఎలా ఇవ్వాలో తెలియక ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. సెలవు లు అనంతరం విద్యార్థులకు కోడి గుడ్లు ఇవ్వడం పూర్తిగా బంద్‌ అయింది. గత ఆదివారం మాంసా హారం ప్రయో గాత్మకంగా ఏర్పాట్లు చేసినా అందరికీ పూర్తిగా అందలేదు.

ఎనిమిది వేల మంది విద్యార్థులు

నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందిన ఆరు వేల మందితోపాటు శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌ల పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,200 మందికి ఇక్కడి హాస్టల్‌లోనే వుంటున్నారు. మొత్తం ఎనిమిది వేల మందికి 80–20 శాతం లెక్కన మాంసాహారం, శాఖాహారాలను విభజించి గతంలో 750 కేజీలు కోడి మాంసం, మిగిలిన వారికి పన్నీ రుతో ఆహారాన్ని అందించేవారు. విద్యార్థుల సౌక ర్యార్థం ఏర్పడిన హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థను నిర్వ హించే కొందరు అధ్యాపకులు తాత్కాలికంగా మాంసా హారం అందించే బాధ్యతను చేపట్టారు. గత ఆది వారం కేవలం 550 కేజీల కోడి మాంసం తీసుకుని వస్తే అది సరిపోలేదు.

పెరిగిన ఆర్థికభారం.. అయోమయం

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో నూజివీడు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకు ళం, ఒంగోలు క్యాంపస్‌లలో దాదాపు 25 వేల మంది విద్యార్థులు ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసి స్తున్నారు. వీరికి వసతి సౌకర్యాలను అందించేందుకు గతంలో ప్రత్యేకంగా మెస్‌ క్యాటరర్స్‌ ఉండేవారు. వీరికి ఒక్కో విద్యార్థికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనంతో కలిపి రూ.88 చెల్లించేవారు. ప్రస్తుతం సదరు మెస్‌ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర అనుబంధ సంస్థ హరేకృష్ణ ఫౌండేషన్‌కు అప్పగిస్తూ ఒక్కో విద్యార్థికి భోజనం అందించేందుకు రూ.110 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు కోడిగుడ్డు, మాంసాహారం అందించేందుకు ఒక్కో విద్యార్థికి రూ.6.70 పైసలు అదనంగా చెల్లించేందుకు నిర్ణయించినా సదరు బాధ్యతలను ఎవరికి అప్పగిం చాలనే నిర్ణయం తీసుకోలేదు.

మాంసాహారం కాంట్రాక్ట్‌పై నేతల చూపు

విద్యార్థులకు మాంసాహారం అందించే కాంట్రాక్ట్‌ ను మెప్మాకు లేదా విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థకు అందించాలని ఆర్జీయూకేటీ ఉన్నతాధికారుల ఆలోచన. అయితే వీరి ద్దరిలో ఎవరికి ఇచ్చినా తిరిగి బయట వారికి కాంట్రాక్ట్‌ ఇవ్వాల్సిందే. ఇప్పటికే ట్రిపుల్‌ ఐటీలోని ఫుడ్‌కోర్టును మెప్మాకు ఇవ్వగా 0.5 శాతం లాభానికి బయట వ్యక్తులకు ఫుడ్‌ కోర్టును కాంట్రాక్ట్‌కు మెప్మా ఇచ్చింది. మరోవైపు మాంసా హారం కాంట్రాక్ట్‌పైనా కొందరు అధి కార పార్టీ నాయకుల చూపు పడిం ది. విధాన నిర్ణయం తర్వాత దక్కిం చుకునేందుకు పావులు కదుపుతు న్నట్టు సమాచారం.

Updated Date - Oct 19 , 2025 | 01:21 AM