మార్పుకే మచ్చ!
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:17 AM
జిల్లాలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతి నిధుల మధ్య అప్పుడప్పుడు అంతరం చోటు చేసుకుంటూనే ఉంది. తెలిసో తెలియకో కాదు. కావాలనే ఏకపక్షంగా వ్యవహరించడం ఇక్కడ రివాజుగా మారింది.
చెప్పింది చేయడం లేదని ఆక్రోశం
మంత్రుల మాట బేఖాతరంటూ ఆగ్రహం
క్రమేపీ పట్టు తప్పుతున్న యంత్రాంగం
ఇన్‌చార్జి మంత్రి దృష్టికి వ్యవహారం
‘అటవీశాఖ సమస్యలు అన్నీఇన్నీ కావు. ఏమైనా చెబుదామన్నా వాళ్ళేమన్నా కంటికి కనపడితేనే కదా. కీలక సమావేశాలు జరిగినా రానేరారు. ఇక చెప్పుకోవడానికి, పరిష్కారా నికి తావేది. ఏమో ఎవరికి చెప్పాలో తెలియడం లేదు’ ఇది ఒక ప్రజాప్రతినిధి ఆక్రోశం.
‘రెవెన్యూ సమస్యలు కోకొల్లలు. ఒకరికి చెబుదామంటే ఇంకొకరికి చెప్ప మంటారు. తీరా చెబితే పరిష్కారం కాదు. పదేపదే పనేమైందని ప్రశ్నిస్తే మాత్రం ఇదిగో అదిగో అంటూ నాన్చేస్తారు. నా ఒక్కరి సమస్య కాదిది. ప్రతీ ఒక్కరి సమస్య. అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి గట్టిగా నోరు తెరవలేకపోతున్నాం’ ఇది మరో ప్రజాప్రతినిధి ఆవేదన.
‘ఇదేంటి మొత్తం ప్రచారమంతా ఆవైపే తిరుగుతా ఉంది. కనీసం మేముకూడా ఉన్నాం కదా. ప్రజాప్రతినిధిగా మమ్మల్ని చూడాలి కదా. ఏంటీ వన్‌సైడ్.. ఏంటో ఎంత చెప్పినా ఇంతే.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రచార శకటా లపై అంతా అధికారులదే ఆర్భాటం’... ఒక ముఖ్య ప్రజాప్రతినిధి ఆగ్రహమిది.
సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగానికి ఒక పేదింటి పిల్లోడు ఏదో చెప్పుకుందామని వచ్చాడు. ఆ సమావేశానికి వచ్చిన మంత్రి చూసి సమస్య పరిష్క రించాల్సిందిగా అధి కారులను ఆదేశించారు. ఆ పిల్లాడి సమస్య పరిష్కారమైతే అయ్యిందికాని జిల్లా ముఖ్య అధికారి పేరిటే అంతా వైరల్ అయ్యింది. ఆహా.. ఓహో అంటూ సమాచార శాఖ గుప్పించింది. ఇంకేముంది సదరు మంత్రి పేషీ మండి పడింది. చేసింది మంత్రి అయితే.. రివర్స్‌లో ఇంకొకరికి ఎలా ఆపాదిస్తారంటూ సర్రుమంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
జిల్లాలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతి నిధుల మధ్య అప్పుడప్పుడు అంతరం చోటు చేసుకుంటూనే ఉంది. తెలిసో తెలియకో కాదు. కావాలనే ఏకపక్షంగా వ్యవహరించడం ఇక్కడ రివాజుగా మారింది. ప్రత్యేకించి కొన్ని సందర్భా ల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే.. ప్రయోజనం శూన్యం. కదలం మెదలం అన్నట్టుగా కొందరి అధికారుల తీరుగా మారింది. ఇదే పాలనా యంత్రాంగం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. చాన్నాళ్ళుగా కొన్ని విభాగాధిపతులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం, కలెక్టర్ చెబితేనే తాము పనిచేస్తామన్నట్టుగా వ్యవహరించడం, లేదంటే చూద్దాం చేద్దామంటూ కాలం గడి పేయడం పలుమార్లు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి సమావేశాలకు అది జిల్లా అయినా.. మండలమైనా ఒక్కటే. ప్రజాప్రతినిధులతో సహా అన్ని శాఖల అధికారులు సమావేశాలకు హాజరుకావాల్సింది పోయి.. తమకేమీ పట్ట నట్టుగా సమావేశాలను అధికారులు మెల్ల కన్నుతో చూస్తున్నారు. అధికారులు సమా వేశాలకు రావడం లేదు.. ఎందుకంటూ మండ ల పరిషత్, నగరపాలక సంస్థ సమావేశాల్లో పదేపదే వినిపిస్తూనే ఉంది. కాని ఇలా సమా వేశాలకు ఎగనామం పెడుతున్న కొందరి పైనైనా చర్యలు తీసుకుంటే మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండేవి. జిల్లా స్థాయిలో మాకెందుకులే అన్నట్టుగా వదిలేయడంతోనే ముదిరి పాకాన పడింది.
ఎవరైతే మాకేంటి.. ?
జిల్లా స్థాయిలో చాలా శాఖలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. స్వయంగా ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని తెగేసి చెబుతున్నారు. జిల్లాల విభ జన జరిగిన తర్వాత ఈ తరహా వాతావరణం మరింత పెరిగింది. అటవీ, రెవెన్యూ, వ్యవ సాయం, పంచాయతీరాజ్‌తో సహా అనేక విభా గాల్లో అధికారుల తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ‘రెవెన్యూతో అనేక ఇబ్బందులు ఉన్నా యి. ప్రతీసారి చెబుతూనే ఉన్నాం. వాళ్ళకేమో పట్టడంలేదు. ఇలాగైతే ఎలా. సీరియస్‌గా తీసు కోవడం తెలియడంలేదు. అటవీశాఖ సంగతి చెప్పనక్కర్లేదు. పట్టాలిచ్చారు కదా అని నా నియోజకవర్గంలో రైతులు సంతోషపడ్డారు. తీరా ఆ భూముల్లో సాగుకు అనువుగా బోరు వేద్దామంటే.. అటవీశాఖ అడ్డంకి. అడుగుదా మంటే ఒక్కరూ అందుబాటులో ఉండరు’ జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఒక ప్రజాప్రతినిధి ఫిర్యాదిది. కేవలం మౌలిక వస తులకు అనువుగా రోడ్లు, తాగునీరు కల్పిద్దామ నుకున్నా అబ్బబ్బే.. అటవీశాఖ అడ్డంగా అడ్డు తగులుతోంది. లంకల్లో జనం బతకాలికదా. ఇప్పుడు కొల్లేరుకు వరదొస్తే పెద ఎడ్లగాడివద్ద గుర్రపుడెక్క అడ్డు తగులుతోంది. ఇప్పుడేం చేయాలి.. కైకలూరు ఎమ్మెల్యే నేరుగానే నిట్టూర్చే పరిస్థితి. వరద నివారణకు వీలుగా ఎక్కడికక్కడ స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగాల్సి ఉండగా అదేదీ కనిపించకపోవడంతో సదరు ఎమ్మెల్యే సమావేశంలో ప్రస్తావించాల్సి వచ్చింది. జిల్లా స్థాయిలో వర్షాలు, వరదలపై సమీక్షలు జరుగుతున్నప్పుడు ఆయా శాఖలకు నిర్ణయాత్మకంగా కొన్ని సూచనలు జారీ చేసి వాటిని అమలుపరిచే బాధ్యత సంబంధిత శాఖలకు ఇచ్చినా కార్యాచరణలో వెనుకడుగు వేయడం జిల్లాలో నిత్యకృత్యంగా మారింది. చిన్న చిన్న సమస్యలపైనా ఫిర్యాదులపరంపర కొనసాగుతూనే వచ్చింది. సాధారణంగా జిల్లా, మండల స్థాయిలో ప్రతి సోమవారం రైతులు, సాధారణ పౌరులు తమ సమస్యలను ఏకరువు పెడుతూనే ఉన్నారు. కాని ఫలితం మాత్రం లేదు. ఎమ్మెల్యేలు కలుగ చేసుకుని ప్రస్తావించాల్సి వస్తోంది. ఎరువులు, పురుగుల మందుల జారీకి వచ్చే ఆటంకాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లాంటివారు లేవనెత్తా ల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ అధికార పక్షానికి చెందినవారే. కీలక సమావేశాల్లో యంత్రాంగం వైఫల్యం మీద లేదా చేతకానితనం మీద మాట్లాడితే అది ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ. అందుకనే ఉన్న సమస్యపై బహిరంగంగా మాట్లాడలేక.. సక్రమంగా స్పందించని అధికారులపై విరుచుకుపడలేక ఎమ్మెల్యేలంతా నిస్సహాయతలో పడ్డారు. కాని అధికారంలో ఉండి తామేమీ చేయలేకపోతు న్నామన్న భావన ప్రజల్లో ముదిరితే అది తమ చేతకానితనం అవుతుందేమోనని కొందరు ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వపరంగా కొన్నింటిని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమైనా అధికారులు తదనుగుణంగా స్పందించని ఘటనలు చాలానే ఉన్నాయి. శాఖల వారీగా సమీక్షలు జరుగుతున్నప్పుడు కేవలం అంకెల ప్రస్తావనతో సరిపెట్టకుండా పనితీరు ప్రామాణికంగా సమీక్షిస్తే తప్ప కొన్ని శాఖలు బాగుపడే పరిస్థితిలేదని భావిస్తున్నారు. ఇన్‌చార్జిమంత్రి మనోహర్ సైతం ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ.. మనం ప్రత్యేకంగా భేటీ అయ్యి మాట్లాడుకుందామని నచ్చచెపాల్సి వస్తుంది.