Share News

నైరుతి.!

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:02 AM

వర్షాకాలం మొదలైందంటే నైరుతి రుతుపవ నాలు ఆగమనంతో జిల్లాలో వర్షాలు జోరుగా కురవాలి.

నైరుతి.!
చాటపర్రులో వర్షాలు లేక నెర్రలు తీసిన నారుమడి

జూన్‌లో నాలుగు, జూలైలో 24 మండలాల్లో మైనస్‌ వర్షపాతం

ప్రశ్నార్థకంగా సార్వా సాగు .. రైతుల్లో ఆందోళన

వర్షాకాలం మొదలైందంటే నైరుతి రుతుపవ నాలు ఆగమనంతో జిల్లాలో వర్షాలు జోరుగా కురవాలి. సాధారణం కన్నా ఎక్కువగానే వర్షా లు కురిస్తే సార్వా సాగు సజావుగా సాగు తుంది. అయితే ఈ సారి జూన్‌లో నైరుతి రుతుపవనాలు పర్వాలేదనిపించినా జిల్లాలోని నాలుగు మండలాల్లో మైనస్‌ వర్షపాతాలు నమోదు కాగా జూలైలో పూర్తిగా వర్షాలు మందగించడంతో 24 మండలాల్లో మైనస్‌ వర్షపాతాలు నమోదైంది. వర్షాభావ పరిస్థితుల్లో సార్వా సాగుపై నీలినీడలు అలముకున్నాయి.

ఏలూరు సిటీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): సార్వా సీజన్‌ ఆరంభమైనా వర్షాలు మాత్రం ముఖం చాటేస్తున్నాయి. జూన్‌, జూలై రెండు నెలల్లో సరాసరి వర్షపాతాలు పరిశీలిస్తే జిల్లా లోని 28 ప్రాంతాల్లో 16 మండలాల్లో మైనస్‌ వర్షపాతా లు నమోదు కావడం గమనార్హం. ఇక ఆగస్టు నెల ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు వర్షాల జాడ లేదు. దీంతో సార్వా సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే సార్వా వరి సాగులో వరి నారుమళ్లు పర్వం పూర్తయి నాట్లు కార్య క్రమం సాగుతోంది. అపరాల సాగులో వర్షా లు మందగించడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు.

జూన్‌లో నాలుగు మండలాల్లో..

ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం 111.9 మిల్లీ మీటర్లు కాగా 182.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కన్నా 62.8 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అయితే నాలుగు మండలాల్లో మాత్రం మైనస్‌ వర్షపాతాలు నమోదయ్యాయి. వేలేరుపాడు మైనస్‌ 50.4 శాతం, కుక్కునూరు మైనస్‌ 56.5 శాతం, బుట్టాయిగూడెం మైనస్‌ 0.1 శాతం, ఆగిరిపల్లి మైనస్‌ 6.1 శాతం వర్షాలు కురిశాయి.

జూలైలో మైనస్‌ 22.4 శాతం వర్షపాతం

జూలైలో మొదటి నుంచి వర్షాలు పూర్తిగా మందగించాయి. ఈ నెలలో జిల్లాలోని 24 మండలాల్లో మైనస్‌ వర్షపాతాలు నమోద య్యాయి. జూలైలో సాధారణ వర్షపాతం 242.1 మిల్లీ మీటర్లు కాగా 187.9 మి.మీ మాత్రమే అంటే మైనస్‌ 22.4 శాతం వర్షపాతం నమో దైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్త నాలు, అల్పపీడనాలు ఏర్పడినా నైరుతి రుతుపవనాలు బలపడలేక పోయాయి. జిల్లాలో 24 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ గానే వర్షపాతాలు నమోదయ్యాయి. కుక్కునూరు మైనస్‌ 18.5, టి.నరసాపురం మైనస్‌ 18.3, జీలుగుమిల్లి మైనస్‌ 5.4, బుట్టాయిగూడెం మైనస్‌ 16.6, పోలవరం మైనస్‌ 30.3, కొయ్యలగూడెం మైనస్‌ 31.9, జంగారెడ్డిగూడెం మైనస్‌ 10.4, ద్వారకాతిరు మల మైనస్‌ 24.2, ఉంగుటూరు మైనస్‌ 53, భీమడోలు మైనస్‌ 37.9, పెదపాడు మైనస్‌ 40.1, ఏలూరు రూరల్‌ మైనస్‌ 48.2, దెందు లూరు మైనస్‌ 34.4

నిడమర్రు మైనస్‌ 60.6, మండవల్లి మైనస్‌ 26.1, కలిదిండి మైనస్‌ 1.7, ముదినేపల్లి మైనస్‌ 23.2, ఏలూరు అర్బన్‌ మైనస్‌ 51.6, చింతలపూడి మైనస్‌ 26.1, లింగపాలెం మైనస్‌ 41.5, చాట్రాయి మైనస్‌ 19, ముసునూరు మైనస్‌ 6.1, నూజివీడు మైనస్‌ 46.9, ఆగిరిపల్లి మైనస్‌ 3.7 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.

జూన్‌, జూలై నెలలు కలిపి మొత్తం వర్షపాతం పరిశీలిస్తే జిల్లాలోని 12 మండలాల్లో సాధారణం కన్నా మించి వర్షపాతాలు నమోదు కాగా 16 మండలాల్లో మైనస్‌ వర్షపాతాలు నమోదయ్యాయి. ఈ రెండు నెలల్లో కలిపి మొత్తం సాధారణ వర్షపాతం 354 మిల్లీ మీటర్లు కాగా 370 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే వర్షం కురిసిన ప్రాంతాల్లో మాత్రమే వర్షం కురుస్తోంది. వర్షం కావాల్సిన ప్రాంతాల్లో వర్షం అంతంతమాత్రంగానే కురుస్తోంది. దీంతో సార్వా సాగులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Updated Date - Aug 05 , 2025 | 01:02 AM