Share News

చినుకు జాడేది!

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:59 AM

ఒక పక్క నైరుతి రుతుపవనాలు మందగిం చడంతో జిల్లాలో వర్షాల జాడలేకుండా పోయింది. మరోపక్క కృష్ణా–ఏలూరు కెనాల్‌ పరిధిలో పంట భూము లకు సాగునీరు అందక నారు మడులు ఎండి పోవడమే కాకుండా పంట భూములు నెర్ర లిచ్చాయి.

చినుకు జాడేది!
ఏలూరు రూరల్‌ మండలం సుంకరవారితోటలో నీరు అందక నెర్రలు తీసిన నారుమడి

కృష్ణా–ఏలూరు కెనాల్‌ పరిధిలో సాగునీటి ఇబ్బందులు

ఎండుతున్న వరి నారుమళ్లు

నెర్రలు తీస్తున్న పంట భూములు

సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు

ఒక పక్క నైరుతి రుతుపవనాలు మందగిం చడంతో జిల్లాలో వర్షాల జాడలేకుండా పోయింది. మరోపక్క కృష్ణా–ఏలూరు కెనాల్‌ పరిధిలో పంట భూము లకు సాగునీరు అందక నారు మడులు ఎండి పోవడమే కాకుండా పంట భూములు నెర్ర లిచ్చాయి. ఈ పరిస్థితుల్లో సార్వా సాగు సాగేదెలా..? అని రైతులు ఆందోళన చెందుతు న్నారు. సాగునీటి సమస్య పరిష్కరించాలంటూ పలుచోట్ల ఆయకట్టు శివారు రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నారు.

ఏలూరుసిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జూన్‌లో కురిసిన వర్షాల నేపథ్యంలో ముందస్తుగా సార్వా వరి సాగు ప్రారంభమైంది. అయితే జూలైలో నెలకొన్న వర్షా భావ పరిస్థితుల కారణంగా వారం రోజులుగా వర్షాల జాడలేకపోవడంతో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది సార్వా వరి సాగును 2.24 లక్షల ఎక రాల్లో చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయిం చుకుంది. దీనికి తగ్గట్టుగా 11,248 ఎకరాల్లో వరి నారు మళ్లు వేయాల్సి ఉంది. ఇప్పటివరకు 8,106 ఎకరాల్లో వరి నారుమళ్లు పూర్తి కాగా 20,982 ఎకరాల్లో వరి నాట్లు పూర్త య్యాయి. కృష్ణా–ఏలూరు కెనాల్‌ పరిధిలో ఏలూరు, పెద పాడు, దెందులూరు మండలాల్లో సాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. కెనాల్‌కు ఇవి శివారు భూములు కావడంతో సక్రమంగా నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ మూడు మండలాల పరిధిలోనే సుమారు 58 వేల ఎకరాలు సాగు కావాల్సి ఉంది. ఇక జిల్లాలో పశ్చిమ డెల్టానుంచి గోదావరి కాల్వలకు నీరు విడుదల చేసినా ఎండ తీవ్రత వల్ల పంట పొలాలకు నీటి తడులు సరి పోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఒక పక్క భూము లు బీటలు వారిపోతున్నాయని, అక్కడ వరి నారుమళ్లు వేయడం కూడా కష్టతరంగా ఉందని రైతులు చెబుతు న్నారు. ఇక ఎండల తీవ్రత కారణంగా వరి సాగులో జింక్‌ధాతు లోపం, ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

పూడుకుపోయిన పంట కాలువలు

ఏలూరు రూరల్‌ : ఖరీఫ్‌ పనులు మొదలయ్యాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు పొలాలను దుక్కిచేసి సాగుకు సిద్ధం చేస్తున్నారు. అయితే పంటకు సాగునీరందించే కాలువలు, చెరువులు పూడికలు, పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుండడంతో రైతులు కలత చెందుతున్నారు. కాలువ పూడికను ఈ ఏడాది జనవరిలో నామమాత్రంగా తీశారు. అవసరం లేని సమయంలో పూడిక తీసి నిధులు పక్కదారి మళ్లించారని విమర్శలు ఉన్నాయి. ఏలూరు రూరల్‌ మండలం కృష్ణా డెల్టా పరిధిలోని వెంకటాపురం, మాదేపల్లి, జాలిపూడి, చాటపర్రు, పోణంగి, కొమడవోలు, కాట్లంపూడి, తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందడం లేదు. నీరందక నారుమళ్లు ఎండిపోతున్నాయి. మరోవైపు కృష్ణా మెయిన్‌ కెనాల్‌ నుంచి జాలిపూడి, మాదేపల్లి వైపు వెళ్లే ప్రధాన పంట కాలువ గుర్రపుడెక్క తూడు, తుక్కు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయింది. నాట్లు వేసిన చేలు బీటలు వారాయని, కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

శివారు గ్రామాలకు సాగు, తాగునీరందించాలి

కైకలూరు : శివారు గ్రామాలకు తాగు, సాగునీరు అందించేందుకు ఉన్నతాఽధికారులతో మాట్లాడతామని ఇరి గేషన్‌ డీఈ శిరీష అన్నారు. బుధవారం కైకలూరు ఇరి గేషన్‌ కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులతో సమా వేశాన్ని నిర్వహించారు. కాలువ తవ్వకాలు చేసినా శివారు గ్రామాలకు తాగు, సాగునీరు రావడం లేదని కాలువల సామర్థ్యం మేరకు ఎగువ నుంచి నీరు అందజేయాలని నీటి సంఘాల అధ్యక్షులు, డీసీ చైర్మన్లు కోరారు. కైక లూరు, కలిదిండి మండలాల్లో అనేక గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నెలకొందని పోల్‌రాజు, సీబీకెనాల్‌కు ఒక్కొక్క కాలువకు 400 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని, ప్రస్తుతం అఽధికారులు 300 క్యూసెక్కుల విడుదల చేశా మని చెబుతున్నా 250 క్యూసెక్కుల నీరు కంటే ఎక్కువ రావడం లేదన్నారు.400 క్యూసెక్కుల నీరు తగ్గకుండా తీసుకొచ్చేలా అఽధికారులు చొరవ చూపాలని కోరారు. ఇరిగేషన్‌, డ్రెయినేజీ డీఈ రామకృష్ణ, డీసీచైర్మన్లు పొత్తూరి వాసురాజు, నారగాని కొండ, ఏఈ సత్యనారాయణ, నీటిసంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఆయకట్టు చివరి రైతుకూ సాగునీరు : చింతమనేని

దెందులూరు : సాగునీటి ఇబ్బందులు లేకుండా ఆయకట్టు చివరి రైతు వరకు సాగునీరు అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు. కొప్పులవారిగూడెంలోని లాకుల వద్ద పోలవరం కుడికాల్వ స్లూయిజ్‌ నుంచి సాగునీటిని ఏఎంసీ చైర్మన్‌ గారపాటి రామసీత,మండల అధ్యక్షుడు ఈడ్పుగంటి అనిల్‌తో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసే ప్రభుత్వమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మంచి చేస్తూ ముందుకు వెళ్లాలని, అంతే గానీ పార్టీ అధికారంలో ఉందని టీడీపీ పార్టీ వారైన సరే అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తరలిస్తే సహించేది లేదని పార్టీ నాయకులను హెచ్చరించారు. వైసీపీ మాదిరిగా తమ నాయకులు, కార్యకర్తలు చెడ్డ పేరు తెచ్చుకోవద్దన్నారు. పెదవేగి సొసైటీ అధ్యక్షుడు తాతా సత్యనారాయణ, సర్పంచ్‌లు తాతా శ్రీరామ్‌మూర్తి, మేకా కనకరాజు, గోదావరి డీసీ చైర్మన్‌ వెలమాటి రాంబాబు, సీతంపేట కెనాల్‌ అధ్యక్షులు పర్వత నేని రంగారావు, డాక్టర్‌ పసుమర్తి మధుబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు మాగంటి నారాయణప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

నీటి కొరతతో నారుమడికి తెగుళ్లు

ముదినేపల్లి:సాగునీటి ఎద్దడి కారణంగా ముదినేపల్లి ప్రాంతంలోని సార్వా వరి నారుమళ్లకు వివిధ రకాల తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. నీరు పుష్కలంగా అందక నారు చివళ్లు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు దీనిని ఆకు ఎండు తెగులుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ముదినేపల్లి ఏవో వేణు మాదవ్‌ దృష్టికి తీసుకువెళ్లగా, నారు చివళ్లు ఎండిపోవడానికి కారణం నారుకు నీటి కొరత అని శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలిపారు. ఈ తెగులు నివా రణకు ఐదు సెంట్ల నారుమడికి రెండు కేజీల యూరియా చల్లి, నీరు పెట్టాలని సూచించారు.

రోడ్డెక్కిన రైతన్నలు

పెదపాడు/ఏలూరుకార్పొరేషన్‌, జూలై 16 (ఆంధ్ర జ్యోతి): సాగునీరు కోసం కృష్ణా డెల్టా శివారు భూములకు చెందిన రైతులు బుధవారం రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో వట్లూరు–పెదపాడు రహ దారిలో, ఏలూరు–కైకలూరు రహదారిలో రైతులు, కౌలు రైతులు రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోక పోవ డం అన్యాయమన్నారు. అవసరమైతే పట్టిసీమ ఎత్తిపో తల పథకం ద్వారా వస్తున్న నీటిని కృష్ణా కెనాల్‌లోకి మళ్లించి కృష్టా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగు నీటిని అందించాలని డిమాండ్‌ చేశారు. కాగా ఎండిన వరినారు మట్టి గెడ్డలతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు అందించి పంటను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

నారుమళ్లు ఎండిపోతున్నాయి..

జిల్లాలోని ఏలూరు –కృష్ణా కెనాల్‌ పరిధిలోని ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల్లో సాగునీరు అందక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. కృష్ణా కెనాల్‌కు ఇది శివారు ప్రాంతం కావడంతో సాగు అందడం లేదు. ఈ కెనాల్‌ పరిధిలో కర్రనాచు తొలగించే పనులు చేపట్టటం తో పెరికేడు నుంచి సాగు నీరు రావడం లేదు. ప్రకాశం బ్యారేజి నుంచి సాగునీరు విడుదల చేసినా ఈ ప్రాంతా లకు సాగు నీరు అందడం కష్టతరంగా మారింది.

– కె.శ్రీనివాస్‌, ఏపీ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి

Updated Date - Jul 17 , 2025 | 12:59 AM