Share News

నీటి తీరువాకు రీ సర్వే ఝలక్‌

ABN , Publish Date - May 20 , 2025 | 01:34 AM

ఇరగవరం మండలంలో బండారు వెంకటేశ్వరరావు అనే రైతుకు 1.50 ఎకరాల పొలం ఉంది. కాని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేలో 1.60 ఎకరాలుగా ఉందని తేల్చారు.

 నీటి తీరువాకు రీ సర్వే ఝలక్‌

లేని భూమి ఉన్నట్టు.. ఉన్న భూమి లేనట్టు డిమాండ్‌

ఆన్‌లైన్‌లో ఎంత భూమి వుంటే అంతకు తీరువా కట్టాల్సిందే

గత ఏడాది కట్టని వారికి రూ.50 జరిమానా..

రెవెన్యూ సిబ్బంది తప్పిదానికి రైతుల ఉక్కిరిబిక్కిరి

ఇరగవరం మండలంలో బండారు వెంకటేశ్వరరావు అనే రైతుకు 1.50 ఎకరాల పొలం ఉంది. కాని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేలో 1.60 ఎకరాలుగా ఉందని తేల్చారు. తనకు అంత విస్తీర్ణం లేదన్నా.. ఫలితం లేకపోయింది. తాజాగా రెవెన్యూ సిబ్బంది నీటి తీరువా వసూళ్లల్లోనూ 1.60 ఎకరాలకు శిస్తు కట్టాలని పట్టుబడుతున్నారు. తనకు అంత పొలం లేదన్నా వినలేదు. దీనికి తోడు అదనంగా ఎకరానికి రూ.50 జరిమానా చెల్లించాలని డిమాండ్‌ నోటీసులు ఇచ్చారు. అదేమిటని ప్రశ్నిస్తే ఏడాది ఆలస్యమైందని చెప్పారు. ఆ రైతు నోరెళ్లబెట్టడం మినహా ఏం చేయలేని పరిస్థితి.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ఆధారంగా నీటితీరువా వసూలు చేయడం, కట్టని వారిపై జరిమానాలు విధించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. గడిచిన ఐదేళ్లుగా జిల్లాలో నీటితీరువా వసూళ్లను రెవెన్యూ శాఖ సక్రమంగా నిర్వహించలేదు. బ్యాంకులో రుణాలు పొందాలంటే నీటి తీరువా రశీదు ఉండాలి. బ్యాంక్‌ గ్యారంటీలకు ఆస్తులు సమర్పించాలన్నా తీరువా రశీదు తప్పనిసరి. మరోవైపు రైతులు తీరువా చెల్లించడం తమ హక్కుగా భావిస్తారు. రెవెన్యూ సిబ్బంది నిర్వాకంతో నీటితీరువా వసూళ్లు గాడి తప్పాయి. గతంలో ప్రభుత్వం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. రైతుల నుంచి వసూలు చేసే అదే సొమ్మును వేసవిలో చేపట్టే పంట కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులకు మంజూరు చేస్తారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేయలేదు. చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయలేదు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి తీరువాపై దిశా నిర్దేశం చేశారు. రెవెన్యూ శాఖ రంగంలోకి దిగింది.

జరిమానా ఎందుకో...?

వరి, ఇతర పంట పొలాలకు ఏటా రూ.350, ఆక్వా చెరువులకు రూ.500 చొప్పున రైతులు చెల్లించాలి. జిల్లాలో గడచిన రెండు సీజన్‌లలో నీటితీరువా వసూళ్లు చేయకపోవడంతో ఇప్పుడు రైతులపై కాస్త అదనపు భారం పడుతోంది. ఎన్నికలంటూ అప్పట్లో వాయిదా వేశామని క్షేత్రస్థాయిలో సిబ్బంది చెబుతున్నారు. రీసర్వేలో అనేక తప్పులు దొర్లాయి. వెబ్‌ల్యాండ్‌లో వివరాలు నమోదైపోయాయి. కొందరి రైతులకు లేని భూమిని సృష్టించారు. ఇంకొందరికి ఉన్న భూమిలో కోత విధించారు. సాంకేతిక లోపాలు తలెత్తాయి. వెబ్‌ల్యాండ్‌ వివరాలు అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది చేతులెత్తేశారు. దానికి అనుగుణంగానే డిమాండ్‌ నోటీసులు సిద్ధమయ్యాయి. సకాలంలో తీరువా చెల్లించకపోతే మరో సీజన్‌కు ఆరు శాతం వడ్డీ పడుతుంది. ఉన్న భూమిని కోల్పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత విధించిన భూమికి తీరువా వసూలు చేయడం లేదు. ఇప్పటివరకు రీసర్వేలో తప్పిదాలను దిద్దుబాటు చేస్తారన్న నమ్మకం ఉండేది. ఆన్‌లైన్‌ ఆధారంగా నీటితీరువా వసూలు చేస్తుండడంతో రైతులకు దిమ్మ తిరుగుతోంది. యండగండిలో ఓ రైతు ఇంట్లోనే ఏకంగా అర ఎకరం భూమి తక్కువగా నమోదైంది. నీటితీరువా డిమాండ్‌ తగ్గిపోయింది. అదే తరహాలో చెల్లిస్తే చట్టబద్ధంగానూ తమ హక్కు కోల్పోతామంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు లేని భూమికి పన్ను చెల్లించాల్సి వస్తోంది.

Updated Date - May 20 , 2025 | 01:35 AM