Share News

హా..సుపత్రి!

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:50 AM

అన్నీ ఉన్నా.. ఏదో అన్నట్లుగా వుంది ప్రభు త్వాస్పత్రుల తీరు. ఏ ఆస్పత్రికి వెళ్లినా ఏదో సమస్య కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.

 హా..సుపత్రి!
మండవల్లి పీహెచ్‌సీ ఆవరణలో సంచరిస్తున్న పశువులు

ఓ వైపు వైద్యులు.. మరోవైపు టెక్నీషియన్ల కొరత

పేషంట్లకు అందుతున్న సేవలు అంతంతే..

పనిచేయని ఫ్యాన్లు, ఏసీలు

అత్యవసరమైతే చాలు.. రిఫర్‌

నూజివీడు వార్డులో.. వైట్‌ బుక్‌

ఆసుపత్రి అభివృద్ధి కోసం చందాలకట..!

‘ఆంఽధ్రజ్యోతి’ విజిట్‌లో నమ్మలేని నిజాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతిప్రతినిధి)

అన్నీ ఉన్నా.. ఏదో అన్నట్లుగా వుంది ప్రభు త్వాస్పత్రుల తీరు. ఏ ఆస్పత్రికి వెళ్లినా ఏదో సమస్య కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆస్పత్రుల తీరు మెరుగుపడలేదు. డాక్టర్ల కొరత వెన్నాడు తోంది. కొన్నిచోట్ల రోగులకు పరీక్షలు చేయాలన్న ఆ తరహా పరిస్థితే మచ్చుకైనా కనిపించలేదు. అత్యవసరమైతే పక్కాగా వందలు చెల్లించి పరీ క్షలు చేయించుకోవాల్సిందే. ఎమర్జెన్సీ వార్డుల్లో ఏసీలు పనిచేయవు. వార్డుల్లో గాలికి పనికి రాని ఫ్యాన్లు కనిపిస్తాయి. వార్డుల్లో హెచ్‌వోడీల దర్శనం ఓ భాగ్యం. కిందస్థాయి అసిస్టెంట్లతోనే సరిపెట్టుకోవాల్సిందే. ఎక్కడా లేనట్లుగా నూజి వీడులో తల్లీ బిడ్డల సంరక్షణ వార్డులో ఏకంగా వైట్‌ బుక్‌ తెరిచారు. అభివృద్ది, సంక్షేమంటూ ఏ పేషంట్‌ అయినా ఆ బుక్‌లో కొంత చెల్లించినట్టు లిఖిత పూర్వకంగా నమోదు చేయవచ్చు. అత్య వసర పరిస్థితిలో ఆస్పత్రులకు అంబులెన్స్‌లో వైద్యానికి వెళితే చాలు.. క్షణాల్లో అక్కడి నుంచి వేరే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తూ పంపేస్తారు. ఏలూ రులో ప్రభుత్వ మెడికల్‌ కాలే జీ పరిధిలోని ఆస్పత్రిలో సీటు లో రోగులకు అందుబాటులో కనిపిం చేది వేళ్లపై లెక్కించే వారే. ప్రభుత్వాసుపత్రిలో తాజా పరిస్థితులను గమనించేం దుకు గురు, శుక్రవారాల్లో ‘ఆంధ్రజ్యోతి’ బృందం విజిట్‌ నిర్వహించింది.

నూజివీడులో చేతులు తడపాల్సిందే

నూజివీడు టౌన్‌ : రెండేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న నూజివీడు ఏరియా ఆసుపత్రి నూతన భవనంలో ఎట్టకేలకు ఇటీవల వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం 23 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఏడు వైద్యు ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తిస్థాయి సదుపాయాలు లేక రోగులు నిలువు కాళ్ళ మీద నిలబడక తప్పని పరిస్థితి. సాధారణ రోజుల్లో 250కి పైబడి అవుట్‌పేషెంట్లు నమోదు అవు తుండగా, సోమవారం 400 నుంచి 500 మంది వరకు ఓపీ నమోదవుతోంది. లేబర్‌ వార్డు (సీమాంక్‌, ప్రసూతి) విభా గంపై పలు ఆరోపణలు రోగుల నుంచి వినిపిస్తు న్నాయి. కాన్పుల విష యంలో ఇక్కడ కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు చేతులు తడపాలని, ఆడపిల్ల పుడితే ఒక రేటు, మగపిల్లవాడు పుడితే మరో రేటు కింద వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. వీల్‌చైర్లు, స్ర్టెక్చర్లు ఉపయోగించేందుకు సైతం డబ్బులు వసూలు చేస్తున్నారని, డొనేషన్‌ బుక్‌ పేరుతో సైతం ఈ వసూళ్లు సాగుతున్నాయంటూ నూజివీడు ఐద్వా కమిటీ అధ్యక్షురాలు నండూరి పద్మాంజలి, ఐద్వా నాయకులు బొబ్బిలి కుమారి ఆరోపిం చారు. దీనిపై సూపరింటెండెంట్‌ పద్మజారాణిని వివ రణ కోరగా డబ్బుల వసూలు తన దృష్టికి రాలే దని, విచారించి చర్యలు చేపడతానన్నారు. ప్రమాదాల ఘటనలో విషమంగా ఉన్న రోగుల ను విజయవాడకు రిఫర్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద 110 శస్త్ర చికిత్సలు నిర్వహించినట్టు తెలిపారు.

చింతలపూడిలో వేధిస్తున్న డాక్టర్ల కొరత

చింతలపూడి: చింతలపూడి ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 23 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. వచ్చిన డాక్టర్లు ఏదొక నెపంతో డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతా లకు వెళ్తున్నారు. రోగులు ప్రైవేటు ఆసుపత్రు లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆస్పత్రిలో గత సామాజిక ఆస్పత్రిగా ఉన్నప్పటి సౌకర్యాలే తప్ప అదనంగా ఒనగూరినవి ఏవీలేవు. రోజుకు పదికి పైగా ఎమర్జన్సీ కేసులు వస్తుంటాయి. మెరుగైన చికిత్సకు ఏలూరు, విజయవాడ, గుంటూరు తరలిస్తుంటారు. కేవలం ఎక్సరే సౌకర్యం మాత్ర మే ఉంది. స్కానింగ్‌, ఇతర వైద్య పరీక్షలకు పరికరాలు లేవు. పేరుకు వంద పడకలు. ఇందులో 20 పడకలకే ఇన్‌ పేషెంట్లకు, 10 పడకలు మెటర్నటీ వార్డు కోసం వినియోగిస్తు న్నారు. ఆపరేషన్‌ చేసేందుకు సివిల్‌ సర్జన్‌ లేక అవి కూడా పెద్దగా జరగడం లేదు. 2011లో వైద్యనిధి నిధులతో అప్పటి కలెక్టర్‌ వాణీప్రసాద్‌ రూ.18 లక్షలతో పలు వైద్య పరీక్షల కోసం పరికరాలు అందించారు. అవి ఎక్కడ ఉన్నాయో కాని వినియోగించడంలేదు. పార్కింగ్‌ స్థలం లేదు. తగిన ఫర్నీచర్‌ లేక వృద్ధులు ఓపిలో కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 300లకు పైగా అవుట్‌ పేషెంట్లు వస్తుం టారు. డాక్టర్లు లేక పేషెంట్లు వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వంద పడకల ఆసుపత్రి భవనాలు ఆరేళ్లుగా నిర్మాణంలోనే ఉన్నాయి. ఇవి మంజూరై 13 సంవత్సరాలైనా అదిగో ఇదిగో అంటూ ఎదురుచూపులే.

కైకలూరులో టెక్నీషియన్లు లేరు.. పరీక్షలూ లేవు

కైకలూరు: కైకలూరు నియోజకవర్గంలో మొత్తం 14 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు కేంద్రాల్లో వైద్యాధికారుల కొరత ఉంది. మండవల్లి–1, గురజలో ఇద్దరు డాక్టర్లకు ఒకరు సెలవుపై వెళ్లారు. మూల్లలంక–1, కొల్లేటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు లేరు. కలిదిండిలోని డాక్టరు వారంలో మూడు రోజులపాటు కొల్లేటికోటలో విధులు నిర్వహిస్తున్నారు. ఇది కొల్లేరు గ్రామాల్లో ఉన్న ఏకైక పీహెచ్‌సీ కావడంతో పందిరిపల్లిగూడెం, శృంగవరప్పాడు, గుమ్మళ్లపాడు, పెంచికలమర్రు, వడ్లకూటితిప్ప గ్రామాల్లోని ప్రజలంతా ఈ పీహెచ్‌సీకే వైద్య సేవల కోసం వెళుతుంటారు. వైద్యాఽధికారులు లేక ఆకివీడు, కైకలూరు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతనపల్లిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేక కోరుకొల్లు ఆస్పత్రి నుంచి వచ్చి వారంలో మూడు రోజులపాటు సీతనపల్లి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మూల్లలంకలో ల్యాబ్‌టెక్నీషియన్‌ సెలవుపై వెళ్లారు. లోకుముడి, కొల్లేటికోట, మండవల్లి ఆసుపత్రిలో ల్యాబ్‌టెక్నీషియన్‌ లేడు. నియోజకవర్గ వ్యాప్తంగా ల్యాబ్‌టెక్నీషియన్‌ల కొరత వేధిస్తోంది. వర్షాకాలం కావడంతో పరీక్షలు చేసే అవకాశం లేక రోగులంతా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. మండవల్లి ఆస్పత్రిలో ఫ్లోరింగ్‌ దిగిపోయి అస్తవ్యస్తంగా మారింది. ఆస్పత్రి ఆవరణలో పశువులు సంచరి స్తున్నాయి. కలిదిండి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం చుట్టూ ప్రహరీ లేక పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ముదినేపల్లి పీహెచ్‌సీకి వెళ్లే రహదారి ఇరువైపులా దట్టంగా మొక్కలతో మూసుకుపోయింది. ఆ రహదారి ధ్వంసం అవడంతో రోగుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.

పేరుకే పెద్దాస్పత్రి.. వైద్య సేవల్లో అథమం

ఏలూరు క్రైం : మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి మహర్దశ పడుతుందని, అన్ని సూపర్‌స్పెషాల్టీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ఇక్కడ నుంచి రోగులు వేరే ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితే ఉండదని రిఫరల్‌ అంటూ పెరగవని అధి కారులు, ప్రజా ప్రతినిధుల ప్రకటనలతో అంతా నమ్మారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో మెడికల్‌ కళాశాల 2023 ఏప్రిల్‌ 26న అధికారంగా ఎంబీబీఎస్‌ 150 అడ్మిషన్లతో ప్రారంభమైంది. మరోవైపు ఏలూరు ప్రభుత్వాస్పత్రిని సర్వజన ఆస్పత్రిగా మార్పు చేశారు. అయితే ఆస్పత్రిలో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతు న్నాయి. వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు అందు బాటులో ఉండాల్సిందే. అత్యవసర విభాగంలో, వార్డుల్లో 24 గంటలు అందు బాటులో ఉండా లి. కాని ఉదయం 9 గంటలకు కొంతమంది వైద్యులు ఎఫ్‌ఆర్‌ ఎస్‌తో ఫొటో దిగి ఆ తర్వాత కన్పిం చడం లేదు. సిబ్బం దిది ఇదే దారి. ల్యాబ్‌లో సిబ్బంది కొరత, మౌలి క వసతులు లేక రోగులు ఇబ్బందులకు గురవు తున్నారు. అత్యవసర విభాగం నుంచి ప్రతి రోజు ఎక్కువ కేసులు విజయవాడకు రిఫరల్‌ చేస్తున్నారు. తల్లి బిడ్డల విభాగంలో సేవలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అక్క డకు వెళ్ళితే కుట్లు వేసిన తర్వాత అవి విడి పోతున్నాయని, ఇన్‌ఫెక్షన్స్‌ వస్తున్నాయని అంటున్నారు. గతంలో ఆసు పత్రిలో 70 వరకు ఏసీలు కొనుగోలు చేసినా కొన్ని ఏసీలను మరమ్మతుల నిమిత్తం పీకేశారు. తర్వాత ఏర్పాటు చేయలేదు. సర్జిక ల్‌ వార్డులో ఒకే ఒక బాత్‌రూమ్‌ పని చేస్తోంది. ఆస్పత్రిలో తరచుగా నీటి ఎద్దడి ఎదురవుతోంది. వార్డు లలో కిటికీలకు దోమ తెరలు లేవు. సిబ్బంది కొరతతో రోగి బంధువులే పేషెంట్లను స్టెక్చర్లపైన, వీల్‌ చైర్‌లలో తీసుకువెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. మందులన్నీ సమృద్దిగా ఉన్నప్పటికీ న్యూరో విభా గానికి సంబంధించిన గబాపెంటిన్‌ 300 ఎంజి టాబ్లెట్స్‌ నెలరోజులకు పైగా అందుబాటు లో లేక రోగులు బయట కొనుగోలు చేసుకుంటు న్నారు. ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌, నలు గురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఆర్‌ ఎంవోలు ఉన్నప్పటికీ సాధారణంగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, మెడికల్‌ సర్టిఫికెట్లు, ఇతర మెడికల్‌ సర్టిఫికెట్లు పొందేందుకు వీరు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

Updated Date - Aug 09 , 2025 | 12:51 AM