Share News

రయ్‌.. రయ్‌ !

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:16 AM

రయ్‌ రయ్‌మంటూ టిప్పర్లు దూసుకొస్తుంటే గుండెలు జారిపోతుంటాయి.. పరిమితికి మించి లోడు వేసుకుని మితిమీరిన వేగంతో రాకపోకలు సాగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

రయ్‌.. రయ్‌ !

పరిమితికి మించి లోడు.. మితిమీరిన వేగం

తరచూ ప్రమాదాలు..ప్రాణాలు పోతున్న వైనం

ఏలూరులో భారీ వాహనాల నిషేధం..

ఇది ప్రకటనలకే పరిమితం

దర్జాగా తిరుగుతున్నా పట్టని పోలీసులు

కానరాని ట్రాఫిక్‌ ఆంక్షల బోర్డులు

రయ్‌ రయ్‌మంటూ టిప్పర్లు దూసుకొస్తుంటే గుండెలు జారిపోతుంటాయి.. పరిమితికి మించి లోడు వేసుకుని మితిమీరిన వేగంతో రాకపోకలు సాగించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున తెలంగాణలోని చేవెళ్ల వద్ద ఒక టిప్పర్‌ లారీ కంకర లోడుతో వెళుతూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తరచూ టిప్పర్ల ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తు న్నాయి. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

ఏలూరు క్రైం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు టిప్పర్ల జోరు ఇటీవల ఎక్కువైంది. అనధికారికంగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తుండడంతో చెరువులు, కాలువల మట్టిని టిప్పర్లలో తరలించి పూడిక చేపడుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాలువ జలాశయంలో కనిపించిన ప్రాంతాన్ని అంతా నిలువునా తవ్వేశారు. పంగిడి గూడెంలో స్థానికులు టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలవరం కాలువ గట్లకు తూట్లు పొడిచి టిప్పర్లలో తరలించేశారు. అనధికారిక తవ్వకాలు కావడంతో మట్టిని తరలించేటప్పుడు అతి వేగంగా వాహనాలను నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు అధిక లోడుతో టిప్పర్లు రాకపోకలు సాగించడంతో జిల్లాలో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. వాస్తవానికి టిప్పర్‌ లారీలకు 25 నుంచి 35 టన్నుల పరిమితి వరకు అనుమతి ఉంటుంది. కాని 50 నుంచి 60 టన్నుల వరకు ఇసుక, మట్టి, కంకరలను తరలిస్తున్నారు.

ఏలూరు నగరంలో టిప్పర్ల జోరు

ఏలూరు నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేయడంలో వైఫల్యం చెందడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది. ఈ సమయంలో నగరంలో రోడ్లపై వాహనాలను పెట్టి ఎగమతులు, దిగుమతులు చేయకూడదు. ఏలూరు పెదపాడు బ్రిడ్జి నుంచి అంబికా థియేటర్‌, పెద్ద పోస్టాఫీస్‌, గడియార స్తంభం మీదుగా మాదేపల్లి రోడ్డులోకి ఇరువైపులా భారీ వాహనాల రాకపోకలు పూర్తి నిషేధం. ఏలూరు జూట్‌మిల్లు దగ్గర నుంచి పెదపాడు బ్రిడ్జి మీదుగా వంగాయిగూడెం మీదుగా కైకలూరు రోడ్డులో వాహనాలు వెళ్లాలి. కాని ఈ నిబంధనలు అమలు చేయడంలో ట్రాఫిక్‌ పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇష్టారాజ్యంగా వాహనాలు నగరంలోకి తిరుగుతూనే ఉన్నాయి. ఏలూరు కలపర్రు టోల్‌ గేటు నుంచి ఆశ్రం ఆసుపత్రి వరకు 19 కిలోమీటర్లు నిడివి ఉండగా నగరంలో మధ్య నుంచి వెళ్లితే 9 కిలోమీటర్ల నిడివే ఉండడంతో భారీ వాహనాలు ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల టిప్పర్లు జోరుగా రాకపోకలు సాగిస్తున్నా పట్టించు కునేవారే లేరు. పట్టుకుంటు న్నామని, ఫైన్లు వేస్తున్నామని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారే తప్ప వాటిని ఆపి వెనక్కి పంపించడం లేదు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ వాహనాలకు అనుమతులు ఉన్నాయి. ఇదే అదునుగా తీసుకుని కొన్ని టిప్పర్లు అనుమతులు ఉన్నాయని ఇసుక, మట్టిని నగరం మీదుగా రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి.

గతంలో ఎన్నో ప్రమాదాలు

నిత్యం భారీ వాహనాలు, టిప్పర్లు నగరం నడి బొడ్డులో తిరగడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కర్రల వంతెన వద్ద ఒక వ్యక్తిని టిప్పర్‌ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోగా చిరంజీవి బస్టాప్‌ వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను ఢీకొనడంతో ఆమె మరణించింది.ఈ ఏడాది అక్టోబరు 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక టిప్పర్‌ కైకలూరు నుంచి ఏలూరు శనివారపుపేటనకు బుసకను తీసుకువెళ్తూ పెదపాడు బ్రిడ్జి మీదుగా వచ్చి అతి వేగంగా జూట్‌మిల్లు ఓవర్‌ బ్రిడ్జిపైకి వెళ్తూ ఒక కారును ఢీ కొంది. కారు ముందు భాగం నుజ్జునుజైంది.

కానరాని నిబంధనల బోర్డులు

ఏలూరు నగరంలో భారీ వాహనాల రాకపోకలపై ఉన్న నిబంధనలను విధిగా నగరంలోకి ప్రవేశించే రహదా రులపై బోర్డులను ఏర్పాటు చేయాలి. కానీ ట్రాఫిక్‌ పోలీసులు ఈ బోర్డులను ఏర్పాటు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. నగరంలో ఏ ప్రాంతాల్లో అనుమతి లేదో ఆ ప్రాంతాల వద్ద ఈ బోర్డులను ఏర్పాటు చేయాలి. భారీ వాహనాల డ్రైవర్లకు అవగాహన నిమిత్తం నగరంలో ప్రధానమైన కూడళ్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎక్కడా ఎలాంటి బోర్డులు కానరావడం లేదు. టిప్పర్‌ లారీకు అనుమతులు ఉన్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.అనుమతులు ఎవరు ఇచ్చారో ఆ లేఖను లారీ ముందు అద్దంపై ప్రదర్శించాలి. కాని ఏ టిప్పర్‌ లారీపై ఇలాంటి లెటర్‌ కన్పించకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి భారీ వాహనాల రాకపోకలపై ఉన్న నిబంధనలు అమలు చేసి ప్రజలకు ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం

జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడులో రవాణా శాఖ కార్యాలయాల తనిఖీ అధికారులు నిత్యం వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. టిప్పర్‌ లారీల్లో పరిమితికి మించి అదనపు లోడు వేసు కుంటే జరిమానాలు విధిస్తున్నాం. జిల్లాలో ఎవరైనా నిబం ధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్‌ చేస్తాం.

–షేక్‌ కరీమ్‌,

ఉప రవాణాశాఖాధికారి, ఏలూరు జిల్లా

Updated Date - Nov 04 , 2025 | 01:16 AM