బారుమన్నారు..
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:15 AM
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విభాగాల్లో ప్రధానమైంది ఎక్సైజ్. ప్రభుత్వం మారిన ప్పుడల్లా ఎక్సైజ్ విధానం మారుతుంది.గత వైసీపీ పాలనలో బార్లు నడిపిన వారంతా నిండా మునిగారు.
నష్టాల పాలయ్యామంటూ లబోదిబో
కొత్త పాలసీని బట్టే రంగంలోకి.. లేకుంటే ఇంటికే..
పర్మిట్‌రూమ్‌ల ప్రతిపాదనతో ఇప్పటికే కొందరు వెనక్కి
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విభాగాల్లో ప్రధానమైంది ఎక్సైజ్. ప్రభుత్వం మారిన ప్పుడల్లా ఎక్సైజ్ విధానం మారుతుంది.గత వైసీపీ పాలనలో బార్లు నడిపిన వారంతా నిండా మునిగారు. ఈసారి బార్ లైసెన్సుల గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది. ఈ లోపే వైన్‌షాపుల దగ్గర పర్మిట్ రూమ్‌లు ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉండడం, బార్ విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసు కుంటారనే దానిపైనే తర్జనభర్జన. ఒకవేళ ఎక్సైజ్ పాలసీలో ఆదా యార్జన ప్రాధాన్యతగా తీసుకుంటే వ్యాపారానికి దూరమవడానికి సిద్ధమన్నట్లుగా ఇప్పటికే బార్ యజమానులు చెబుతున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో మార్పులు, చేర్పులు జరిగాయి. మద్యం అమ్మకాలు తారస్థాయికి చేరాయి. జగన్ జమానాలో ‘జే’ బ్రాండ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమ్మకాలు వంకర టింకరగా సాగాయి. ఆ మద్యం తాగిన అనేకమంది అనా రోగ్యం పాలయ్యారు. కావాల్సిన బ్రాండ్‌లు దొరక్క ఏకంగా తెలంగాణకు లాభం చేకూర్చేలా ఏపీ సరిహద్దులు దాటి వెళ్లారు. దీనిని గమనించి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. అన్నింటి కంటే మించి సామాన్యులు కోరుకున్న విధంగా రూ.99 మందును అందుబాటులోకి తెచ్చారు. లైసెన్సు వైన్ షాపులన్నీ అమ్మకాల్లో పుంజుకున్నాయి.
ఇంకోవైపు ఇప్పటికే జిల్లాలో బార్‌లన్నీ నష్టాల్లో ముని గాయి. మూడేళ్లకొకసారి బార్ల లైసెన్సులను రెన్యువల్ చేస్తారు. దీనికిగాను ఎక్సైజ్ పాలసీలో మార్పులు, చేర్పు లు జరుగుతాయి. గత మూడేళ్లుగా మనుగడలో ఉన్న బార్లు అన్నింటికి లైసెన్సులు గడువు ఆగస్టు నెలాఖరుకు ముగియనుంది. ఇప్పటికే జగన్ జమానాలో ఒకటి,రెండు తప్ప మిగతా బార్లన్నీ అత్యధిక లైసెన్సు ఫీజులు చెల్లించి నష్టాలు పాలయ్యాయి. అప్పటి ప్రభుత్వమే నేరుగా వైన్ షాపులను నిర్వహించింది. బార్లలో కొంత మేర అమ్మకా లకు అనుగుణంగా చూసీచూడనట్లుగా వ్యవహరించింది. మధ్యేమార్గంగా ఎక్సైజ్ విధానంలో తప్పులు దొర్లాయి. ఉదాహరణకు మూడేళ్లపాటు ఒక బార్ నిర్వహించేందుకు అవకాశం ఉన్నా ఏటా లైసెన్సు ఫీజును పెంచి ప్రభుత్వా నికి సమర్పించుకోవాల్సిందే. ఏలూరు నగరంలోని బార్లు చేజిక్కుంచుకునేందుకు జగన్ హయాంలో స్థానికంగా పోటీపడ్డారు. అప్పటి వరకు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఏడాది ఫీజు ఉన్న బార్ లైసెన్సులు పొందేం దుకు పోటీ నెలకొనగా, ఇది కాస్త రూ.93 లక్షలకు ఎగ బాకింది. ఏలూరు నగరంలోని సుమారు 10 బార్లలో దాదాపు ఇదే తరహా పరిస్థితి. కానీ వ్యాపారంలో ఈ లెక్క తారుమారైంది. రోజూవారీ అమ్మకాలు ఆశించిన విధంగా సాగలేదు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత బార్ల నిర్వ హణ భారంగా మారింది. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులు మాత్రం యథావిధిగానే ముందస్తుగా చెల్లించారు.
కొత్త పాలసీ కోసం ఎదురుచూపులు..
తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి బార్ల లైసెన్సుల విధానంలో ఏ నిర్ణయం తీసుకుబోతుందోనన్నదే మద్యం వ్యాపారులకు ఉత్కంఠగా మారింది. గతంలో మాదిరి గానే ఉన్న బార్లను యఽథాతథంగా కొనసాగిస్తారా? లేక లాటరీ పద్ధతిలో బార్ల ఎంపిక జరగబోతుందా? అనేది తేలాల్సి ఉంది. దీనిని బట్టి బార్లు లైసెన్సుల కోసం వచ్చేవారి సంఖ్య ఆధారపడి ఉంది. వాస్తవానికి అధి కారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి చెందిన వారికే మద్యం వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఈసారి తెలుగు దేశం, మిగతా కూటమి పక్షాలకు చెందిన అనుకూలురు చేతిలో అత్యధిక వైన్ షాపులున్నాయి. లాటరీ పద్ధతితో వైన్‌షాపుల నిర్వహణకు దిగినా ఆ తర్వాత స్థానిక నేత లు వీటిని అందిపుచ్చుకున్నారు. అదే బార్ల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం తీసుకునే విధానం బట్టే ఆఽధారపడి ఉంటుంది. ఈసారి బార్ల లైసెన్సుల విధానంతో పాటు పర్మిట్‌రూమ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రావడంతో ఇవన్నీ పరి శీలనలో ఉన్నాయి. ఇప్పుడు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తే బార్ల విషయంలో ముందుకొచ్చే వారి సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ‘ఎంతో ఊహించు కుని బార్ల లైసెన్సుల కోసం ఎగబడ్డాం. అప్పట్లో ప్రభుత్వమే వైన్ షాపులను నిర్వహించింది. జనం కోరుకున్న బ్రాండ్‌లను సప్లయ్ చేయలేదు. ఏ రకం మందు సప్లయ్ చేస్తే దాన్నే జనానికి రుద్దాలి. దీనికి తోడు అస్థవ్యస్థ విధానాలు. నష్టాలొస్తున్నాయని బావురమన్న ఎవరూ వినిపించు కోలేదు. ఏళ్ల తరబడి ఈ రంగంలో అనుభవం ఉన్నా మేము నష్టపోయాం. కొత్త విధానం బట్టే మళ్లీ కొన సాగాలా?వద్దా అనేది తేల్చుకుంటాం’. ఇది బార్ నిర్వహణలో అనుభవ పూర్వక వ్యాఖ్యానం.