కాలువ.. కల్లోలం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:27 AM
డెల్టా ప్రాంతంలో వ్యవసాయ సాగుకు కాలువలు కీలకం. ఏళ్ల తరబడి సక్రమంగా నీరందక.. వరదలొస్తే ముంపుతో రైతులు నష్టపోతున్నారు.

చేలకు అందని సాగు నీరు
వర్షాలతో మునుగుతున్న పంట
కాల్వ గట్టే.. ఆక్వా చెరువు గట్టు!
అక్రమంగా తూముల ఏర్పాటు
అధికారుల నిర్లక్ష్యం
నీటి కష్టం.. ముంపుతో రైతుల గగ్గోలు
తాగునీటికి పనికిరాని కాలువలు
ఉండి నియోజకవర్గ పరిధిలో ప్రక్షాళన చేపట్టినా పూర్తి కాలేదు
డెల్టా ప్రాంతంలో వ్యవసాయ సాగుకు కాలువలు కీలకం. ఏళ్ల తరబడి సక్రమంగా నీరందక.. వరదలొస్తే ముంపుతో రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం కాలువల మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఒక వైపు ఆక్రమణలతో కాలువల రూపు మారితే మరోవైపు అక్రమ తూములతో నీటి చౌర్యం.. ఆక్వా చెరువుల వ్యర్థ జలాలు.. వెరసి సాగుకు ప్రతిబంధకాలుగా మారాయి. దీనికితోడు గ్రామాల్లో గట్టు వెంబడి నిర్మాణాలతో ఇళ్లలో మురుగు కూడా పంట కాలువల్లోకి నేరుగా వదులుతున్నారు. పలుచోట్ల కాలువ గట్టు వెంబడి ఆక్వా చెరువులతో ఇవే చెరువు గట్టు కూడా.. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కాలువల ప్రక్షాళనకు నడుం బిగించడంతో మరిన్ని రైతుల ఇబ్బందులు ఏకరువు పెడుతున్నారు. మొత్తంగా కాలువలకు మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నారు.
ఆకివీడు రూరల్, కాళ్ల, పాలకోడేరు, జూలై 5(ఆం ధ్రజ్యోతి): డెల్టా ప్రాంతంలో పంటలకు కాలువలే ప్రాణాధారం. నీరు లభ్యత, సాగు విస్తీర్ణం దృష్ట్యా కాలువలకు తూములు, చిన్న లాకులు ఏర్పాటు చేశారు. క్రమేపీ అక్రమ తూముల ఏర్పాటుతో యథే చ్ఛగా నీటి చౌర్యం జరుగుతోంది. పంటల విస్తీర్ణం తగ్గుతూ ఆక్వా విస్తీర్ణం పెరగడంతో నీటి చౌర్యంతో వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల కు విరుద్ధంగా పంట కాలువగట్లపై చెరువు గట్లు, గండికొట్టి అక్రమతూములు ఏర్పాటు చేసుకున్నారు. ఆకివీడు మండలంలోని పాతవయ్యేరుపై అధికారుల అంచనా మేరకు 40 అక్రమ తూములు ఉండగా వాస్తవంగా వందకు పైగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. నీరు తోడుకోవడంతో సరిపెట్టకుండా ఆక్వా చెరువుల వ్యర్థాలు సైతం కాలువలోనికి వదిలి వేస్తున్నారని వరి రైతులు గగ్గోలు పెడుతున్నారు. రొయ్యల చెరువుల నీరు పంట కాలువలోనికి వదల డంతో ఉప్పునీరు, రసాయనాలు కలిసి వరికి నష్టం కలగడంతో పాటు తాగునీటిగా వాడుకునే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
కాళ్ల మండలంలోని బొండాడ పంట కాలువ గట్లు కొన్ని చోట్ల చెరువు గట్టుగా మలిచారు. ఆనందపురం పంచాయతీ మేకలదిబ్బ వంతెన వద్ద పంట కాలువ గట్టుపై నిర్మాణాలు వెలిశాయి. కాళ్ల కె.లంక పంట కాలువపై అనధికార తూములు ఏర్పాటు చేశారు.
పాలకోడేరు మండలంలోని గరగపర్రులో పంట కాలువను ఆనుకుని వీధి మొత్తం ఉండడంతో ఇళ్ల నుంచి డ్రెయినేజీ నీటిని పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. మైప గ్రామానికి వచ్చే జీ అండ్ వీ కెనాల్, గొల్లలకోడేరు, పెన్నాడ, గొరగనమూడి తదితర గ్రామాల్లో డ్రెయినేజీ నీటిని పంటబోదెలు, కాలువల్లో వదలడంతో నీరు కలుషితమైపోతుంది. దీనికితోడు చెత్తా చెదారం కాలువలో పడేస్తున్నారు.
రఘురామపై రైతుల ఆశలు..
ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు పంట కాలువల ప్రక్షాళనపై దృష్టి సారించడంతో రైతుల్లో ఆశలు చిగురిం చాయి. రఘురామకృష్ణరాజు చొరవతో నీటిపారు దల శాఖాధికారులు చర్యలకు ఉపక్రమించారు. నియోజకవర్గంలోని పంట కాలువలు, మురుగు కాలువుల్లో చెత్త, తూడు తొలగించడంతోపాటు అక్రమ తూములపై దృష్టిసారించారు. అక్రమ తూములు, కాలువ గట్లపై ఆక్వాగట్లు ఉన్న యజ మానులకు నోటీసులు ఇచ్చి తొలగించేందుకు గడువు ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పూర్తి చర్యలు చేపట్టలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.