ఏఎంసీ ! ఏమిటీ దుస్థితి
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:52 AM
భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరుకే గొప్పగా ఉంటోంది. యార్డులో గోదాములు శిథిలావస్థకు చేరుకున్నాయి. రైతులకు ప్రయోజనం లేకుండా పోయాయి.
సెస్ రూపంలో ఏడాదికి రూ.15 కోట్లు
రైతులకు ప్రయోజనం శూన్యం
శిథిలమైన గోదాములు
మూతపడ్డ షాపింగ్ కాంప్లెక్స్‌లు
21 ఎకరాల విస్తీర్ణం
కలెక్టరేట్ కోసం గత ప్రభుత్వం కేటాయింపు
భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరుకే గొప్పగా ఉంటోంది. యార్డులో గోదాములు శిథిలావస్థకు చేరుకున్నాయి. రైతులకు ప్రయోజనం లేకుండా పోయాయి. మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకానికి ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్‌లు మూతపడ్డాయి. ఏ వ్యాపారి కూడా అక్కడకు రావడం లేదు. రైతులు తమ ఉత్పత్తులను తీసుకురావడం లేదు. సెస్ రూపంలో ఆదాయం సమకూర్చే కమిటీల్లో మాత్రం భీమవరం ఏఎంసీ అగ్రగామిగా ఉంటోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భీమవరం ఏఎంసీకి ఏటా సుమారు రూ.15 కోట్లు ఆదాయం లభిస్తోంది. ప్రధానంగా ఆక్వా ఉత్పత్తుల ద్వారా సెస్ లభిస్తోంది. రొయ్య, చేపల వ్యాపారులు ఎప్పటికప్పుడు సెస్ కడుతూ వస్తున్నారు. దానివల్ల జిల్లాలోనే అత్యధిక ఆదాయం లభిస్తోంది. భీమవరం నియోజకవర్గంలోనే రొయ్య ప్రోసెసింగ్ ప్లాంట్‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచే ఇతర దేశాలకు రొయ్య ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ఫలితంగా సెస్ ఆదాయం ఎక్కువగా వస్తోంది. సుమారు 21 ఎకరాల్లో ఏఎంసీ విస్తరించి ఉంది. అందులో చిన్న చిన్న గోదాములు నిర్మించారు. రైతులు పండించే పంటలు నిల్వ చేయడానికి ఉపయోగ పడేలా ఏర్పాటు చేశారు. భీమవరం నియోజక వర్గం పరిధిలో ఆక్వా సాగు ఎక్కువగా ఉంటోంది. కొద్దిపాటి వరిపంట సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో రైతులు ఉత్పత్తి చేసే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మార్కెట్‌లో విక్రయిం చేస్తున్నారు. నిల్వ చేసినా సరే ధరలు వచ్చే అవకాశం లేదు. దానివల్ల ఏఎంసీలోని గోదాములను రైతులు, వ్యాపారులు కూడా ఉపయోగించుకోవడం లేదు. శిథిలావస్థకు చేరిపోయాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు.అద్దె కోసం ఒక్కరూ రాకపోవడంతో అవి వృథాగా పడి ఉన్నాయి.
కలెక్టరేట్‌కు ప్రతిపాదన
జిల్లాలోని మార్కెట్ యార్డులన్నింటిదీ ఇదే పరిస్థితి. యార్డులను రైతులు ఉపయోగించే పరిస్థితి లేదు. దీనిని దృష్టిలో ఉంచుకునే గత ప్రభుత్వం భీమవరం ఏఎంసీలో కలెక్టరేట్ నిర్మించాలని ఆదేశాలు జారీచేసింది. కలెక్టరేట్‌కు కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. మరోవైపు నూతన కలెక్టరేట్ నిర్మాణానికి రూ. 64 కోట్లు కేటాయించింది. అంతలో ప్రభుత్వం మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పనులు ప్రారంభానికి నోచుకోని ప్రాజెక్ట్‌లను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా మళ్లీ అవసరమైన ప్రాజెక్ట్‌లను అమలు చేస్తోంది. భీమవరం ఏఎంసీలో కలెక్టరేట్ నిర్మాణం కూడా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ కలెక్టరేట్ ఎక్కడనేది చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే మాత్రం భీమవరం ఏఎంసీ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే సువిశాల ప్రాంగణంలో కలెక్టరేట్ ఏర్పాటవుతుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పడ డానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారు. కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఏఎంసీ వైపే ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఏఎంసీ కార్యాలయంలోనే సిబ్బంది పని చేస్తున్నారు. ఆ భవనంలోనే పాలకవర్గ సమావేశాలకు సమావేశం మందిరం ఉంది. ఆ ఒక్కటి తప్ప ఏఎంసీలో ఏ ఒక్క నిర్మాణం రైతులకు ఉపయో గించడం లేదు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందులోనే కొంత భాగాన్ని ఎంపెడా కార్యాలయం ఏర్పాటుకు కేటాయించారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయం కూడా అందులోనే ఉంది. ఇప్పుడు కలెక్టరేట్ ఏర్పాటుపై ప్రయత్నాలు చేస్తున్నారు.
అద్దె భవనాలే దిక్కు
భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. కలెక్టరేట్ ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తు న్నారు. డీఆర్‌డీఏ, పౌరసరఫరాల కార్పొరేషన్, సమగ్ర శిక్ష అభియాన్, ఎస్పీ కార్యాలయం ఇలా ఎన్నో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖ కార్యాలయాలు డివిజన్ కార్యాలయా ల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. సొంత కార్యాలయాలకు భూమి కొరత వెంటాడుతోంది. భీమవరం ఏఎంసీ ఒక్కటే భూమి లోటును భర్తీ చేయడమే కాకుండా అధునాతన కలెక్టరేట్ నిర్మాణానికి దోహద పడుతుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే అంజిబాబు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.