Share News

అఖండ గోదావరి పరవళ్లు !

ABN , Publish Date - Jun 27 , 2025 | 01:00 AM

అఖండ గోదావరి ప్రాజెక్టు పదేళ్లకు పట్టాలెక్కింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో హేవలాక్‌ బ్రిడ్జిపై అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఊరించి ఉసూరు మనిపించారు.

అఖండ గోదావరి పరవళ్లు !
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి షెకావత్‌, చిత్రంలో మంత్రులు పవన్‌, నిమ్మల

రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌ శంకుస్థాపన

రాజమహేంద్రవరం సిటీ/పాలకోడేరు, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి):అఖండ గోదావరి ప్రాజెక్టు పదేళ్లకు పట్టాలెక్కింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో హేవలాక్‌ బ్రిడ్జిపై అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఊరించి ఉసూరు మనిపించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదికి రూ.94.44 కోట్లతో చేప ట్టనున్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు గురువారం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హేవలాక్‌ బ్రిడ్జి, పుష్కర ఘాట్‌, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ ఆల యం, గోదావరి కాలువ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్ర మం త్రి షెకావత్‌ మాట్లాడుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు దేశంలోనే ప్రఖ్యాత టూరిజం స్పాట్‌ అవుతుందన్నారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లా డుతూ 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తు న్నామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరం తూర్పు పర్యాటకానికి సింహద్వారమన్నారు. అటువంటి నగర వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసేలా ఈ ప్రాజెక్టు తీసుకురావడం శుభపరిణామన్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌, పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్‌ మ్యూజియానికి జ్ఞానానంద పేరు !

బొమ్మూరు సైన్స్‌ మ్యూజియానికి శ్రీ స్వామి జ్ఞానానంద పేరు పరిగణ నలో ఉందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్‌తో కలిసి ఆయన గురువారం సైన్స్‌ మ్యూజియం ప్రారంభించారు. నీటి వనరుల గ్యాలరీ, ఫన్‌ఫర్‌ సైన్స్‌ గ్యాలరీ, తారా మండలం, ఇన్నోవేషన్‌ హబ్‌, 75 ఏళ్లలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారత్‌, యాక్టివిటీ హాల్‌ తదితర విశేషాలను 45 నిమిషాలపాటు తిలకించారు. పాలకోడేరు మండలం గొరగనమూడిలో జన్మించి భౌతికశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణ లు చేసి అత్యున్నత పురస్కారాలు అందుకొన్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద పేరును ఈ కేంద్రానికి పెట్టడానికి పరిగణనలో ఉందని పవన్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బుచ్చయ్యచౌదరి, మద్దిపాటి వెంకట్రాజు, బొలిశెట్టి శ్రీనివాస్‌, చిర్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎవరీ జ్ఞానానంద

స్వామి జ్ఞానానంద 1896 డిసెంబరు 5న గొరగనమూడిలో జన్మించారు. తత్వవేత్తగా, అణుశాస్త్రవేత్తగా విశ్వవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఆయన అసలు పేరు లక్ష్మీనరసింహరాజు. 1917లో ఇల్లు విడిచి పెట్టారు. అనేక ప్రాంతాల్లో తిరిగి యోగాభ్యాసం, ఆధ్యాత్మిక సాధన చేశారు. గణితం, భౌతిక శాస్త్రాల్లో పీహెచ్‌డీ పట్టాలు పొందారు. 1927లో జర్మనీ వెళ్లి అక్కడవిజ్ఞాన శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు. పరమాణు భౌతికశాస్త్రంలో పరిశోధనలు చేశారు. విదేశీ యూనివర్సిటీల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు స్వదేశానికి వచ్చి ఢిల్లీలోని జాతీయ భౌతిక ప్రయోగశాలలో పరమాణు శాస్త్ర ఎలకా్ట్రనిక్స్‌ విభాగంలో సీనియర్‌ సైంటిఫిక్‌ అధికారిగా సేవలందించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ విభాగాన్ని స్థాపించారు. శేష జీవితాన్ని హిమాలయాల్లో గడిపి 1969లో కన్నుమూశారు. స్వామి జ్ఞానానంద పేరు మీద ఆయన సోదరుని కుమారుడు భూపతిరాజు రామరాజు, కృష్ణవర్మరాజు గొరగనమూడిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామి జ్ఞానానంద వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు తోడూ నీడగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మూరులో ఏర్పాటుచేసిన సైన్స్‌ మ్యూజియానికి స్వామి జ్ఞానానంద పేరును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రతిపాదించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 27 , 2025 | 01:00 AM