క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:32 AM
క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసికోల్లాసం, సంపూర్ణ ఆరోగ్యాలు చేకూరతాయని జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు.
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభం
ఏలూరు రూరల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): క్రీడలతో శారీరక దృఢత్వమే కాకుండా మానసికోల్లాసం, సంపూర్ణ ఆరోగ్యాలు చేకూరతాయని జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్–14, 17 బాల బాలికల తైక్వాండో పోటీలు శనివారపు పేట జడ్పీ హైస్కూల్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. పాఠశాలలో జ్యోతి వెలిగించి పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి ఆమె ప్రారంభించారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా విద్యార్థులు ఆటల్లో రాణించాలన్నారు. డీఈవో వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ క్రీడల్లో రాణించి, రాష్ట్ర కీర్తి పతకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేయాలన్నారు. పోటీలకు 13 జిల్లాల నుంచి 600 మంది క్రీడా కారులు హాజరయ్యారని ఎస్‌జీఎఫ్ సెక్రటరీ అలివేలు మంగ తెలిపారు. విజేత లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆమె తెలిపారు. డీవైఈవో ఎన్.రవీంద్రభారతి, ఎంఈవో అరుణ్‌కుమార్, పాఠశాల హెచ్‌ఎం ప్రకాష్, పద్మలత, ఇందుకూరి రమేష్, ఎస్‌ఎంసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.