అలరించిన హక్కు, దేవరాగం నాటికలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:32 AM
భీమవరం కళరంజని నాటక అకాడమి ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
రంగస్థల నటీమణి మాధవికి సావిత్రి స్మారక పురస్కారం
భీమవరం అర్బన్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భీమవరం కళరంజని నాటక అకాడమి ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. శ్రీసోమేశ్వర, జనార్ధన స్వామివార్ల ఆలయ ప్రాం గణంలో జరుగుతున్న నాటిక పోటీలో మూడో రోజు శుక్రవారం రాత్రి రెండు నాటికలు ప్రదర్శించారు. ముందుగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రంగస్థల నటీమణి ఎస్.మాధవికి మహానటి సావిత్రి స్మారక పురస్కారం, మంజునాథ్‌కు కళారంజని యువతేజం పురస్కారం అందించారు. సమాజంలో కుటుంబాలు, ప్రేమ, ఆదరణ కన్నా అస్థిరంగా ఉండే ఆస్తుల కోసం హక్కుల కోసం కుటుంబాల మధ్య జరుగుతున్న సంఘర్షణల ప్రతిరూపంగా సాగిన సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి హక్కు నాటిక, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటే తల్లిదండ్రులకు మధురమైన మలిదశ అవుతుందని చాటిన సౌజన్య కళాస్రవంతి ఉత్తరాంధ్ర వారి దేవరాగం నాటికలు అలరించాయి. నటీనటులు హావభావాలతో అందరినీ ఆకర్షించారు. ఈ పోటీలలో నాటక పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరథి శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు నల్లం వెంకట కృష్ణ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మెంటే పూర్ణ చంద్రరావు, మల్లుల సీతారామ ప్రసాద్, గుండా రామకృష్ణ, తదితర ప్రముఖులు, అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.