Share News

ఉప్పుటేరుకు ప్రత్యేక ప్యాకేజీ

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:24 AM

ఉప్పుటేరుకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొల్లేరు నుంచి వరద నీరు సక్రమంగా సముద్రంలోకి వెళ్లాలంటే డ్రెడ్జింగ్‌ చేయాల్సిందేనంటూ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.

ఉప్పుటేరుకు ప్రత్యేక ప్యాకేజీ

బుడమేరుతో కలిపి ప్రభుత్వానికి నివేదిక

కేంద్రం నుంచి నిధులు రావాలంటే ప్రత్యేకత ఉండాల్సిందే

సర్వే చేస్తున్న జలవనరుల శాఖ

కేంద్ర బృందం కొల్లేరు పర్యటనలో ఉప్పుటేరు డ్రెడ్జింగ్‌ ప్రస్తావన

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఉప్పుటేరుకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొల్లేరు నుంచి వరద నీరు సక్రమంగా సముద్రంలోకి వెళ్లాలంటే డ్రెడ్జింగ్‌ చేయాల్సిందేనంటూ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. గతంలో రూ. 500 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేశారు. బడమేరుతో సహా డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపారు. దీనివల్ల కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదని భావించిన ప్రభుత్వం ఉప్పుటేరు డ్రెడ్జింగ్‌కు ప్రత్యేకంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జలవనరుల శాఖ అధికారులు ఉప్పుటేరులో సర్వే చేస్తున్నారు. డ్రెడ్జింగ్‌కు అవసరమైన నిధులతో ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రతిపాదనలు చేయనున్నారు. దానిని కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటికే కొల్లేరు ప్రక్షాళనకు చర్యలు

వాస్తవానికి కొల్లేరులో ఇటీవల కేంద్ర బృందం పర్యటించింది. కొల్లేరు పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసింది. పలు సూచనలు చేసింది. ముఖ్యంగా కొల్లేరులోకి వెళ్లే డ్రెయిన్‌లు ప్రక్షాళన చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దానికోసం నిధులు కేటాయిం చింది. ఉప్పుటేరును సందర్శించిన కేంద్ర బృందం డ్రెడ్జింగ్‌ చేపట్టాలని స్పష్టం చేసింది. అప్పుడే కొల్లేరు సరస్సుకు రక్షణ ఉంటుందని, పరివాహక ప్రాంతం సురిక్షతంగా ఉంటుందని తేల్చింది. దేశంలో సరస్సులను పరిరక్షించేందుకు కేంద్రం కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగానే కొల్లేరు సరస్సుకు కీలకమైన ఉప్పుటేరు డ్రెడ్జింగ్‌కు ప్రత్యేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేసేలా జలవనరుల శాఖ సర్వే చేపడుతోంది. గతంలో బుడమేరుతో కలిపి ఒకే డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపారు. దీనివల్ల కేంద్రం నుంచి నిధులు రాబట్టే అవకాశఽం లేదు. మొత్తం భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. దాంతో ఉప్పుటేరు కోసం ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన చేయాలని ప్రభుత్వం సూచించింది. జలవనరుల శాఖ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ద శాబ్దాలుగా పూడికతో ఉప్పుటేరు

ఉప్పుటేరులో గడచిన మూడు దశాబ్దాల నుంచి డ్రెడ్జింగ్‌ చేయలేదు. ఆక్రమణకు గురైంది. ఫలితంగా ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలో ఆక్వా చెరువులకు రక్షణ లేకుండా పోతోంది. అధిక వర్షాలకు ముంపుబారిన పడుతున్నాయి. కొల్లేరు నుంచి వరద నీరు బయటకు వెళ్లడం కష్టతరమవు తోంది. కొల్లేరు ఎగదన్ని ఎగువ ప్రాంతంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొల్లేరు ప్రవాహం మందగించడంతో డ్రెయిన్‌ల నుంచి నీరు సరస్సు పరిధిలోకి వెళ్లకుండా ఆక్వా రైతులు అడ్డుకట్ట వేస్తున్న సందర్భాలున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పెంటపాడు మండలంలో పంట పొలాలు ముంపునకు కొల్లేరు డ్రెయిన్‌లే కారణమని తేలింది. అక్కడ అడ్డుకట్ట వేయడం వల్ల పెంటపాడు మండలంలో ముంపు తీవ్రత ఎక్కువైంది. అడ్డుకట్ట తొలగించాల్సి వచ్చింది. తాజాగా డ్రెయిన్ల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొల్లేరు పరివాహక ప్రాంతం ముంపునుంచి గట్టెక్కడానికి ఇది కొంత మేర ప్రయోజన కరంగా ఉంటుంది. ఉప్పుటేరులో డ్రెడ్జింగ్‌ చేపడితే కొల్లేరు సరస్సుతో పాటు, పదో కాంటూరు వరకు ముంపు బారినుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. నిధుల కోసం కేంద్ర సహకారం కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఉప్పుటేరుకు ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది.

Updated Date - Sep 10 , 2025 | 12:24 AM