విద్యార్థిపై దాడి ఆకతాయి పనే : ఎస్పీ
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:39 AM
పట్టణంలోని పోలీసు బొమ్మ సెంటర్‌లో కళాశాల బస్సులో విద్యార్థిపై దాడి సంఘటన ఆకతాయి పని అని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో ఈ నెల 19న రాయలం నుంచి తాడేరు వెళుతున్న కళాశాల బస్సులో విద్యార్థులపై జరిగిన దాడి సంఘటన వివరాలు తెలిపారు.
గంజాయి మత్తు అంటూ ప్రచారం
మంత్రి లోకేశ్ ఆరా
నిందితులకు కౌన్సెలింగ్
భీమవరం క్రైం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పోలీసు బొమ్మ సెంటర్‌లో కళాశాల బస్సులో విద్యార్థిపై దాడి సంఘటన ఆకతాయి పని అని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో ఈ నెల 19న రాయలం నుంచి తాడేరు వెళుతున్న కళాశాల బస్సులో విద్యార్థులపై జరిగిన దాడి సంఘటన వివరాలు తెలిపారు. విద్యార్థిని కొట్టిన ఆకతాయి విద్యార్థి, దాడికి పాల్పడిన బాలురు, యువకులకు, వారి తల్లిదండ్రులకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సూచన మేరకు కౌన్సె లింగ్ ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీతో రోడ్డుపై ఆగిన బస్సులో విద్యార్థి చేతిపై బయటి నుంచి 11 ఏళ్ల బాలుడు కొట్టాడన్నారు. ఎందుకు కొట్టావని గెల్లు రవికుమార్ బస్సు దిగి అడగడంతో కొందరు చుట్టుముట్టి కొట్టారని, బస్సులో మరో ఇద్దరు విద్యార్థులు కూడా బస్సు దిగి రవికుమార్‌ను రక్షించారన్నారు. సోషల్ మీడియాలో పట్టపగలే గంజాయి మద్యం మత్తులో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్ చేస్తున్నారంటూ వైరల్ అయిందన్నారు. ఇలాంటి ప్రచారం చేసే చర్యలు తీసుకుంటామన్నారు. మరుసటి రోజు గెల్లు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొట్టిన బాలుడిని, మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 21న మరో నలుగురు బాలురను ఈ కేసులో పాత్రధారులుగా గుర్తించామన్నారు. తుంటరి చర్య తప్ప నిందితులపై గతంలో ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని ఎస్పీ స్పష్టం చేశారు.
విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆరా
విద్యార్థిపై దాడి కేసుపై వివరాలు కోరుతూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే తనకు ఫోన్ చేశారని ఎస్పీ అస్మి తెలిపారు. 9వ తరగతి చదివే బాలురు, రోజూ వారీ కూలీ పనులు చేసుకునే బాలుర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని మంత్రి సూచించారన్నారు. సత్ప్రవర్తనతో మెలిగేలా వారి కుటుంబంతో కలిసి మంచి మార్గంలో జీవించడానికి మార్గదర్శకం చేయాలని చెప్పారన్నారు. యువకులకు, వారి తల్లిదండ్రులకు మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి ఘటనలపై పూర్తి నిఘా పెట్టామన్నారు. పోలీసు బొమ్మ సెంటర్‌లో జరిగిన ఘటనలను మార్ఫింగ్ చేసి వేరే రకంగా సృష్టించి అల్లర్లకు దోహదపడే విధంగా చేసిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ జయసూర్య, సీఐ నాగరాజు, ఎస్‌ఐలు కిరణ్ కుమార్, కృష్ణాజీ తదితరులు ఉన్నారు.