Share News

‘సోలార్‌’కు అద్దె

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:43 AM

సూర్యఘర్‌ పథకంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి, బలహీన వర్గాల ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

‘సోలార్‌’కు అద్దె

ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి ఇళ్లపై ప్యానళ్ల ఏర్పాటు

నెలకు రూ.200 అద్దె చెల్లింపు

ఇంటి పైభాగంలో 250 అడుగుల స్థలం అవసరం

13,500 ఇళ్లు గుర్తించడానికి సర్వే

సూర్యఘర్‌ పథకంలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి, బలహీన వర్గాల ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్సీ వర్గాల వారి ఇళ్లపై నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి ప్రతి నెల అద్దె చెల్లించనున్నారు. ప్యానళ్ల ఏర్పాటుకు అనువైన ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి ఇళ్లను విద్యుత్‌ శాఖ సిబ్బంది సర్వే చేస్తారు.

భీమవరంటౌన్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సూర్యఘర్‌ పథకంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి ఇళ్లపై సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 250 చదరపు అడుగుల స్థలం ఉన్న ఇళ్లను గుర్తించి యజమానుల అనుమతితో ప్యానల్‌ ఏర్పాటు చేస్తారు. నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ సౌకర్యం పొందుతున్నవారి ఇళ్లపై ప్యానల్స్‌ ఏర్పాటుచేసి విద్యుత్‌ ఉత్పాదన చెయ్యాలని యోచన. జిల్లాలో దాదాపు 53,200 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తొలుత గ్రామాల్లో అనువైన అర ఎకరం స్ధలం గుర్తించి అక్కడ సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుచేసి చేయడం ద్వారా వారికి ఉచిత విద్యుత్‌ అందించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం కొత్త విధానం రూపొందించి ప్యానెల్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

13,500 ఇళ్లు గుర్తించడానికి సర్వే

జిల్లాలో 13,500 ఇళ్లను గుర్తించి 250 చదరపు అడుగుల స్థలం ఉంటే అద్దెకు తీసుకుంటారు. నెలకు రూ.200 చొప్పున అద్దె చెల్లిస్తారు. 12 ఏళ్లు లీజుకు ఇవ్వడానికి అంగీకరించిన యజమానితో ఫారంపై సంతకం చేయించుకుంటారు. అనువైన ఇళ్లు గుర్తించేందుకు గ్రామాల్లో లైన్‌మెన్‌ ద్వారా సర్వే చేయించనున్నారు. విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు.

నెడ్‌ క్యాప్‌ ద్వారా ఏర్పాటు

లీజుకు ఇవ్వడానికి అంగీకరించిన యజమాని ఇంటి పై భాగంలో నెడ్‌ క్యాప్‌ ద్వారా సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి ప్యానల్స్‌ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ లోపు సర్వే పూర్తి చేయడానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 12:43 AM