ఆగని మట్టి దందా
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:23 AM
ఆగిరిపల్లి మండలంలో మట్టి మాఫి యా ఆగడాలను అరికట్టలేకపోతున్నారు.
నూజివీడు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆగిరిపల్లి మండలంలో మట్టి మాఫి యా ఆగడాలను అరికట్టలేకపోతున్నారు. మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలను పత్రికలు వెలుగులోకి తెచ్చినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనుమతి లేకుండా మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరిపితే చర్యలు ఉంటాయని చెప్పి ఊరుకున్నారు. రెండు, మూడునెలల క్రితం మండలంలోని నూగొండపల్లిలో ఒక చెరువు పక్కనే పొలంలో చెరువు మట్టిని గుట్టలు పోసి తరలించడానికి సిద్ధంగా ఉంచిన విషయాన్ని పత్రికలు వెలుగులోకి తెచ్చినా రెవెన్యూ, గనులశాఖ అధికారులు చర్యలు చేపట్టలేదు. గనులశాఖ మట్టి విలువను లెక్కిస్తే అక్రమ మట్టితవ్వకాలకు పాల్పడే వారిపై జరిమానా విధించడం జరుగుతుందని రెవెన్యూ శాఖ చేతులు దులిపేసుకుంది. ఇంతవరకు గనులశాఖ వచ్చింది లేదు. తాజాగా కలటూరు రెవెన్యూ పరిధిలో ఈదులగూడెం శివారు వద్ద ఒక పొలంలో చెరువుమట్టి గుట్టలు వెలుగు లోకి వచ్చాయి. అమ్మవారిగూడెం వద్ద గ్రావెల్‌గట్టు వద్ద ఒక ఎక్స్‌కవేటర్‌ను తవ్వకాల కోసం ఉంచడం కనిపించింది.