సహకారానికి కమీషన్
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:22 AM
జిల్లాలోని సహకార సంఘాలకు రెండు ఖరీఫ్ సీజన్ల కమీషన్ రూ.5.99 కోట్లు జమ య్యాయి. రబీకి సంబంధించి మరో రూ.4 కోట్లు విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో 80 శాతం జిల్లా సహకార బ్యాంకులోను, 20 శాతం సొసైటీలకు జమ అవుతున్నాయి. ఇటువంటి దుస్థితి ఒక్క పశ్చిమలోనే ఏర్పడింది.
రెండు ఖరీఫ్ సీజన్ల కమీషన్ రూ.5.99 కోట్లు జమ..
త్వరలో విడుదల కానున్న మరో రూ.4 కోట్లు
డీసీసీబీలో 80 శాతం, సంఘాలకు 20 శాతం జమ
మనుగడపై త్రిసభ్య కమిటీల గగ్గోలు.. పశ్చిమలోనే సమస్య
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని సహకార సంఘాలకు రెండు ఖరీఫ్ సీజన్ల కమీషన్ రూ.5.99 కోట్లు జమ య్యాయి. రబీకి సంబంధించి మరో రూ.4 కోట్లు విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో 80 శాతం జిల్లా సహకార బ్యాంకులోను, 20 శాతం సొసైటీలకు జమ అవుతున్నాయి. ఇటువంటి దుస్థితి ఒక్క పశ్చిమలోనే ఏర్పడింది.
జిల్లాలోని సొసైటీలకు 2018 నుంచి ప్రభుత్వం విడుదల చేసే కమీషన్‌లో 80 శాతం జిల్లా సహకార బ్యాంకులో సుమారు రూ.100 కోట్లు మేర డిపాజిట్ చేశాయి. వాటి నుంచి సొసైటీలకు ఎనిమిది శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. 20 శాతం సొమ్ములు సొంత అవసరాలకు వినియోగిస్తున్నాయి. వాస్తవానికి రైతు సేవా కేంద్రాల్లో సొసైటీలు తమ సిబ్బందిని నియమించి, వేతనాలు ఇస్తు న్నాయి. ఇప్పటి వరకు సంచుల రవాణా భారాన్ని సొసైటీలపైనే వేశారు. ఇలా ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.
అడ్వాన్స్‌కు స్వస్తి
ధాన్యం కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రభుత్వం సహకార సంఘాలకు అడ్వాన్స్ రూపంలో నిర్వహణ ఖర్చులు ఇచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సొసైటీలే తమ సొంత నిధుల ను వెచ్చిస్తున్నాయి. జిల్లాలో 122 సొసైటీలదీ ఇదే పరిస్థితి. సొసైటీలు తమ పరిధిలోని రైతు సేవ కేంద్రంలో ప్రతి సీజన్‌కు రూ.2 లక్షల వంతున వెచ్చిస్తున్నాయి. గరిష్టంగా ఆరు రైతు సేవా కేంద్రాలున్న సొసైటీలు జిల్లాలో ఉన్నాయి. వాటి కోసం రూ.18 లక్షలు మేర ఖర్చు పెడుతున్నాయి. నిధులు వెచ్చించాక ప్రభుత్వం కమీషన్ జమ చేయడం లేదు. మంజూరు చేసిన నిధుల్లో 80 శాతం డీసీసీబీలో డిపాజిట్ చేయాల్సి వస్తోంది. మిగిలిన 20 శాతం కమీషన్ నిర్వహణ ఖర్చులకు సరిపోవడం లేదు.
డిపాజిట్ ఎందుకో..
నిజానికి జిల్లాలో 122 సహకార సంఘాలకు రూ.60 కోట్లు కమీషన్ రావాలి. తాజాగా రూ.10 కోట్లు లైన్ క్లియర్ అయ్యింది. డీసీసీబీలో డిపాజిట్ వ్యవహారం సొసైటీల్లో పెద్ద రచ్చకు దారి తీస్తోంది. గతంలో మహిళా సంఘాలు, సొసైటీలు ఇష్ఠారీతిన కమీషన్ సొమ్ములు ఖర్చు చేస్తున్నాయంటూ అప్పటి కలెక్టర్ డీసీసీబీలో డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. అవి ఒక్క పశ్చిమగోదావరికే పరిమితమయ్యాయి. అప్పటినుంచి ఇదే విధానం కొనసాగుతోంది. దీనిపై సహకార సంఘాలు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా సరే ఫలితం లేకపోతోంది. కూటమి ప్రభు త్వంలో నియమించిన త్రిసభ్య కమిటీలు డీసీసీబీలో డిపాజిట్ విధానాన్ని తప్పుపడుతున్నాయి. కమీషన్ మొత్తం సొసైటీలకే ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. కానీ ఫలితం కనిపించడం లేదు.