Share News

బాబోయ్‌..కంపు

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:20 AM

చీకటి పడితే చాలు.. పట్టణాన్ని పొగ కమ్మేస్తోంది. అది కూడా భరించలేని వాసనతో కూడిన పొగ.

        బాబోయ్‌..కంపు
గోదావరి ఏటిగట్టుపై చెత్తకు నిప్పు పెట్టిన దృశ్యం

చీకటి పడగానే కమ్మేస్తున్న పొగ

నరసాపురం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): చీకటి పడితే చాలు.. పట్టణాన్ని పొగ కమ్మేస్తోంది. అది కూడా భరించలేని వాసనతో కూడిన పొగ. ఈ పరిస్థితి మార్కెట్‌లోనూ, పాలకొల్లు రోడ్‌లోనూ కనిపిస్తున్నది. మూడు రోజులుగా పట్టణమంతా ఇదే పరిస్థితి నెలకొన్నది. చీకటి పడిన తరువాత ప్రజలు బయటకు రావాలంటే ముక్కుకు గుడ్డ అడ్డంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కొందరు ఈపొగను భరించలేక కంటి దురదలతో బాధపడుతుంటే... మరికొందరు వాంతులకు గురి అవుతున్నారు. ఇంతకి ఇంత పెద్ద మొత్తం పొగ ఎక్కడ నుంచి వస్తుందోని కొందరు స్థానికులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరికి పాలకొల్లు రోడ్‌లోని గోదావరి గట్టుకు సమీపంలో ఉన్న మంచినీటి చెరువు వద్ద మండుతున్న కంపోస్టు యార్డు చెత్త పొగ అని తెలుసుకుని షాక్‌ చెందారు. వీటిని ఉద్దేశపూర్వకంగానే అంటించి ప్రజల్ని అనారోగ్యాలకు గురి చేస్తున్నారంటూ ఫైర్‌ అవుతున్నారు. కొంత కాలంగా పట్టణంలో చెత్త వేసేందుకు స్థలం లేకుండా పోయింది. ఎక్కడ చెత్త వేసినా... ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో పురపాలక సంఘం చేసేది ఏమి లేక పాలకొల్లు రోడ్‌లోని చెరువు వద్ద చెత్తను వేస్తూ వచ్చింది. వీరభవాని ఆలయం నుంచి సుమారు ఆర కిలోమీటర్‌ వరకు ఎక్కడ చూసినా.. చెత్త కుప్పలే పేరుకుపోయాయి. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. చివరికి ఇక్కడ చెత్త వేయడం నిలిపివేశారు. అయితే గట్టుపై ఉన్న చెత్తను తీసి మరో చోట అవకాశం లేకపోవడంతో వాటికి నిప్పులు పెడుతున్నారు. దీంతో ఆ పొగ పట్టణాన్ని కమ్మేస్తూ వస్తుంది. అయితే పురపాలక శానిటరీ సిబ్బంది మాత్రం ఇది తమ పని కాదంటున్నారు. కంపును భరించలేక... స్థానికులైవ్వరైనా వీటిని అంటిస్తున్నారంటూ చెబుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ కమ్మేస్తున్న పొగతో ప్రజలు అనారోగ్యం బారిన పడతామన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పొగ వాసన భరించలేకపోతున్నాం

మల్లాడి మూర్తి, లాకుపేట

నాలుగు రోజులుగా చీకటి పడితే చాలు పొగ కమ్మేస్తుంది. పొగతో పాటు భరించలేని వాసన. బయకొస్తే కంటి దురదలు, ఆ పొగను పీలిస్తే తు మ్ములు కూడా వచ్చేస్తున్నాయి. ఇబ్బందులు పడు తున్నాం. చీకటి పడగానే కుప్పలకు నిప్పులు పెడుతున్నారు. ఇది ఎవరు చేస్తున్నారో పట్టుకోవాలి. గోదావరి గట్టుపై వేసిన చెత్తను తొలగించాలి.

Updated Date - Nov 25 , 2025 | 12:21 AM