Share News

స్మార్ట్‌.. షాక్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:06 AM

విద్యుత్‌ సేవలు పొందిన వినియోగదారు చార్జీలు చెల్లించాలి. ఇక నుంచి ముందు చార్జీలు చెల్లిస్తేనే విద్యుత్‌ సరఫరా చేస్తారు. ముందుగా సొమ్ము చెల్లించి రీచార్జి చేసుకునేందుకు అనువుగా ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తోంది.

స్మార్ట్‌.. షాక్‌

ప్రభుత్వం అనుమతి

నాడు పగలగొట్టాలని..

నేడు బిగించమంటున్నారు!

వినియోగదారుల్లో సందేహాలెన్నో

ముందుగానే ధర చెల్లించాలి?

చిన్న పరిశ్రమలు, వ్యాపారులకు పెట్టుబడి భారం

విద్యుత్‌ సేవలు పొందిన వినియోగదారు చార్జీలు చెల్లించాలి. ఇక నుంచి ముందు చార్జీలు చెల్లిస్తేనే విద్యుత్‌ సరఫరా చేస్తారు. ముందుగా సొమ్ము చెల్లించి రీచార్జి చేసుకునేందుకు అనువుగా ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తోంది. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేసే విధానంలో భాగమని పలువురు విమర్శిస్తున్నారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసే స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వంలో అదే మీటర్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం శోచనీయం.

(నూజివీడు, ఆంధ్రజ్యోతి)

నివాస గృహాలకు స్మార్ట్‌ మీటర్లు బిగించ డానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. నాటి ప్రతిపక్షంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ను వ్యతిరేకించి నేడు పాలకపక్షం కాగానే అనుమతి ఇచ్చేసింది. ఇప్పటికే పలు చోట్ల కర్మాగారాలు, వ్యాపార సంస్థలకు స్మార్ట్‌మీటర్ల బిగింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఇళ్లకు సైతం స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటర్ల ఖరీదు కూడా వినియోగదారుడే భరించాలి. సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌కు రూ.8927, త్రీఫేజ్‌ మీటర్‌కు రూ.17286 ధర నిర్ణయించినట్లు సమాచారం.

స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే..

ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ మీటర్లు కేవలం వినియోగదారుడు ఎంత విద్యుత్‌ వాడుకున్నది నమోదు చేసే పరికరం మాత్రమే. స్మార్ట్‌ మీటర్‌ బిగిస్తే అడ్వాన్స్‌ మీటరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్‌ (ఏఎంఐ), ఆటోమేటిక్‌ మీటర్‌ రీడింగ్‌ (ఏఎంఆర్‌) అనే రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఏఎంఐ వ్యవస్థ ద్వారా ఇంట్లో మీటర్‌ ఎక్కడో ఉన్న బ్యాక్‌ ఆఫీస్‌కు వెర్‌లెస్‌ విధానంలో అనుసంధానమై ఉంటుంది. ఎక్కడో ఉండి ఈ మీటర్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. రెండో వ్యవస్థ ఏఎంఆర్‌ ద్వారా ఏ సమయంలో ఎంత విద్యుత్‌ వాడామనే వివరాలు నమోదవుతాయి. పీక్‌ సమయంలో వినియోగం అనే పేరుతో అధిక చార్జీలు వసూలు చేయడానికి విద్యుత్‌ సంస్థకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు పీక్‌ సమయం. ఈ సమయంలో విద్యుత్‌ వినియోగంపై ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారు. ఇది విద్యుత్‌ వినియోగదారుడికి గుదిబండ కానుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

బిల్లు చెల్లింపులో వెసులుబాటు ఉండదు..!

ప్రస్తుతం అమలులో ఉన్న పోస్ట్‌ పెయిడ్‌ విధానంతో విద్యుత్‌ బిల్లు చెల్లించడానికి 15 రోజులు గడువు ఉంది. బిల్లు చెల్లించకపోతే అపరాధ రుసుంతో చెల్లించడానికి అవకాశం ఉంది. నిర్ధిష్ట గడువు ముగిసిన తరువాత కూడా విద్యుత్‌ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్‌ తొలగిస్తారు. అప్పటి దాకా వినియోగదారుడికి విద్యుత్‌ సరఫరా అందుతుంది. స్మార్ట్‌ మీటర్‌ విధానంలో ఈ అవకాశం ఉండదు. సెల్‌ఫోన్‌ రీచార్జి మాదిరి ముందే విద్యుత్‌ బిల్లు చెల్లించాలి. లేకపోతే వెంటనే విద్యుత్‌ సరఫరా ఆగిపోతుంది. ఈ విధానం వలన పరిశ్రమలు, వ్యాపారులకు పెట్టుబడి భారమవు తుంది. చిన్న పరిశ్రమల నిర్వహణకు ఇది మరో గుదిబండ.

సమాచారం ఉండదు..

ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులో వాడిన యూనిట్లు, చెలించాల్సిన ధర, కస్టమర్‌ చార్జీల వివరాలు స్పష్టం గా ఉంటాయి. ప్రిపెయిడ్‌ విధానంలో యూనిట్‌కు ఎంత వసూలు చేస్తున్నారనే వివరాలు నేరుగా లభ్యమయ్యే పరిస్థితులు ఉండవని పలువురు చెబుతున్నారు.

మున్ముందు భారమే..

ఇప్పటికే స్మార్ట్‌ మీటర్లు పెట్టినవారికి బిల్లులు మాములుగానే వస్తున్నాయి కదా అన్న ప్రశ్న ఉదయించవచ్చు. ఇంకా అందరికీ స్మార్ట్‌మీటర్లు బిగింపు కార్యక్రమం పూర్తికాలేదు. అందరికీ ఈ మీటర్లు బిగింపు పూర్తయిన తరువాత ఈ మీటర్ల అసలు పని ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. తమ రాష్ట్రంలో అమలు చేయమని స్పష్టంగా కేంద్రానికి తెలిపింది. కేరళ ప్రభుత్వ కూడా ఈ మీటర్ల బిగింపునకు వ్యతిరేకించింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై పునరాలోచించి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకొని ప్రజాపక్షం అని నిరూపించుకోవాలి.

–జి.రాజు, సీపీఎం నాయకుడు

Updated Date - Jun 10 , 2025 | 01:06 AM