Share News

ఒక్కరోజే గడువు!

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:12 AM

గ్రామ/వార్డు సచివాల యాల నుంచి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రేషన్‌ స్మార్ట్‌ కార్డులు ఉచితం గా తీసుకోవడానికి ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తోంది.

ఒక్కరోజే గడువు!

రేషన్‌ స్మార్ట్‌ కార్డులు ఉచితంగా తీసుకోవడానికి రేపటితో ఆఖరు.. 95.5 శాతం పంపిణీ పూర్తి

ఏలూరుసిటీ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాల యాల నుంచి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రేషన్‌ స్మార్ట్‌ కార్డులు ఉచితం గా తీసుకోవడానికి ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తోంది. ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో తీసుకోనివారు తక్షణం తీసుకోవాలని ప్రభుత్వం కార్డుదారులకు విజ్ఞప్తి చేసింది. మొదటి విడ త మాత్రమే వచ్చిన కార్డుల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే ప్రఽథమ స్థానంలో నిలిచిందని జిల్లా పౌరసరఫరాల శాఖ చెబుతోంది. జిల్లాలో 6,14,000 రేషన్‌ కార్డులుండగా వీటిని జిల్లాలోని 1,123 రేషన్‌ దుకాణాల ద్వారా డీలర్లు,గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 5,87,000 (95.5 శాతం) స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయగా మరో 27,000 కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఈబీ విలియమ్స్‌ తెలిపారు. గడువులోగా కార్డులు తీసుకోకపోతే కార్డులు కమిషనరేట్‌కు వెనక్కి వెళ్లిపోతాయని చెబుతున్నారు. కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి ఇతరత్రా కారణాల వల్ల సిబ్బంది ఇంటింటికీ తిరిగినా కార్డులను అందించలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు మంజూరు కాగా ఈ నెల నుంచే రేషన్‌ ఇస్తున్నారు. కాని వీరికి స్మార్ట్‌ కార్డులు రాలేదు. గడువు ముగుస్తుండడంతో తమ కార్డుల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:12 AM