యజమాని అంగీకరిస్తేనే స్మార్ట్ మీటర్
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:58 AM
జిల్లాలో అధిక బిల్లులు వచ్చే ఇంటి యజమానులకు స్మార్ట్ మీటరు బిగించే విషయంలో సంబంధిత యజమాని అంగీకారం తీసుకుని ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
కొత్త సబ్ స్టేషన్‌లకు ప్రతిపాదనలు పంపండి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
భీమవరంటౌన్, జూలై 30(ఆంద్రజ్యోతి):జిల్లాలో అధిక బిల్లులు వచ్చే ఇంటి యజమానులకు స్మార్ట్ మీటరు బిగించే విషయంలో సంబంధిత యజమాని అంగీకారం తీసుకుని ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. మంగళవారం రాత్రి భీమవరం వచ్చిన ఆయన విద్యుత్ శాఖ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో అధిక విద్యుత్ బిల్లులు వచ్చే వారు దాదాపు 25 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయించారు. అయితే స్మార్ట్‌మీటర్లపై అపోహలు, ఆందో ళనలు వస్తున్న నేపథ్యంలో యజమానులకు స్మార్ట్ మీటర్లపై పూర్తిస్థాయి లో అవగాహన కల్పించిన తరువాత వారి అంగీకారం తీసుకుని బిగించాలన్నారు. సూర్యఘర్‌పై ఇచ్చిన లక్ష్యాలు పూర్తి చెయ్యాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు వారి ఇళ్లపై అద్దెకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సర్వే త్వరతగతిన పూర్తి చెయ్యాలన్నారు.
విద్యుత్‌కు అంతరాయాలు రానివ్వద్దు..
జిల్లాలో ఎక్కడా విద్యుత్ అంతరాయాలు రాకుండా వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్ అందించాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. పాలకొల్లులో 220 కేవీ సబ్ స్టేషన్ అవసరమని ఎస్‌ఈ రఘునాథబాబు వివరించారు. తరచూ అక్కడ లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ అంతరాయం వస్తోందని తెలిపారు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, మంత్రి దృష్టికి తీసుకు రాగా ఈ విషయంపై ఎనర్జీ సెక్రటరీ విజయానంద్‌తో మాట్లాడతానని అన్నారు. అలాగే పెనుగొండ 130 కేవీ సబ్ స్టేషన్‌పై లోడ్ ఎక్కువగా ఉన్నందున విద్యుత్ అంతరాయాలు వస్తున్నాయని, లోడు భారం తగ్గించే విధంగా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈని ఆదేశించారు.
సబ్ స్టేషన్‌లకు ప్రతిపాదనలను పంపండి
జిల్లాలో ఎక్కడైనా సబ్ స్టేషన్‌ల నిర్మాణాలపై ప్రతిపాదనలు ఉంటే వెంటనే అంచనాలు వేసి పంపించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. దీనిపై అధికారులు నరసాపురం పరిధిలో వేమలదీవి, అత్తిలి పరిధిలో మంచిలి, పాలకొల్లులో మేడపాడు, కాళ్ల పరిధిలో కానాలపల్లిలో ప్రతిపాదనలు ఉన్నాయని సంబంధిత ప్రజా ప్రతినిధులు పంపించారని వివరించారు. ఆకివీడు పరిధిలో పెద కాపవరం, భీమవరం మండలం లోసరిలో సబ్ స్టేషన్‌లు నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఈఈలు ఎన్.వెంకటేశ్వరారవు, కె. నరసింహమూర్తి, డిప్యూటీ ఈఈ కె. రాంబాబు తదితరులు ఉన్నారు.