ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్‌లు
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:15 AM
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు కూటమి సర్కార్ మరిన్ని మార్పులు తీసుకురానుంది.
తణుకు జడ్పీ హైస్కూల్‌లో ట్రయల్ రన్!
నియోజకవర్గానికి రెండు ఏర్పాటు
స్మార్ట్ కిచెన్‌లో ఐదు వేల మందికి వంట
సమీప పాఠశాలలకు సరఫరా
సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం.. పెరిగిన తినే వారి సంఖ్య
భీమవరం రూరల్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు కూటమి సర్కార్ మరిన్ని మార్పులు తీసుకురానుంది. ఇప్పటికే సన్న బియ్యంతో వండిన అన్నం అందిస్తుండగా.. స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిం ది. ఇప్పటికే ఇతర జిల్లాల్లో వీటి ఏర్పాటులో కొంత ముందు వుండగా మన జిల్లాలో స్మార్ట్ కిచెన్ ట్రయల్ రన్‌కు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు తణుకు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించి పంపించారు. ఇక్కడ ప్రారంభించి లాభనష్టాలను బేరీజు వేసుకుని, అనంతరం మిగిలిన పాఠశాలల్లో ప్రారంభిస్తారు. నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ లెక్క ప్రకారం 2500 విద్యార్థుల నుంచి ఐదు వేల మంది వరకు ఒక స్మార్ట్ కిచెన్ ఉండేలా ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ కిచెన్ నుంచి వంట తయారు చేసి మిగిలిన పాఠశాలలకు పంపిస్తారు.
వంట నాణ్యత పెంచేందుకు స్మార్ట్ కిచెన్‌లు
జిల్లాలో 1,475 ప్రభుత్వ పాఠశాలల్లో 1,383 మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వహణ ఉంది. వీటి ద్వారా రోజూ 85 వేల మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. ఒకటి రెండుచోట్ల భోజన నాణ్యతలో లోటు కనిపిస్తోంది. దీనిని సవరించేందుకు స్మార్ట్ కిచెన్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే సన్న బియ్యం ఏర్పాటు వల్ల గడిచిన ఐదు నెలల్లో భోజనం చేసే వారి సంఖ్య 76 వేల నుంచి 85 వేల విద్యార్థులకు చేరింది. ఒక్కో రోజు 86 వేల మంది విద్యార్థులు తింటున్నారు. 89 వేల మంది విద్యార్థులు చదువుతుంటే వీరిలో 96 శాతం మధ్యాహ్న భోజనం తింటున్నారు. వారికి ఏ లోపం లేని నాణ్యమైన భోజనం అందించేందుకు స్మార్ట్ కిచెన్ ఏర్పాటుపై దృష్టి పెట్టారు.
ఒక చోట నుంచి వేరేచోటికి భోజనం
ఒకచోట నుంచి వేరే చోటికి మధ్యాహ్న భోజనం తరలించి పెట్టే విధానం ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జరుగుతోంది. ఈ ఏడాది ఆదిలో ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లోను, ప్లస్ టూ స్కూళ్లలోను మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసింది. జిల్లాలోని 26 ప్లస్ టు స్కూళ్లల్లోని విద్యార్థులకు ఆ పాఠశాల స్కూల్‌లోని మధ్యాహ్న భోజనంలో వండే వాటిని అందిస్తున్నారు. అలాగే 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వాటి దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి ట్రాన్స్‌పోర్ట్ చేసేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాబోయే స్మార్ట్ కిచెన్‌ల నుంచి ఇదే విధంగా కేటాయించిన పాఠశాలలకు భోజనం తరలిస్తారు.