Share News

స్మార్ట్‌సిటీపై ఆశలు !

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:31 AM

గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో 2017 ఫిబ్రవరి 8న ఏలూరును స్మార్ట్‌సిటీగా నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకశ్రద్ధ కనపరిచి స్మార్ట్‌సిటీగా ఎంపిక చేశారు.

స్మార్ట్‌సిటీపై ఆశలు !

వైసీపీ ప్రభుత్వ హయాంలో పనుల నిలిపివేత

టీడీపీ అధికారంలోకి రావడంతో కదలిక వస్తుందని నగరవాసుల్లో ఆశాభావం

ఏలూరు నగరం స్మార్ట్‌సిటీగా మారుతుంది.. తమ జీవనప్రమాణాలు మెరుగవుతాయి.. ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం.. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నగర ప్రజలు ఎంతగానో ఆశపడ్డారు. ఆ ఆశలను గత వైసీపీ ప్రభుత్వం అడియాశలు చేసింది. మరల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్మార్ట్‌సిటీపై స్థానికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

(ఏలూరు టూటౌన్‌– ఆంధ్రజ్యోతి)

గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో 2017 ఫిబ్రవరి 8న ఏలూరును స్మార్ట్‌సిటీగా నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకశ్రద్ధ కనపరిచి స్మార్ట్‌సిటీగా ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఆరు నగరాలను స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేసినా ఏలూరు నగరాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. అనాటి ఎమ్మె ల్యే, దివంగత కోటరామారావు కృషి చేసి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును సీమెన్స్‌ కన్సారియంకు ప్రభుత్వం అప్పగించింది. దాని భాగస్వామి అయిన షాపూర్‌జీ పల్లోంజి కంపెనీ ఏలూరు నగరంలో పర్యటించి స్మార్ట్‌సిటీగా తయారవ్వా లంటే నగరం ఏఏ అంశాల్లో మెరుగవ్వాలి, దానికి ఎంత ఖర్చవుతుందని సర్వే నిర్వహించారు.

స్మార్ట్‌సిటీ నిర్మాణానికి రూ.896.85 కోట్లు ఖర్చువుతాయని అనంతరం పదేళ్ల మెయిటినెన్స్‌ ఖర్చులు రూ.346.02 కోట్లు ఖర్చవుతాయని మొత్తంగా 1242.87 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు తయారు చేశారు. ఈ ప్రతిపాదనలు ఆమోదించి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిపై పనులు ప్రారంభించి, రెండేళ్లలో స్మార్ట్‌ సిటీ పనులు పూర్తి చేయాలని షాపూర్‌జీ పల్లోంజి సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం 2019లో అనాటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.5.86 కోట్లు తమ వాటాగా విడుదల చేసింది. ఈ సొమ్ములో రూ.రెండు కోట్లను ఖర్చు చేసి నగరంలో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టారు. ఈలోగా ఈ ఎలక్షన్‌ కోడ్‌ వచ్చింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారి వైసీపీ అధికారం చేపట్టింది. స్మార్ట్‌సిటీని నిర్మిస్తే టీడీపీ ప్రభుత్వానికి ఎక్కడ పేరువస్తుందోనన్న ఆలోచనతో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో షాపూర్‌జీ పల్లోంజి సంస్థ కాంట్రాక్టును నిలుపుదల చేసింది. దీంతో స్మార్ట్‌సిటీపై నగరప్రజలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మరలా టీడీపీ ప్రభుత్వం అఽధికారంలోకి రావడంతో నగరప్రజల్లో స్మార్ట్‌సిటీపై ఆశలు రేకెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ప్రారంభించిన స్మార్ట్‌సిటీ పనులను తిరిగి ప్రారంభిస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

స్మార్ట్‌సిటీ అంటే..

స్మార్ట్‌సిటీ అంటే ప్రజల జీవన ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి, ఆయుఃప్రమాణాలు పెంచేలా పరిసరాల పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటారు. నగరం అంటే చెత్తతో కూడుకుని ఉంటుంది. స్మార్ట్‌సిటీలో ఇలాంటి చెత్తా ఎక్కడా కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. స్మార్ట్‌సిటీలో ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌రంగాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటుంది తనదైనందిక కార్యక్రమాలన్నిటిని టెక్నాలజీ ద్వారా వినియోగించుకుంటారు. నగరంలో పరిశ్రమలు ఏర్పడతాయి. ప్రజల జీవనప్రమాణం పెరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అభివృద్ధి పనుల అంచనాలు..

స్మార్ట్‌సిటీ రోడ్ల అభివృద్ధికి రూ.49 కోట్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ మెరుగుదలకు రూ.9.85 కోట్లు, ఎలక్ర్టీఫికేషన్‌ కోసం అండర్‌గ్రౌండ్‌లో కేబుల్స్‌ వేయడానికి రూ.221.55 కోట్లు, 24 గంటలు నీటి సరఫరా కోసం రూ.15.49 కోట్లు, వ్యర్థపదార్థాల నిర్వహణ కోసం రూ.207 కోట్లు, డ్రెయినేజీల అభివృద్ధి కోసం రూ.90.86 కోట్లు, సెప్టిక్‌ట్యాంకుల నిర్మాణం కోసం రూ.71.35 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు వేశారు. ఈ ప్రాజెక్టుకు ఏలూరు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఈఎస్‌సీసీఎల్‌) పేరు నామకరణం చేసి కలెక్టర్‌ను చైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఎస్పీ, నగర కమిషనర్‌లతో పాటు, ఒక ఇద్దరు నిపుణులైన అధికారులను ఈ కమిటీలో నామినేట్‌ చేశారు. ఈ కంపెనీకి టెక్నికల్‌ కన్సల్‌టెంట్‌గా అర్బన్‌ ఇన్‌ప్రాస్ర్టెక్చర్‌ అసెట్‌ మేనేజ్మెంట్‌ను ప్రభుత్వం నామినేట్‌ చేసింది. ఆర్థిక లావాదేవీల కన్స్‌ల్‌టెంట్‌గా అనాటి ఆంధ్రాబ్యాంకును ఎంపిక చేశారు.

Updated Date - Apr 26 , 2025 | 12:34 AM