Share News

సిల్వర్‌ షాక్‌ !

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:06 AM

నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రెండు నెలల క్రితం వెండి పెరుగుదల చూసి కేజీ రూ.1.50 లక్షల చొప్పున ఐదు కేజీలు కొనుగోలు చేశాడు. ధర రూ.1.85 లక్షలకు వెళ్లినా అమ్మలేదు. ఇంకా పెరుగుతుందన్న ఆశతో ఎదురు చూశాడు.

సిల్వర్‌ షాక్‌ !

వెండిపై పెట్టుబడులతో నష్టాలు

పెరుగుదల చూసి భారీగా కొనుగోళ్లు

గడిచిన రెండు నెలల్లో

రూ.20 కోట్లపైనే మదుపు

ధర పతనంతో వరుస అమ్మకాలు

నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రెండు నెలల క్రితం వెండి పెరుగుదల చూసి కేజీ రూ.1.50 లక్షల చొప్పున ఐదు కేజీలు కొనుగోలు చేశాడు. ధర రూ.1.85 లక్షలకు వెళ్లినా అమ్మలేదు. ఇంకా పెరుగుతుందన్న ఆశతో ఎదురు చూశాడు. ఒక్కసారిగా ధర తిరోగమనం పట్టింది. వారం క్రితం కేజీ రూ.1.45 లక్షలకు దిగింది. ఇంకా పడిపోతుం దన్న భయంతో కొన్న వెండిలో మూడు కేజీలు అమ్మేసుకున్నాడు.

మార్టేరుకు చెందిన ఓ వ్యాపారి సిల్వర్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. రియల్‌ఎస్టేట్‌ కుదేలవడం, బ్యాంకు వడ్డీలు తక్కువుగా ఉండటం, స్టాక్‌ మార్కెట్‌లు ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వకపోవడంతో వెండి సరైన పెట్టుబడి అని భావించారు. రానున్న రోజుల్లో భారీగా పెరుగుతుందన్న అంచనాతో 20 కేజీల వరకు కొనుగోలు చేశారు. మారిన అంతర్జాతీయ పరిణామాలతో ధర తగ్గుముఖం పట్టింది. దీంతో మళ్లీ రూ.లక్షకు దిగుతుందన్న భయంతో కొన్న వెండిని అయినకాడికి అమ్ముకున్నాడు.

నరసాపురం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): గడిచిన 20 రోజుల నుంచి జిల్లాలో బులియన్‌ మార్కెట్‌ వెండి కొనుగోలు కన్నా అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయ నేందుకు పై ఉదాహరణలే నిదర్శనం. ఇందులో లాభం గడించిన వారి సంఖ్య స్వల్పంగా ఉంటే నష్టపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. 2008, 2012 సంవత్సరాల్లో వెండి ఊహించని విధంగా పెరిగింది. అప్పటి వరకు కేజీ రూ.30 లేదా రూ.35 వేల మధ్య ఊగిసలాడేది. 2008లో ఒక్కసారిగా పెరుగుతూ వచ్చి రూ.79 వేలకు చేరువైంది. 2012లోనూ రూ.80 వేలకు వెళ్లింది. ఆ తరువాత రూ.40 వేలకు పడిపోయింది. చాలాకాలం రూ.40 వేలు రూ.50 వేల మధ్యే ఊగిసలాడింది. 2021లో రూ.లక్షకు చేరి చాలాకాలం స్థిరంగా ఉండిపోయింది. ఆ సమయాల్లో వెండి ధర ఇంకా పెరుగుతుందన్న భావించి పెట్టుబడులు పెట్టిన వారంతా నిండా మునిగారు. ఈ ఏడాది ఇదే పరిస్థితి కనిపించింది. 2025 ఆగస్టు నుంచి మొదలైన పెరుగుదల అక్టోబరు రెండో వారం వరకు కొనసాగింది. ఒక సమయంలో కిలో రూ.1.75 లక్షలు ఉంటే బ్లాక్‌లో రూ.1.90 లక్షలు పలికింది. ఇదే సమయంలో విశ్లేక్షకులు సోషల్‌ మీడియాలో వెండి రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందన్న కథనాలు వచ్చాయి. దీంతో చాలామంది వెండిపై పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపారు. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, బంగారం తాకట్టు పెట్టి ఆయనకాడికి వెండి కొనుగోలు చేశారు. ఇలా జిల్లాలో గడిచిన రెండు నెలల కాలంలో దాదాపు రూ.20 కోట్లపైనే వెండిపై పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. అత్యధికంగా నరసాపురం, పాలకొల్లు, మార్టేరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పెనుగొండ ప్రాంతాలకు చెందిన వ్యాపారులతోపాటు స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు వెండిని కొనుగోలు చేశారు ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో కాకుండా బహిరంగ మార్కెట్‌లో చైనా బార్‌, పూసల్ని లిక్విడ్‌ రూపంలో కొనుగోలు చేశారు. కొందరు స్టాక్‌ లేకపోవడంతో అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ బుక్‌ చేసుకున్నారు. అత్యధిక వ్యాపారం నరసాపురం, భీమవరం మార్కెట్‌ల్లో జరిగింది.

ఒక్కసారిగా పతనం

మార్కెట్‌ అంచనాలన్నీ గత నెల రెండో వారంలో పటాపంచలయ్యాయి. ఇజ్రా యిల్‌, పాలస్తీనా మధ్య ఒప్పందం, చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ట్రేడ్‌పై ట్రంప్‌ సానుకూల ప్రకటనల ప్రభావం బులియన్‌ మార్కెట్‌పై పడింది. దీంతో అమ్మకాలు మొదలయ్యాయి. ఒకానొక దశలో ఒక్క రోజులోనే కేజీ వెండి రూ 10 వేలు పతనమైంది. దీన్ని చూసిన మదుపుదారులు కలవర పడ్డారు. రానున్న రోజుల్లో 2007, 2011 నాటి పరిస్థితులు వస్తాయన్న భయంతో కొన్న వెండిని ఆయినకాడికి అమ్మకాలు మొదలుపెట్టారు. అప్పట్లో పతనమైన వెండి మళ్లీ పెరుగుదలకు 14 ఏళ్లు పట్టింది. ఇంతకాలం పెట్టుబడి పెట్టి కూర్చుంటే వడ్డీ నష్టమని భావించి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఇటు వ్యాపారులు కూడా ధర తగ్గించి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు

కొనుగోలుకన్నా.. అమ్మకాలే ఎక్కువ

ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో సిల్వర్‌ బుల్‌ బేర్‌ ట్రెండ్‌ జరుగుతోంది. ధర ఇంకా తగ్గుతుందన్న భయం పెట్టుబడి దారుల్లో నెలకొంది. దీంతో కొన్న వెండిని అయినకాడికి అమ్మే స్తున్నారు. వీరిలో కొంతమంది లాభాలు స్వీకరిస్తుండగా.. ఎక్కువ మంది నష్టాలకే బుక్‌ చేసుకుంటున్నారు. మళ్లీ రికార్డుస్థాయి ధర రాదన్న భయంతోనే అమ్మకాలు చేస్తున్నారు.

– అత్మూరి వెంకట నరసయ్య, బులియన్‌ వ్యాపారి, నరసాపురం

Updated Date - Nov 16 , 2025 | 12:06 AM