Share News

కల సాకారం అయ్యేనా

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:26 AM

చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలన్న 50 ఏళ్ల నాటి ప్రజల కల సాకారం అయ్యేలా కదలిక ప్రారంభమైంది.

కల సాకారం అయ్యేనా
చింతలపూడి బస్‌స్టేషన్‌

50 ఏళ్ల నుంచి స్థానిక ప్రజల ఆకాంక్ష

గతంలో సర్వేలు..ప్రతిపాదనలతో సరి

తెలంగాణ సరిహద్దు.. ప్రయాణికుల తాకిడి

అరకొరగానే సర్వీసులు.. జనం పాట్లు

చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలన్న 50 ఏళ్ల నాటి ప్రజల కల సాకారం అయ్యేలా కదలిక ప్రారంభమైంది. ఇప్పటికి గతంలో ఎన్నోసార్లు ఈ ప్రతిపాదన వచ్చినా అడుగు ముందుకు పడలేదు. సర్వేలు జరిపినా డిపో ఏర్పాటు కాలేదు. ఎట్టకేలకు ప్రస్తుత ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ చొరవతో డిపో ఏర్పాటు దిశగా చర్యలు ఊపందుకు న్నాయి. ఈసారైనా తమ కల నెరవేరాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

చింతలపూడి, సెప్టెంబరు 21 (ఆంధ్ర జ్యోతి) :

చింతలపూడి 1951లోనే నియోజకవర్గ కేంద్రం గా ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు ఇక్కడ ఆర్టీసీ డిపో పెట్టేందుకు అవకాశాలు వచ్చి నా అప్పటి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేశారు. 1988లో బస్‌స్టేషన్‌ ప్రారంభించారు. అంతకు ముందే డిపో పెట్టాలని, బస్‌స్టేషన్‌ నిర్మించాలని స్థానికులు కోరినా పట్టించుకోలేదు. ఆ తరువాత తెలుగుదేశం హయాంలో రెండుసార్లు అవకాశాలు వచ్చాయి. అప్పుడు పాలకులు నిర్లక్ష్యం చేశారు. 1996లో డిపో పెట్టాలని సీపీఐ ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌లో 48 రోజులపాటు నిరాహార దీక్ష జరి పారు. ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో ఆ నేతలు అప్పటి పెనుగొండ ఎమ్మెల్యే సీపీఐ నేత వంకా సత్యనారాయణ ఆధ్వర్యంలో దీక్షాపరులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి డిపో ఆవశ్యకతను వివరించారు. 2009లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. 2014లో రాష్ట్ర విభజనతో ఈ కేంద్రం రాష్ట్ర సరిహద్దులో నిలిచింది. 2016లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత చింతలపూడిలో బస్సు డిపో పెట్టాలని అధికారుల చేత సర్వే జరిపించారు. అప్పుడు సఫలం కాలేదు. 2024లో ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో డిపో ఏర్పాటుపై హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి గత నెలలో శ్రీకారం చుట్టి రవాణ శాఖ మంత్రి, రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రవాణ శాఖ, ఆర్టీసీ అధికారులు త్వరలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.

పలు సర్వీసులు రద్దు

తెలంగాణ సరిహద్దులోని చింతలపూడి నుంచి గతంలో ఉన్న సర్వీసులు చాలావరకు రద్దు చేశారు. సరిహద్దు ప్రాంతం కావడంతో రాష్ట్ర విభజన జరగకముందు సుమారు 250 సర్వీసులు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం 150 సర్వీసులకు దిగజారింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెంచాల్సి ఉండగా భిన్నంగా సర్వీసులు తగ్గించడంతో ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చింతలపూడి నుంచి గుంటూరు, నర్సరావుపేట, కాకినాడ వంటి దూరప్రాంత సర్వీసులు నడిపారు. పూచికపాడు, అంకంపాలెం, బాలువారిగూడెం వంటి గ్రామీణ ప్రాంతాలకు పాసింజర్‌ సర్వీసులు సైతం నడిచేవి. ప్రస్తుతం ఇవన్నీ రద్దయ్యాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో జంగారెడ్డిగూడెం మండలం కలవడంతో అక్కడ ఆర్టీసీ డిపో ఉందని పర్వాలేదనుకున్నారు. కాని ఆ డిపో బస్సులు కేవలం చింతలపూడి వరకే పరిమితం. ఏలూరు మార్గంలో కామవరపుకోట వరకు వస్తుంటాయి. అంతకుమించి నియోజకవర్గంలో ఏ గ్రామానికి బస్సులు తిరగడం లేదు. ఆ డిపో వల్ల నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది.

డిపో ఏర్పాటు తప్పనిసరి..

ఇక చింతలపూడి–ఏలూరు మార్గంలో బస్సులు ఎక్కాలంటే నరకం చూడాల్సిందే. ఈ మార్గంలో పాత బస్సులు నడపుతున్నారు. ఈ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉన్నందున మిగిలిన మూడు మండలాలు చుట్టూరా ఉన్నాయి. ఏలూరు డిపో నుంచి తెలంగాణ సరిహద్దు మేడిశెట్టివారిపాలెం వరకు 70 కిలోమీటర్ల దూరం ఉంది. ఏలూరు జిల్లాలో నూజివీడు నుంచి జంగారెడ్డిగూడెం వరకు 106 కిలోమీటర్లు ఉంది. ఈ మధ్యలో ఎక్కడా డిపోలు లేవు. వందల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే దూర ప్రాంత సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుతం చింతలపూడికి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపో బస్సులు మాత్రమే వస్తున్నాయి. తాడేపల్లిగూడెం, నరసాపురం, తిరువూరు ఒకటి, రెండు సర్వీసులు నడుస్తున్నాయి. మిగిలినవి సగం తెలంగాణ సర్వీసులు నడుస్తున్నాయి. గతంలో ఇక్కడ రద్దీని చూసి మెరుపు సర్వీసులు పెట్టగా వాటిని రద్దు చేశారు. కొంతకాలం చింతలపూడి బస్‌స్టేషన్‌ కేంద్రంలో ఎనిమిది బస్సులు ఏర్పాటు చేసి షటిల్‌ సర్వీసులుగా పల్లె గ్రామాలకు నడిపారు. అవి కూడా రద్దయ్యాయి. ప్రస్తుతం చింతలపూడి మునిసిపాలిటీగా ఏర్పడింది. జనాభా పెరిగింది. జిల్లాలోనే చింతలపూడి పెద్ద నియోజకవర్గం. ఓటర్లు 2 లక్షల 75 వేల మంది ఉన్నారు. జనాభా నాలుగు లక్షలకు పైగా ఉంటారు. 70 శాతం పేద, బడుగు వర్గాలకు చెందిన వారే. మహిళల ఓట్లు కూడా ఎక్కువ. ఈ నేప థ్యంలో నియోజకవర్గంలో రెండు డిపోలు సాధ్యం కాదంటూ చెప్పే సాకులు వద్దని బాహాటం గానే ప్రేజలు విమర్శిస్తున్నారు.

48 రోజులు నిరాహార దీక్షలు

1996లో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా అవసరాలను గుర్తించి అప్పటి సీపీఐ నేతలు చింతలపూడిలో ఆర్టీసీ డిపో పెట్టాలని పాతబస్టాండ్‌లో 48 రోజులపాటు రిలే దీక్షలు జరిపారు. అప్పటి నాయకులు సింగంశెట్టి సుబ్బరాజు, సీపీఐ నేతల ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరిగాయి. అప్పటి ప్రజాప్రతినిదులు పట్టించుకోకపోవడంతో పెనుగొండ సీపీఐ ఎమ్మెల్యే వంకా సత్యనారాయణ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి డిపో ఆవశ్యకత, తమ దీక్షలు, పాలకుల నిర్లక్ష్యం గురించి ముఖ్యమంత్రికి వివరించారు.

– ఎస్‌.సూర్యకుమార్‌, సీపీఎం నేత, చింతలపూడి

ఉచిత ప్రయాణం.. మహిళల నిలదీత

తెలంగాణ సరిహద్దులో ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో మూడొంతులు గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం తెచ్చింది. బస్సులు లేని గ్రామాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆ గ్రామాల్లో మహిళలు మా ఊరికి బస్సు ఏదీ.. అంటూ ఆ గ్రామాల పెద్దలు, నాయకు లను నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర సరిహద్దు మండలం కావడంతో అంతరాష్ట్ర సర్వీసుల పేరుతో పల్లెవెలుగు బస్సుల్లోను ఈ మండలంలో మహిళ లకు ఉచిత ప్రయాణం అనుమతించడం లేదు. ఇది మహిళలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

15 ఏళ్లుగా బస్సు సర్వీసులు రద్దు చేశారు

ఆది సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌, వెంకటాపురం

చింతలపూడి మండల కేంద్రంగా తెలంగాణ సరిహద్దులో ఉంటాయి. మూడొంతుల గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. గతంలో అనేక సర్వీసులు ఈ మార్గంలో నడిపి రద్దు చేశారు. పునరుద్ధ్దరించలేదు. ఇప్పుడు ప్రజలకు ఉచిత పథకంతో మా గ్రామాలకు బస్సులు కావాలని అడుగుతున్నారు. వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

డిపో ఆవశ్యకత ఉంది

ఆర్‌.వి.ఎస్‌.నారాయణ, సీపీఎం నేత, చింతలపూడి

చింతలపూడిలో 1978కి ముందు ఆర్టీసీ బస్సు డిపో పెట్టాలని ప్రజలు ఆశించారు. అప్పట్లో ఇవి వెనుకబడిన ప్రాంతమని ప్రచారం జరిపారు. కాని అప్పట్లోనే అభివృద్ధి ఉంది. ఇక్కడ సినిమా థియేటర్లు ఉండేవి. సినిమాలు చూడడానికి 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారు. పెళ్ళిళ్ళకు ఇక్కడే మార్కెట్‌ ఎక్కువ ఉండేది. రవాణ సౌకర్యం లేకపోవడం వల్ల ఇవన్నీ ఇప్పుడు వెనుకబడిపోయాయి.

రవాణా సౌకర్యాల్లో వెనుకంజ

ఆర్నేపల్లి అప్పారావు, మానవత నాయకుడు, చింతలపూడి

చింతలపూడి నియోజకవర్గంలో పలు గ్రామాలకు రవాణ సౌకర్యం లేక వెనుకబడి ఉన్నాయి. ఇప్పటికీ బాలువారిగూడెం, నామవరం, శివపురం వంటి మార్గాల్లో నడచి వస్తున్నారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు బస్సులు నడపాలంటే చింతలపూడిలో డిపో ఏర్పాటు తప్పరిసరి.

Updated Date - Sep 22 , 2025 | 12:26 AM