కదలని సర్వర్
ABN , Publish Date - May 17 , 2025 | 12:38 AM
కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో దరఖాస్తుదారులతో గ్రామ, వార్డు సచివాలయాలు కిటకిటలాడుతున్నాయి. అయితే సర్వర్ స్లోగా ఉండడం, ఒక్కోసారి ఓపెన్ కాకపోవ డంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులకు ఇబ్బందులు
కొత్త దరఖాస్తులకు తప్పని తిప్పలు
సచివాలయాల్లో గంటల తరబడి నిరీక్షణ
సమస్యను పరిష్కరిస్తామన్న అధికారులు
నెలాఖరు వరకు దరఖాస్తుల గడువు
(తణుకు–ఆంధ్రజ్యోతి):
కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో దరఖాస్తుదారులతో గ్రామ, వార్డు సచివాలయాలు కిటకిటలాడుతున్నాయి. అయితే సర్వర్ స్లోగా ఉండడం, ఒక్కోసారి ఓపెన్ కాకపోవ డంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవా లని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో చాలా మంది గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లారు. అక్కడ సర్వర్లు సరిగా పనిచేయక గంటల తరబడి నిరీక్షిం చాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా ఐదు లక్షల 58 వేల కార్డులు ఉన్నాయి. వారందరికి ప్రతి నెలా నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. అలాగే తహశీల్దారు కార్యాలయాల్లో గడిచిన రెండేళ్లుగా 26 వేల రేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం అవకాశం కల్పించ డంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి రేషన్ కార్డుల సమస్య తీరనుంది. ప్రధానంగా కార్డుల్లో కొత్త గా వివాహమైన వారు సభ్యుల యాడింగ్, పిల్లల పేర్ల నమోదు, సభ్యుల పేర్లు తొలగింపు(చనిపోయిన వారు పేర్లు మాత్రమే), రేషన్ కార్డు చిరునామా మార్పు, కార్డు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడం, కార్డులో ఆధార్ నెంబరు సరిచేయించడం వంటి సేవలకు తాజాగా అవకాశం కల్పించారు. అయితే వీటికి సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపా టు జతపర్చాలి.
సరిచేయిస్తా : అధికారులు
‘గ్రామ సచివాలయాల్లో సర్వర్ సమస్య ఉన్నట్లు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఇపుడు ప్రభుత్వం దృష్టిలో పెట్టి సరిచేయిస్తాం. నెలాఖరుకు వరకు సమయం ఉన్నందుకు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది’ అని జిల్లా పౌరసరఫరాల అధికారి సుజాత తెలిపారు.
‘దరఖాస్తుదారులు అంతా ఒకేసారి సైట్‌లోకి వెళ్లడం వల్ల సర్వర్ సమస్య ఏర్పడుతోంది. కొద్ది రోజుల్లో సమస్య పరిష్కారమ వుతుంది’ అని గ్రామ వార్డు సచివాలయాల జిల్లా ఇన్‌చార్జి వై.దోసిరెడ్డి తెలిపారు.
సచివాలయంలో సిబ్బంది ఎక్కడ ?
ఆకివీడులో పనిచేయని సర్వర్..
ప్రజలకు తప్పని తిప్పలు
కలెక్టర్, డిప్యూటీ స్పీకర్ దృష్టికి సమస్య
(ఆకివీడు–ఆంధ్రజ్యోతి):
సచివాలయాల్లో ఓ వైపు సర్వర్ సమస్య, మరోవైపు సిబ్బంది సరిగా ఉండకపోవడంతో రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆకివీడు అమృతరావునగర్ కాలనీలోని రెండో సచివాలయం మూడు నెలలుగా సిబ్బంది లేక తాళాలు వేసి ఉంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన ప్రజలకు సచివాలయానికి తాళం వేచి ఉండడంతో కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లారు. వారు గురువారం ఆకివీడు వచ్చిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, కలెక్టర్ నాగరాణిల దృష్టికి తీసుకుని వెళ్లి వినతిపత్రం అందజేశారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్‌ను ఉద్యోగులను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఓ ఉద్యోగిని ఉంచారు. జిల్లాలోని చాలా సచివాలయాల్లో సిబ్బంది అందుబా టులో వుండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాలో 535 సచివాలయాలు ఉన్నాయి. వీటికి సంబంధించి 5,930 మంది ఉద్యోగులకు 4,276 మంది పనిచేస్తున్నారు. వీరిలో రీసర్వే, రెవెన్యూ సదస్సులు తదితర వాటికి వెళుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలు విభజించి కలెక్టర్, ఆర్డీవోలకు నూతన కార్యాలయాలు ఏర్పాటుచేశారు. కార్యాలయాల్లో కిందిస్థాయి ఉద్యోగులను నియమించకుండా పలు కార్యాలయాల నుంచి డిప్యూటేషన్‌పై పంపించారు. దీంతో కార్యాలయాల్లో సిబ్బంది లేకపోవడంతో కార్యక్రమాలు ముందుకు సాగడంలేదు. కార్యాలయాల్లో పూర్తిస్థాయి ఉద్యోగులు లేకపోవడంతో ఉన్న ఉద్యోగులపై భారం పడడంతో వారు శ్రద్ధగా పనిచేయలేకపోతున్నారు.
3 నెలల నుంచి మూసివేత
రెండో సచివాలయంలో ఉద్యోగులు లేక మూడు నెలల నుంచి తాళాలు వేశారు. సమస్యల పరిష్కారానికి అక్క డకు వెళ్లిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. దీనిపై డిప్యూటీ స్పీకర్, కలెక్టర్‌ల దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఒక ఉద్యోగిని నియమించారు.
– బత్తుల శ్యామల, కౌన్సిలర్, ఆకివీడు
సిబ్బంది ఉండరు
సచివాలయాల్లో సిబ్బంది లేక సర్వర్లు పనిచేయక లబ్ధిదారులు ఇబ్బందు లు పడుతున్నారు. సర్వర్లు పనిచేయక దరఖాస్తులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. లబ్ధిదారులు పనులు మానుకుని పిల్లలతో సహా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాలి.
– మోపిదేవి సత్యవతి, కౌన్సిలర్, ఆకివీడు