Share News

రైతుల గుండెల్లో తుఫాన్‌!

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:27 AM

తుఫాన్‌లు వీడడం లేదు. ఇటీవల మొంథా.. నిన్న సెన్‌యార్‌.. నేడు దిత్వా తుఫాన్‌ ముంచు కొస్తోంది.

రైతుల గుండెల్లో తుఫాన్‌!

ముమ్మరంగా వరికోతలు

84,335 ఎకరాల్లో కోతలు పూర్తి

కల్లాల్లోనే 70,253 మెట్రిక్‌ టన్నుల ధాన్యం

ధాన్యం సేకరణ వేగవంతం : కలెక్టర్‌

ముందస్తుగా అప్రమత్తం : జేసీ

ఏలూరుసిటీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌లు వీడడం లేదు. ఇటీవల మొంథా.. నిన్న సెన్‌యార్‌.. నేడు దిత్వా తుఫాన్‌ ముంచు కొస్తోంది. సెన్‌యార్‌ ప్రభావం చూపకపోయినా దిత్వా తుఫాన్‌ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈనెల 29, 30 తేదీల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంకను అనుకుని ఉన్న నైరుతి బంగాళా ఖాతంలో తుఫాన్‌ ఏర్పడగా దిత్వా అని నామ కరణం చేశారు. తీరం వెంబడి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెబుతు న్నారు. శనివారం నుంచి సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు ఈ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతా వరణ శాఖ హెచ్చరిస్తున్నా ఇక్కడ కూడా వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో తుఫాన్‌ ప్రభావం చూపిస్తే పంట నష్టం తీవ్రంగా ఉంటుందని రైతుల్లో గుబులు మొదలైంది.

84,335 ఎకరాల్లో వరి కోతలు పూర్తి

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ వరి సాగులో 2,07, 203 ఎకరాల్లో వరి సాగు చేయగా ఇప్పటివరకు 84,335 ఎకరాల్లో వరికోతలు పూర్తవ్వగా 1,23,184 ఎకరాల్లో కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో లక్షా 29,338 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయింది. ఇంకా 70,253 మెట్రిక్‌ టన్నులు ధాన్యం కల్లాల్లోనే ఉంది. 19వేల 52 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

అవగాహన కల్పిస్తున్నాం: జేసీ

వాతావరణ శాఖ తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యం లో రైతులు ఎటువంటి పంట నష్టం జరుగకుండా రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యలపై అవగాహ న కలిగిస్తున్నామని జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.విజయానంద్‌కు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గురువారం ధాన్యం కొనుగోలుతో పాటు వివిధ అంశాలపై సచివాల యం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిం చారు.జేసీ మాట్లాడుతూ వాతావరణ శాఖ తుపాన్‌ హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా రైతుల పంటకు నష్టం కలుగకుండా రైతు సేవా కేంద్రాల వద్ద టార్ఫాలిన్లు సిద్ధం చేస్తామన్నారు. ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేస్తున్నామన్నా రు. జడ్పీ సీఈవో శ్రీహరి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ భానుప్రతాప్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలి : కలెక్టర్‌

జిల్లాలో ఈనెల 30వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో పంట నష్టం నివారణ చర్యలపై అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వర్షాల కారణంగా పంట నష్టం జరగకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు. ప్రస్తుతం కల్లాలపై ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన టార్ఫాలిన్‌లను రైతు సేవా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షాల సమయంలో ధాన్యం బస్తాలను ప్రభుత్వ కార్యాలయాల ఖాళీ భవనాల్లో భద్రపరచుకోచ్చునన్నారు జేసీ అభిషేక్‌ గౌడ , జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్‌ హబీబ్‌బాషా, వ్యవసాయ శాఖాధికారులు, మండల, గ్రామ వ్యవసాయ శాఖ సిబ్బంది , రైతు సేవాకేంద్రాల సిబ్బంది పొల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:27 AM