Share News

సేన సన్నద్ధం

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:33 AM

త్వరలో సంస్థాగత ఎన్నికలకు జనసేన సిద్ధం అవు తుందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది.

సేన సన్నద్ధం

త్వరలో పాత కమిటీలకు మంగళం ..

అధిష్ఠానం కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారింపు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

త్వరలో సంస్థాగత ఎన్నికలకు జనసేన సిద్ధం అవు తుందా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. రానున్న ఎన్నికల్లో బరిలో దిగేందుకు తాజాగా సంస్థా గత కూర్పుపై రాష్ట్ర జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని జిల్లాలో పార్టీ నిర్మా ణంపై సమీక్ష చేయడంతో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపైనా ప్రత్యేక ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. 2021లో వేసిన కమిటీలే కొనసాగుతుండటం.. మరో వైపు నామినేటెడ్‌ పోస్టుల సాధనలోనే బీజేపీ కంటే జనసేన కేడర్‌ భేషుగ్గానే దక్కించుకోవడంతో ఆ పార్టీలో మరింత ఊపు తెచ్చేలా కూర్పు సాగే అవకాశాలున్నాయి.

జనసేనపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. టీడీపీతో పాటు అన్ని చోట్ల బలపడే స్థాయికి చేరుతోంది. అయితే యువతను సమర్థవంతం చేర్చి నాయకులతో మమేకం అయేలా ఒకేచోట చేర్చి వారి మనోగతం తెలుసుకునే వారే కరువయ్యారు. క్యాడర్‌ ఉత్తేజంగా ఉండగా.. సరైన దారిలో పార్టీని ముందుకు నడిపే వారు కరువయ్యారని ఆరోపణలున్నాయి. రూట్‌స్థాయిలో కార్య కర్తలను, నాయకులను బలోపేతం చేసే దిశగా నడిపించే నాయకత్వం లోపం ఆ పార్టీని వెన్నాడుతోంది. 2021లో బూత్‌, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీల కూర్పు సాగిం ది. ఇటీవల కాంగ్రెస్‌ సంస్థాగతంగా కమిటీ లను ఉన్నవారితో పూర్తి చేసింది.

నామినేటెడ్‌తో పార్టీలో జోష్‌

ఏలూరు లో అసెంబ్లీ సీటును టీడీపీకి త్యాగం చేసిన నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి అప్పల నాయుడుకు విజయవాడ ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పదవితో జనసేన పార్టీని ఏలూరులో నిలుపుకుంది. దెందులూరులోనే వడ్డీ కార్పొ రేషన్‌ చైర్మన్‌ ఘంటసాలక్ష్మికి సముచిత స్థానం కల్పించింది. ఇటీవలే చింతలపూడి ఏఎంసీ చైర్మన్‌ పదవి దుర్గకు అప్పగిం చారు. కమ్మ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఏలూరు చెందిన వాణిశ్రీని, పోలవరం నియోజకవర్గంలో మూడుచోట్ల ఏఎంసీ చైర్మన్లను అక్కడ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో ఇచ్చారు. ఉంగు టూరు, కైకలూరుల్లోను జనసేన ప్రాధాన్యం ఇచ్చారు.

సమీక్షలు..చర్చల్లేక అసంతృప్తి

జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ వచ్చినప్పుడు పార్టీ కేడర్‌ అంతా ఆయన వెంట నడుస్తున్నారు. ఉమ్మడి జిల్లా లో కార్యక్రమాలకు హాజరవుతున్నా కేడర్‌కు సరైన దశ, దిశా నిర్థేశనం చేయడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. దీంతో చాలాచోట్ల క్యాడర్‌ అయోమయంలో ఉంది. ఏలూరు జిల్లాలో పార్టీని నడిపేవారు కరువయ్యారు. ఉమ్మడి జిల్లా జనసేన అధ్య క్షుడిగా గోవిందరావు వ్యవహరిస్తున్నారు. కనీసం ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు, కేడర్‌తో సమావేశాల నిర్వహణ లేదు. మరో వైపు ఇటీవల జిల్లా నుంచి పలువురికి నామినేటేడ్‌ పోస్టులు దక్కాయి. కనీసం వారందరిని ఒకేచోట చేర్చి కనీసం సత్కారాలు కూడా చేయలేదు. ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో కేడర్‌ కీలకంగా బలోపేతంగా ఉంది. అయితే పార్టీ వ్యవహారాలపై ఎవరితోను సంప్రదింపులు లేకుండా ఉన్న నాయకులే ఇష్టారాజ్యంగా సాగిపోతుండడంతో పార్టీలో అసంతృప్తి రేగుతోంది.

స్థానిక ఎన్నికలే లక్ష్యంగా..

జనసేన ఇప్పటి వరకు పదేళ్ల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడర్‌ను బరిలో నిలుపలేదు. ఈ దిశగా తయారు చేయలేదు. అధినాయకుడు పవన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వీలుచిక్కినప్పుడల్లా జనసైనికులు ప్రజల్లోనే నిత్యం ఉండాలని పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సమరంలో కూటమి పార్టీలతోనే జతకట్టి వివిధ సర్పంచ్‌, మున్సిపల్‌ వార్డు, కార్పొరేషన్‌ డివిజన్లలో పోటికి నిలిపేలా సంస్థాగత కూర్పు చేస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీనిపై అభిప్రాయాలు, పార్టీ నిర్మాణంపై ఆయన జిల్లా నేతలతోను సమాలోచనలు చేసే అవకాశం ఉంది. ఈనెల 24న డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ కల్యాణ్‌కు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆయన తన పర్యటనలో పార్టీ కేడర్‌కు కొంత సమయం కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Updated Date - Nov 23 , 2025 | 12:33 AM