Share News

నల్లికాటు..జ్వరం పోటు!

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:36 AM

తాజాగా గురువారం పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన ఓ గృహిణి(50)కి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. ఫీవర్‌ సర్వేలో భాగంగా తొలుత నవంబరు 15న జ్వరం బారిన పడిన ఈ మహిళను స్థానిక ఆశా కార్యకర్త గుర్తించింది

 నల్లికాటు..జ్వరం పోటు!

మహిళకు స్క్రబ్‌ టైఫస్‌ నిర్ధారణ..ఏలూరు జీజీహెచ్‌లో చికిత్స

గత నెలలో మరొకరికి పాజిటివ్‌.. సాధారణ చికిత్సతోనే నయం

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

విస్తృత అవగాహన, పారిశుధ్య కార్యక్రమాలకు చర్యలు

జీజీహెచ్‌లో నిరుపయోగంగా ఆర్టీపీసీఆర్‌/వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌ అనే ఓ రకం నల్లి/పురుగు కాటు వ్యాది ఏలూరు జిల్లాలోనూ పలువురిని కాటేయడం ప్రారంభించింది. ఎక్కువగా పొలాలు, అపరిశుభ్ర ప్రాంతాలు, మురికి వాడల్లో నివసించే లేదా సంచరించే వ్యక్తులను స్క్రబ్‌ టైఫస్‌ నల్లులు కుడుతుండగా, తొలుత సాధారణ జ్వరంతో మెదలై, రోజుల వ్యవధిలోనే తీవ్రత, ఇతర రుగ్మతలతో రోగినిఅతలాకుతలం చేస్తున్నాయి. వాస్తవా నికి గత నెలలోనే టి.నరసాపురానికి చెందిన 30 ఏళ్ల పురుషుడికి స్క్రబ్‌ టైఫస్‌ సోకినట్టుగా నిర్ధారణ కావడం, ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స అనంత రం ఆరోగ్యంగా బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా గురువారం పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన ఓ గృహిణి(50)కి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. ఫీవర్‌ సర్వేలో భాగంగా తొలుత నవంబరు 15న జ్వరం బారిన పడిన ఈ మహిళను స్థానిక ఆశా కార్యకర్త గుర్తించింది. మహిళకు పారాసిటమాల్‌ మాత్రలను ఇచ్చింది. జ్వరం అదుపులోకి రాకపోవడంతో రెండోరోజు వట్లూరు పీహెచ్‌సీ వైద్యాధి కారి వద్దకు వెళ్లగా, బ్యాక్టీరియల్‌ ఫీవర్‌గా భావించి చికిత్స చేసి పంపించేశారు. మూడు రోజులు గడిచినా జ్వరం తగ్గకపోవడంతో కొప్పాకలోని ఓ ప్రైవేటు ఆసు పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లింది. అయినప్పటికీ జ్వరం తీవ్రత ఎక్కువవుతుండటంతో నవంబరు 26న ఏలూరు జీజీహెచ్‌లో చేరింది. రోగ లక్షణాలను బట్టి అనుమానిం చిన జీజీహెచ్‌ వైద్య నిపుణులు ఈ నెల 3న ఎలీసా టెస్టుకు శాంపిల్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపగా, గురు వారం ఆమెకు స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నా రు. ఆమె ఆరోగ్యం నిల కడగానే ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. తాజా కేసుతో అప్రమత్త మైన వైద్యశాఖ ముంద స్తు నివారణ చర్యలతో పాటు, ప్రజలకు అవగాహన, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణతో స్క్రబ్‌ టైఫస్‌ను ఎదుర్కొవడానికి కార్యాచరణ ప్రారంభించింది.

లక్షణాలివే..

పొలాలు, గ్రామీణ ప్రాంతాల్లో పొదలు, మొక్కల్లో ఎక్కువగా ఈ కీటకం (నల్లి) కనబడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. శరీరంపై ఈ నల్లులు కరిచిన ప్పుడు వాటి లాలాజలం ద్వారా బ్యాక్టీరియా మనిషిలోకి ప్రవేశిస్తుంది. తొలుత ఎర్రని పుండు ఏర్పడి, క్రమేణా మాడిపోయినట్టు నల్లరంగులోకి మారుతుంది. ఇది పొలుసులతో కూడిన గాయం మాదిరి ఉంటుంది. నొప్పి ఉండదు. నల్లి కరిచిన తర్వాత లక్షణాలు కనిపించడానికి 6 నుంచి 21 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలోనే బాక్టీరియా శరీరంలో వృద్ధి చెందుతుంది. తీవ్ర జ్వరం, వణుకు, తలనొప్పి, పొడి దగ్గు, కండరాల నొప్పులు, దద్దుర్లు, వికారం, వాంతులు, కడుపు నొప్పి వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే బ్యాక్టీరియా మెదడుకు వ్యాపించడం, నుమోనియా, ఊపిరి తిత్తులు, కాలేయం, మూత్రపిండాలతో సహా పలు అవయవాలను ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తు న్నారు. అనుమానిత లక్షణాలున్న రోగికి రక్తపరీక్షలు, ఇతర వైద్యపరీక్షలతో స్క్రబ్‌ టైఫస్‌ను నిర్ధారిస్తారు. లక్షణాలను గుర్తించడం, సరైన సమయంలో చికిత్సతోనే రోగిని రక్షించవచ్చని భరోసా ఇస్తున్నాయి.

వైద్యుల పర్యవేక్షణలో చికిత్స మేలు

స్క్రబ్‌ టైఫస్‌కు చికిత్స సాధారణమైందేనని, ఇది సోకిన రోగినుంచి ఇతరులకు వ్యాప్తి చెందే అంటువ్యాధి కాదు. యాంటీ బయాటిక్స్‌ చికిత్సతోనే నయం చేయ వచ్చు. సాధారణంగా డాక్సీసైక్లిన్‌, అజిత్రోమైసిన్‌ వంటి ఔషధాలతో గరిష్ఠంగా రెండు రోజుల వ్యవధిలోనే ఉప శమనం పొందవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. ఈ ఔషధాలను రోగతీవ్రత, లక్షణాల మేరకు వైద్యనిపుణుల సూచనలు, సలహాలను పాటిస్తూ, వారి పర్యవేక్షణలోనే వినియోగించాలే తప్ప సొంతంగా నిర్ణయాలను తీసుకోరాదని హెచ్చరిస్తున్నారు.

ఆర్టీపీసీఆర్‌/వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ను తెరవండి

బ్యాక్టీరియా సంబంధిత వైరల్‌ రోగాలు, జబ్బులు, తీవ్రతను నిర్ధారించేందుకు సంబంధిత రోగుల శాంపిల్స్‌ ను పరీక్షించడం ద్వారా అవసరమైన ఖచ్చితమైన వైద్య నివేదికలను అందించడానికి, తద్వారా సరైన వైద్య చికిత్సలకు ఉపయోగపడే కీలకమైన ఆర్టీపీసీఆర్‌/వీఆర్‌డీ ఎల్‌ ల్యాబ్‌ ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గత ఆగస్టు నుంచి మూతపడింది. రక్త, శ్వాబ్‌ నమూనాలను సమగ్రంగా విశ్లేషించి రోగ నిర్ధారణలో, తీవ్రతలోనూ ఈ ల్యాబ్‌ ఇచ్చే రిపోర్టులనే వైద్య వర్గాలు ప్రామాణికంగా తీసుకుని చికిత్సలను చేపడతాయి. కొవిడ్‌ మహమ్మారి కాలంలో సేవలందించిన ఈ ల్యాబ్‌కు విధులు నిర్వ ర్తించే వైద్యసిబ్బంది లేక ఆగస్టు చివరి వారం నుంచి మూసివేశారు. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ/ ఎన్‌హెచ్‌ఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ల్యాబ్‌ను మెడికల్‌ డైరెక్టరేట్‌ (డీఎంఈ)కి బదలా యించడంతో నిర్వహణ జీజీహెచ్‌ చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం మూతపడిన ఈ ల్యాబ్‌లో హెపటైటిస్‌, డెంగీ, మలేరియా, కొవిడ్‌ వేరియంట్లు, స్క్రబ్‌ టైఫస్‌వంటి రోగాల బారిన పడిన రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను విశ్లేషిం చేందుకు వినియోగించే 9 ఆర్టీపీసీ ఆర్‌ మిషన్లు, 2 బయోస్టెమ్‌లు, 3 ఆటోమేటెడ్‌ మిషన్లు, రసాయనాలు, కిట్లువంటి రూ.2.50 కోట్ల విలువైన ల్యాబ్‌సామగ్రి నిరుపయోగంగా పడి ఉంది. సాధారణ రోజుల్లో ఈ ల్యాబ్‌కు రోజుకు సగటున 10 వరకు శాంపిల్స్‌ విశ్లేషణ, రోగ నిర్ధారణ నిమిత్తం వస్తుండేవి. తాజాగా స్క్రబ్‌ టైఫస్‌ కేసులు వెలుగులోకి వస్తున్న వేళ ఇకనైనా ఈ ఆర్టీపీసీఆర్‌/వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ను పునఃప్రారం భించడానికి తక్షణ చర్యలు అవసరం.

అన్ని పీహెచ్‌సీలను అప్రమత్తం చేశాం

డాక్టర్‌ పీ.జే అమృతం, ఏలూరు డీఎంహెచ్‌వో

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు గురువారం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి అప్రమత్తం చేశాం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ముందస్తుగానే దీని నుంచి నివారణ పొందవచ్చు. డీట్‌ కలిగిన పురుగుల నివారణి ఆయింట్మెంట్‌ను చర్మంపై రాసుకోవాలి. పొలాలు, పొదలు, గడ్డి, పశువుల పాకల్లో పనిచేసేవారు లేదా ఆ ప్రాంతాల్లోకి వెళ్లేవారు పొడవాటి చొక్కాలు, ప్యాంటు, బూట్లు వంటివి ధరించాలి. స్నానం చేయడం, దుస్తులను క్రమం తప్పకుండా మార్చడం వంటి వ్యక్తిగత పరిశుభ్రతను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలి. నల్లి కరిచిన ప్రదేశంలో నల్లటిమచ్చ కనబడితే లేదా అనుమానిత లక్షణాలు కనబడితే వైద్యులను సంప్రదించాలి. సకాలంలో గుర్తించి చికిత్సచేస్తే పూర్తిగా నయంచేయవచ్చు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమా లను సంపూర్ణంగా చేపట్టాలని పంచాయతీరాజ్‌ శాఖకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా తీవ్రజ్వరం బారినపడితే సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్తే అక్కడి వైద్యాధికారి రోగలక్షణాలను పరిశీలించి, అవసరమని భావిస్తే రక్తనమూనాను తీసుకుని వ్యాధి నిర్ధారణ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పంపిస్తారు. అక్కడ బ్లడ్‌ శాంపిల్‌కు ఎలీసా టెస్టు నిర్వహించి 12 గంటల వ్యవధిలో ల్యాబ్‌ రిపోర్టు ఇస్తారు. జీజీహెచ్‌లో సరిపడినన్ని ఎలీసా టెస్టు కిట్లు అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Dec 05 , 2025 | 12:36 AM