Share News

జాతీయ, దక్షిణ భారత సైన్స్‌ ఫెయిర్లకు ఏలూరు జిల్లా విద్యార్థినులు, టీచర్‌ ఎంపిక

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:35 AM

రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో ఏలూరు జిల్లా విద్యార్థినుల బృందం, వ్యక్తిగత విభాగంలో ఓ ఉపాధ్యాయిని ప్రదర్శించిన నూతన ఆవిష్కరణలు జాతీయస్థాయికి, దక్షిణ భారతస్థాయికి ఎంపికయ్యాయి.

జాతీయ, దక్షిణ భారత సైన్స్‌ ఫెయిర్లకు   ఏలూరు జిల్లా విద్యార్థినులు, టీచర్‌ ఎంపిక
బహుమతులు అందుకుంటున్న చాటపర్రు జడ్పీ హైస్కూలు విద్యార్థినులు

కర్నూలు బస్సు అగ్నిప్రమాద నివారణపై ప్రదర్శనకు ప్రథమ స్థానం

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో ఏలూరు జిల్లా విద్యార్థినుల బృందం, వ్యక్తిగత విభాగంలో ఓ ఉపాధ్యాయిని ప్రదర్శించిన నూతన ఆవిష్కరణలు జాతీయస్థాయికి, దక్షిణ భారతస్థాయికి ఎంపికయ్యాయి. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ బుధవారం ముగిసింది.

ఇద్దరు విద్యార్థులు, ఒక గైడ్‌ టీచరుతో కూడిన గ్రూప్‌ విభాగంలో మొత్తం ఏడు థీమ్‌లపై నిర్వహించిన ప్రదర్శనల్లో ఏలూరు రూరల్‌ మండలం చాటపర్రు జడ్పీ హైస్కూలు తొమ్మిదో తరగతి విద్యార్థినులు బి.గాయత్రి, ఎస్‌.శరణ్య, గైడ్‌ టీచరు షేక్‌గాలిబ్‌తో కూడిన బృందం సుమారు రెండు నెలల క్రితం కర్నూలులో జరిగిన ఓ ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదం నేపథ్యంలో ‘వర్కింగ్‌ మోడల్‌.. ఎవైడింగ్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ ఆన్‌ రన్నింగ్‌ బసెస్‌ బై సెన్సర్‌’ ఎగ్జిబిట్‌ జాతీయస్థాయి, దక్షిణ భారతస్థాయి సైన్స్‌ ఫెయిర్లు రెండింటికీ ఎంపికైంది. దక్షిణ భారతస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ జనవరి 19 నుంచి 23 వరకు హైదరా బాద్‌లో నిర్వహించనున్నారు. జాతీయస్థాయి సైన్స్‌ ఫెయిర్‌ ఢిల్లీలో మార్చిలో జరుగనుంది. ఈ రెండు ప్రదర్శనలకు ఏపీ నుంచి ఎంపికైన చాటపర్రు జడ్పీ హైస్కూలు విద్యార్థినులు, గైడ్‌ టీచరుకు విజయవాడలో బుధవారం సాయం త్రం జరిగిన స్టేట్‌ సైన్స్‌ ఫెయిర్‌ ముగింపు కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి, తదితరులు బహుమతులు అందజేశారు. విజేతబృందాన్ని డీఈవో వెంకట లక్ష్మమ్మ, స్కూలు హెచ్‌ఎం వడ్లపట్ల మురళీకృష్ణ, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ సోమయాజులు, డీవైఈవో రవీంద్రభారతి, తదితరులు అభినందించారు.

గణితంలో మెలకువలపై టీచరు ప్రదర్శన ఎంపిక

సులభతరంగా నేర్చుకునే గణితం మెలకువలపై దెందులూరు జడ్పీ హైస్కూలు మ్యాథ్స్‌ ఉపాధ్యాయిని ఎండి.హసీనాబేగం రూపొందించిన ‘మ్యాథ మెటికల్‌ వర్కింగ్‌ మోడల్‌ మ్యాథ్స్‌ మేడ్‌ ఈజీ’ అనే అంశంతో రూపొందించిన ప్రదర్శన దక్షిణభారత సైన్స్‌ ఫెయిర్‌కు ఎంపికైంది.

‘పశ్చిమ’ నుంచి రాయకుదురు విద్యార్థులకు ప్రథమస్థానం

వీరవాసరం(భీమవరంటౌన్‌), డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్‌ ఫెయిర్‌లో ‘నీటి సంరక్షణ విభాగం’లో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు హైసూలు విద్యార్థులు జి.సాయిసుజిత్‌, డి.జయసాయి శ్రీనివాస, గణేష్‌ ప్రదర్శనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘ఎడారిలో మంచును సాంద్రీకరించి ఆ నీటిని తాగునీటి అవసరాలకు ఎలా వాడుకోవచ్చో’ అనే ప్రాజెక్టు ప్రథమ స్థానం పొంది ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి ద్వారా సర్టిఫికెట్‌ అందుకున్నారని హెచ్‌ఎం కానుకొలను శ్రీనివాసరావు తెలిపారు. ఈ విద్యార్థులను గైడ్‌ టీచర్స్‌ పి.గజేంద్రగట్కర్‌, ఎన్‌వీఎల్‌ శ్రీలక్ష్మీదుర్గలను జిల్లా కలెక్టర్‌ నాగరాణి, జిల్లా విద్యాధికారి నారాయణ, డీవైఈవో ఎన్‌.రమేష్‌, రాయకు దురు సర్పంచ్‌ గెడ్డం భారతి, ఎంపీటీసీలు తదితరులు అభినందనలు తెలిపారు

Updated Date - Dec 25 , 2025 | 12:35 AM