Share News

నేడు పాఠశాలలు పునఃప్రారంభం

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:36 AM

ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, టీచర్ల కేటా యింపు, సమగ్రమైన అకడమిక్‌ కేలండర్‌, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా రూపొందించిన సిలబస్‌, తదితర ప్రాధామ్యాలతో వేసవి సెలవుల అనం తరం గురువారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

నేడు పాఠశాలలు పునఃప్రారంభం
మధ్యాహ్న భోజన పథకానికి సిద్ధం చేసిన సన్న బియ్యం

విద్యా సంవత్సరం మొదలైంది..

కొత్త విధానాలతో బోధన

ప్రభుత్వ పాఠశాలలకు నూతన సొబగులు

మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం

పుస్తకాలు, యూనిఫామ్‌, బ్యాగ్‌, భోజనం అన్నీ ఉచితమే!

(భీమవరం రూరల్‌–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, టీచర్ల కేటా యింపు, సమగ్రమైన అకడమిక్‌ కేలండర్‌, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా రూపొందించిన సిలబస్‌, తదితర ప్రాధామ్యాలతో వేసవి సెలవుల అనం తరం గురువారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ బడుల్లో నిలిచిపోయిన పనులకు మన బడి – మన భవిష్యత్‌ పథకంతో మోక్షం లభించ నుంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో జీవో 117 ఉత్తర్వుల తో విధ్వంసానికి గురైన ప్రభుత్వ బడులను పునర్వ్యవస్థీక రణతో కూటమి ప్రభుత్వం బలోపేతం చేయడానికి సంక ల్పించింది. ప్రాథమిక విద్యకు తొలి అడుగుపడే ఒకటో తరగతి నుంచే చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలను ఆశ్ర యించేలా తొలిసారిగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (ఎల్‌కేజీ, యూకేజీ)ను పూర్తి చేసిన పిల్లలందరినీ సమీప ప్రభుత్వ ప్రాథమిక పాఠశా లలో చేర్పించే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయడం విశేషం. కార్పొరేట్‌/ప్రైవేటు పాఠశాలల్లో ఉండే రూ.వేలు, లక్షల ఫీజుల మోత, ఆర్ధికభారంతో నిమిత్తం లేకుండా, ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలలో చేరితే చాలు పుస్తకాలు మొదలుకుని మధ్యాహ్న భోజనం, రాగి జావ, సుశిక్షితు లైన టీచర్లతో అత్యాధునిక విద్యాబోధన వరకు ఉచితమే.

ప్రభుత్వ పాఠశాలల్లో నూతన బోధనా విధానంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. జిల్లాలోని విద్యా సంవత్సరం లెక్క ప్రకారం 1392 ప్రభుత్వ పాఠశాలల్లో 98,235 మంది విద్యార్థులు 344 ప్రైవేటు పాఠశాలల్లో 1,39,826 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది.

ప్రభుత్వ బడుల రూపం మారింది

ఈ విద్యా సంవత్సరం నుంచి 1,392 ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యాబోధనలో మార్పులు చోటు చేసుకు న్నాయి. 186 ఫౌండేషన్‌, 705 బేసిక్‌ ప్రైమరీ, 217 మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు కాగా, పది యూపీ పాఠశాలలు బేసిక్‌ ప్రైమరీగాను, ఆరు యూపీ నుంచి మోడల్‌ ప్రైమరీగాను, ఎనిమిది యూపీలను అప్‌గ్రేడ్‌ చేసి హైస్కూల్స్‌ గాను, 19 యూపీ పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేసి ‘హైస్కూల్‌తోపాటు మోడల్‌ ప్రైమరీగా మార్పు చేశారు. 197 హైస్కూల్స్‌గానే సాగిస్తూ, ఏడు హైస్కూల్స్‌లో బేసిక్‌ ప్రైమరీగా మారనున్నాయి.

ప్రైమరీకి సెమిస్టర్‌ వారీగా పుస్తకాలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైమరీ పాఠశాలల్లో విద్యా బోధనలో ఈ విద్యా సంవత్సరం నుంచి మార్పు చేశారు. రెండు సెమిస్టర్లుగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. పుస్తకాల బరువు భారం తగ్గించడంతోపాటు విద్యాబోధనలో సులువు విధానం చేశారు. ఒకటి నుంచి పది వరకు రెండు సెమిస్టర్లు ఉంటాయి.

విద్యా సామగ్రి అందాల్సి ఉంది

నేటి నుంచి పాఠశాలల విద్యా సంవత్సరం మొదలవుతున్నా విద్యాసామగ్రి పూర్తిగా అందలేదు. 1392 పాఠశాలల్లోని 98 వేల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు 15 రోజుల క్రితమే పాఠశాలలకు చేరాయి. నోట్‌ పుస్తకా లు 6,51,038కి గాను 6,00,878 చేరాయి. బెల్ట్‌లు 61,338 కి 60,821 అందుబాటులో ఉన్నాయి. యూనిఫామ్‌ 93,458కి 13,037, బ్యాగ్‌లు 93,548కి 44,812 చేరాయి. బూట్లు 95,586కి 41,547 మాత్రమే పాఠశాలలకు చేరా యి. డిక్షనరీలు లక్షా 17 పూర్తిగా వచ్చేశాయి.

మధ్యాహ్న భోజనంలో మార్పులు

పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథ కంలో ప్రభుత్వం గత ఏడాది చివరి నుంచి మార్పు లు తీసుకువచ్చింది. జోన్‌ల వారీగా భోజన పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఆరు జిల్లాలు జోన్‌గా ఏర్పాటుచేసి ప్రాంతాన్ని బట్టి మెనూ ఏర్పాటుచేసిం ది. జిల్లాలో 98 వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. ప్లస్‌ పాఠశాలలోను మధ్యాహ్న భోజనం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో ఉపయోగించే బియ్యంలో మార్పు తీసుకువచ్చారు. సన్నబియ్యం 25 కేజీల బస్తాలుగా పాఠశాలలకు ఇప్పటికే పంపించారు.

Updated Date - Jun 12 , 2025 | 12:36 AM