Share News

బడి బస్సు భద్రమేనా?

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:22 AM

రేపటితో వేసవి సెలవలు పూర్తి కానున్నాయి. 12వ తేదీ గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

బడి బస్సు భద్రమేనా?

పూర్తి కాని బస్సుల ఫిట్‌నెస్‌

రేపే పాఠశాలల ప్రారంభం

(భీమవరం క్రైం–ఆంధ్రజ్యోతి):

రేపటితో వేసవి సెలవలు పూర్తి కానున్నాయి. 12వ తేదీ గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు వెళ్లేందుకు చిన్నారులు సిద్ధంగానే ఉన్నప్పటికీ వారు ప్రయాణించే బస్సుల్లో భద్రత ఎంత అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రెండు నెలలపాటు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించినప్పటికీ ఈ రెండు నెలల కాలంలో కొందరు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సులకు మరమ్మతులు చేయించకపోవడం, అధికారుల వద్దకు వెళ్లి ఫిట్‌నెస్‌ చేయించుకోకపోవడం చూస్తుంటే వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు వెళ్ళే బస్సులు సరైన ఫిట్‌నెస్‌ లేక గతంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మం ది పిల్లలు గాయాలపాలయ్యారు. అయినా కొన్ని యాజమాన్యాలు డబ్బుపై ఆశ పడుతున్నారే తప్ప పిల్లల ప్రాణాలపై శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. స్కూల్‌, కళాశాలల బస్సులు రోడ్లపై నడవాలంటే తప్పనిసరిగా రవాణా శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రా లు ఉండాలి. అధికారులు నిర్ధేశించిన నిబంధనలు పాటించాలి. అవేమీ పట్టనట్లు కొందరు వ్యవహరిస్తున్న తీరుపై రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెబుతున్నారు.

900 బస్సులకే ఫిట్‌నెస్‌. 300 మాటేంటి ?

జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల బస్సులు 1200 పైనే ఉన్నాయి. వాటిలో కొన్ని కాలం చెల్లినవి. అధికారుల వద్దకు వచ్చి 900 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందాయి. 300 బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తీసుకోలేదు. రవాణా శాఖ అధికారులు ఎంతో కాలంగా బస్సులకు ఫిట్‌నెస్‌లు చేయించండి అంటూ మెసేజ్‌లు పంపుతున్నా కొందరు యాజమాన్యాలు పట్టించుకోకుండా వదిలివేయడం దారుణం. ఇంకా కొన్ని బస్సులకు మరమ్మతులు,టింకరింగ్‌ పనులు చేయిస్తూనే ఉన్నారు. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిరిగితే భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా.. మార్పు రావడం లేదు.

ఇవీ నిబంధనలు

పాఠశాలల, కళాశాలల బస్సులు రోడ్డుపై తిరగాలంటే రవాణా శాఖనిబంధనలు పాటించాలి. సీట్లు శుభ్రంగా ఉండాలి. 60 ఏళ్లలోపు డ్రైవర్‌ మాత్రమే వాహనాన్ని నడపాలి. డ్రైవర్‌కు ఐదేళ్ల సీనియారిటీ తప్పనిసరి.

బస్సుల కాల పరిమితి 15 ఏళ్లు మించరాదు.

డోరు వద్ద బస్సు రెండు పక్కలా, బస్సు లోపల సెంటర్‌లో తప్పనిసరిగా అద్దాలు ఉండాలి.

బస్సు లోపల ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తప్పనిసరి.

ప్రతి విద్యార్థికి సీట్లలో మాత్రమే కూర్చోబెట్టాలి. ఓవర్‌ లోడ్‌ ఉండకూడదు.

తప్పనిసరిగా బస్సులో అటెండర్‌ ఉండాలి. అతనితోపాటుగా ఒక టీచర్‌ ప్రయాణించాలి.

విద్యార్థుల పేరెంట్స్‌ రోజుకొకరు వాహనంలో ఉండాలి.

డ్రైవర్‌ సీటు వెనుకాల డ్రైవర్‌ ఫొటోతో కూడిన బయోడేటా తప్పనిసరిగా ఉంచాలి.

Updated Date - Jun 11 , 2025 | 12:23 AM