Share News

అమ్మో స్కూల్‌ బస్‌..!

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:14 AM

జిల్లాలో 900 కళాశాలలు, పాఠశాలల బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. కళాశాలలు, పాఠశాలలు మొదలై 40 రోజులు కావస్తున్నా ఇంకా 50 బస్సుల వరకు ఫిట్‌నెస్‌ పొందలేదంటే అర్థం చేసుకోవచ్చు.

అమ్మో స్కూల్‌ బస్‌..!

ఫిట్‌నెస్‌ లేని బస్సులతో ప్రమాదం

కొందరు డ్రైవర్లకు అనుభవలేమి

అతి వేగం ప్రమాదాలకు కారణం

భీమవరం క్రైం, జూలై 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 900 కళాశాలలు, పాఠశాలల బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. కళాశాలలు, పాఠశాలలు మొదలై 40 రోజులు కావస్తున్నా ఇంకా 50 బస్సుల వరకు ఫిట్‌నెస్‌ పొందలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 17న ఇరగవరం మండలంలో అతివేగంగా వెళ్లిన పాఠశాల బస్సు తిరగబడి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. ఈ సంఘటనపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సీరియస్‌ అయ్యారు. అనుభవం లేని డ్రైవర్లు, ఫిట్‌నెస్‌ లేని బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో అధికారులకు పరిశీలన చేయమని ఆదేశించారు.

అనుభవం లేని డ్రైవర్లు..!

కనీసం ఐదేళ్ల అనుభవం గల డ్రైవర్లతో పాఠశాలలు, కళాశాలల బస్సులు నడపాలి. వారికి హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి. వారి వయసు 60 ఏళ్లకు మించి ఉండకూడదు. కంటి చూపు బాగుం డాలి. ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికి కూడా కొన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు డబ్బులకు కక్కుర్తి పడి అనుభవం లేని డ్రైవర్లను పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో పట్టణాల్లో కూడా వారు అతి వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలను తెచ్చిపెడుతున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 50 కిలోమీటర్ల వేగం కన్నా ఎక్కువ స్పీడ్‌ వెళ్లకూడదు. అంతే కాకుండా వాహనాలకు అంతకు మించి వెళ్లే స్పీడ్‌ కూడా పెట్టరు. అయినా కూడా బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్ష అనంతరం కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం వేగాన్ని పెంచేస్తున్నారు. డ్రైవర్లు అతివేగంగా నడిపి ప్రమాదాలు సృష్టిస్తున్నారు.

వేలల్లో వసూలు చేస్తున్న యాజమాన్యాలు

కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు డబ్బే పరమావధిగా ఫీజులు గుంజుతున్నారు. రెండు కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా రూ. 10 వేల వరకు బస్సు ఫీజు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారికి రూ.15 వేల నుండి రూ.25 వేల వరకు బస్సు ఫీజులు వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి, పేద ప్రజలు ఎంతో ప్రయాసలు పడి ఫీజులు కట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో సుమారు లక్షా 38 వేల మంది విద్యార్థులు ఉండగా, అందులో సుమారు లక్ష మంది వరకు బస్సులపైనే కళాశాలలకు, పాఠశాలలకు వెళ్తున్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం బస్సులు నడుపుతున్నప్పటికీ వారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం స్కూల్‌ యాజమాన్యాలపై ఉందని తెలుసుకోవాలని కొందరు కోరుతున్నారు. రవాణా శాఖ నిబంధనలు పాటించి పిల్లలను గమ్యస్థానాలకు రక్షణగా చేర్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

60 కి.మీ. వేగం దాటితే చర్యలు

రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు స్కూల్‌ బస్సులు, కళాశాలల బస్సులను తనిఖీ నిర్వహిస్తున్నాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నాం. గంటకు 60 కిలోమీటర్ల వేగం దాటి వెళ్లకూడదని నిబంధన ఉంది. దానిని మించి ఎవరైనా వెళితే బస్సులను సీజ్‌ చేస్తాం. ఇంకా 50 బస్సుల వరకు ఫిట్‌నెస్‌ పొందవలసిన ఉంది. ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డుపై వాహనాలు నడిపితే ఆ బస్సులను సీజ్‌ చేస్తాం. డ్రైవర్ల లైసెన్స్‌లను పరిశీలించి అనుభవం లేకపోతే వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేస్తాం. పాఠశాల, కళాశాల యాజమాన్యాలు బస్సుల విషయంలో నిబంధనలు పాటించాలి.

– ఉమామహేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి

Updated Date - Jul 19 , 2025 | 12:14 AM